Wednesday 30 March 2022

స్త్రీలు తప్పకుండా రాయాలి... వారు అనుకున్నది రాయాలి!


మొన్న మార్చి 28వ తేదీ సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ "రైటింగ్ టేబుల్" ను ఇందాకే ఫేస్‌బుక్‌లో చూశాను. 

అది... స్త్రీలు, వారి రచనా వ్యాసంగం గురించి, వారికుండే ఇబ్బందుల గురించీ... ఎవరు రాశారో గాని, చాలా బాగా రాశారు . అందులో అన్నీ కాదనలేని నిజాలే. 

అయినా సరే - 

నిజంగా రాయాలనుకునే స్త్రీలను ఏ పరిస్థితులూ ఆపలేవు, ఎవరూ ఆపలేరని నేను గట్టిగా నమ్ముతాను. 

దీనికి నేను రెండే రెండు ఉదాహరణలివ్వగలను: 

ఒకరు జె కె రౌలింగ్, ఇంకొకరు శోభా డే. 

సింగిల్ మదర్‌గా పిల్లలను పోషించుకొంటూ, ఎన్నెన్నో పనులు చేసుకొంటూ రౌలింగ్ ఒక రచయిత్రిగా ఎదిగింది. ఎంతలా ఎదిగిందంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి బిలియనేర్ వుమన్ రైటర్ స్థాయికి ఎదిగింది. తర్వాత తనదగ్గరున్న డబ్బులో చాలా భాగం చారిటీలకు ఇచ్చి, ప్రపంచపు రిచెస్ట్ రైటర్‌గా, జె కె రౌలింగ్ ఇప్పుడు రెండో స్థానంలో ఉంది.  

శోభా డే, దిలీప్ డేను రెండో వివాహం చేసుకొంది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. డివోర్సీ అయిన దిలీప్‌కు కూడా ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరికీ ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ ఆరుగురికి సంబంధించిన చదువులు, ఇతర విషయాలు చూసుకొంటూ, సాంప్రదాయిక ఇళ్ళల్లోని హిందూ సంప్రదాయాలు, పండగలు వంటివి ఒక్కటీ మిస్ అవ్వకుండా పాటిస్తూ (ఆమెకు ఇష్టం!), దిలీప్‌తో హాలిడేలు తిరుగుతూ... ఎన్నో నవలలు రాసింది. నాన్ ఫిక్షన్ రాసింది. టీవీకి సీరియల్స్ రాసింది. ఫ్రీలాన్స్ రైటర్‌గా, కాలమిస్ట్‌గా వేలకొద్దీ ఆర్టికిల్స్ రాసింది. ఇప్పుటికీ తన 70+ వయస్సులో