Friday 22 April 2022

57 రోజుల యుద్ధం తర్వాత...


ఫేస్‌బుక్‌తో కొన్ని బాధలున్నాయి, కొన్ని సంతోషాలున్నాయి. మనం మర్చిపోవాలనుకుంటున్నవి గుర్తుచేస్తుంది. మన సంతోషాన్ని రెట్టింపు చేసేవాటిని కూడా గుర్తుచేస్తుంది. ఈ రెండవ కారణం వల్లనే నేనింకా ఫేస్‌బుక్‌కు అంతో ఇంతో అతుక్కుపోయి ఉన్నాను. 

కట్ చేస్తే - 

ఇవ్వాళ కాత్యా పుట్టినరోజు... 

ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా పొద్దున్నే కాత్యాకు గ్రీటింగ్స్ చెప్పాను. అదొక ఫార్మాలిటీ. కాని, ఇప్పుడు కాత్యాకు సంబంధించిన రియాలిటీ వేరే. అదే ఈ బ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటున్నాను.    

కాత్యా యూక్రేన్ పౌరురాలు. బాగా చదువుకొంది. మంచి అందకత్తె, అంతకు మించిన అద్భుతమైన కమ్యూనికేటర్. 

కాత్యా ఐవజోవా తన పూర్తిపేరు. అంతర్జాతీయస్థాయి మోడల్, డాన్సర్, ఆర్టిస్టు. నా ఫ్రెండ్ కూడా. మొన్నటి నా ఫీచర్ ఫిలిం ప్రాజెక్ట్‌లో నాతో కలిసి పనిచేసింది.    

యూక్రేన్, రష్యాల్లో ఉన్న ఇంకొందరు నా ఫ్రెండ్స్‌తో పాటు కాత్యా పరిస్థితి కూడా ఏంటో నాకు పూర్తిగా తెలుసు. యుద్ధం కాబట్టి, దాదాపు రెగ్యులర్‌గా తనతో మాటాడుతున్నాను.

యుద్ధం ప్రారంభరోజుల్లో ఖార్కీవ్‌లో, తన ఇంట్లో ఉన్న బంకర్లో తన కుటుంబంతో పాటు గడిపింది. కాత్యా అక్క కూతురు నెలల పాప విక్తోర్యా కూడా గాలి సరిగ్గా ఆడని అదే బంకర్‌లో చాలా రోజులుంది. 

తర్వాత - అంత భీకరంగా ఖార్కీవ్‌లో బాంబింగ్ జరుగుతుండగానే తన అక్కను, ఆమె పిల్లల్ని కార్లో తీసుకెళ్ళి సుమారు 1100 కిలోమీటర దూరంలో ఉన్న పోలండ్ చేర్చింది... వాళ్లక్కడ సేఫ్‌గా ఉంటారని. 

తర్వాత మళ్ళీ తనొక్కతే పోలండ్ నుంచి తన కారులో తిరిగి ఖార్కీవ్ చేరుకొంది. అది మార్చి 19. 



ఆ తర్వాత వారం రోజుల్లో ఖార్కీవ్ మొత్తం నేలమట్టమైంది. వాళ్ల ఇల్లు, బంకర్‌తో సహా. 

ఆ సమయంలో కాత్యా హాస్పిటల్లోనే ఉంటూ హాస్పిటల్ డ్యూటీ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు యూక్రేన్ ఆర్మీ కోసం వాలంటరీగా పనిచేసింది. ఇంకా ఆర్మీకి చెందిన వివిధ పనుల్లో యాక్టివ్‌గా పనిచేస్తోంది. 

ఒక్కోరోజు ఒక్కో చోట. ఒక్కోరోజు ఒక్కో పని. అంతా ఆర్మీలోనే.               

"ఎన్ని రోజులు ఇట్లా...?" అని మొదటి నాలుగైది రోజులప్పుడు అడిగినప్పుడు కాత్యా ఒక్కటే మాట చెప్పింది. "ఇది వార్. అంత త్వరగా ముగియదు" అని. 

కాత్యా చెప్పినట్టే జరుగుతోంది. 

తాజాగా మే 15 కు అంతా సెట్ అయిపోవచ్చు అని ఒక రూమర్. కాని, అది నిజంగా రూమరే అని కాత్యా చెప్పింది. 


ఒక్క నిమిషం ఇది చదవటం ఆపి ఆలోచించండి... 

కాత్యా లాగా వేలాదిమంది స్త్రీల పరిస్థితి అక్కడ అలాగే ఉంది. ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో ఇప్పటికీ అంతే.   

ఈ పరిస్థితితో పోల్చినప్పుడు మనదేశం ఎంత సురక్షితంగా ఉంది? కాని, కావాలని రాజకీయ స్వార్థం కోసం కొంతమంది క్రియేట్ చేస్తున్న గొడవలు మనల్ని, మనదేశాన్ని ఏ వైపు తీసుకెళ్తాయో ఒక్క క్షణం అలా ఊహించండి.     

కట్ చేస్తే - 

పుతిన్ యూక్రేన్ మీద యుద్ధం ప్రారంభించి 57 రోజులు గడిచినా తాను అనుకున్నది ఇంకా సాధించలేకపోయాడు. 

లేటెస్టుగా 24 గంటల క్రితం మరియుపోల్ ఒక్కటి మాత్రం ఆక్రమించుకోగలిగాడు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో రష్యా తన స్ట్రాటెజీ మార్చి యుద్ధాన్ని మరింత భీకరం చేయబోతోందని అటు రష్యానుంచి, ఇటు యూక్రేన్ నుంచీ చెప్తున్నారు. 

రష్యాకు దాని లక్ష్యం దానికుంది. కొంచెం ఆలస్యమైనా సాధిస్తుంది. కాని, ఇవతలివైపు యూక్రేన్ సైన్యం ఎంతో శక్తివంతమైనదైనా ఎక్కువకాలం ప్రతిఘటించలేదు. యూక్రేన్‌కు సహాయంగా ఏ ఒక్క దేశం కూడా తోడు రాదు. అమెరికాతో సహా. 

యూక్రేన్ ప్రెసిడెంట్ జెలెన్స్‌కీని బాగా ఎక్కించి, రెచ్చగొట్టి, ఎన్నెన్నో హామీలిచ్చి ముందుకుతోసిన అమెరికా గాని, ప్రముఖమైన ఇంకో నాలుగైదు దేశాలు గాని ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా లేవు. ఉండవు కూడా. 

కాని - ఈ యుద్ధం ఇంకొన్నాళ్ళు సాగాలన్నది మాత్రం వారి లక్ష్యం. 

ఆ లక్ష్యం వారి సాధించారు. 

ఎందుకంటే - ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక మూలన ఒక యుద్ధం జరుగుతుండాలి. అలా జరిగేలా చేస్తుండాలి. అప్పుడే వారికి ఆదాయం. ఆ అరడజన్ దేశాల్లోని ఆయుధ కర్మాగారాల్లో పని జోరుగా సాగుతుంది. ఆదాయం కూడా బాగా వస్తుంది. 

ప్రపంచ రాజకీయాల్లో ఇదొక పెద్ద ఈక్వేషన్.    

ఇవ్వాళ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా రాక వెనకాల కూడా లక్ష్యాలు ఇంచుమించు ఇలాంటివే అంటే ఎవరైనా నమ్ముతారా? 

రూమరే కావచ్చు... కాని, అది నిజం కావాలనీ, ఈ 'మే 15' కు రష్యా-యూక్రేన్ దేశాల మధ్య ఈ యుద్ధం ఆగిపోవాలనీ ఆశిస్తున్నాను.     

Happy Birthday, Dear Katya! 

С днем рождения...

No comments:

Post a Comment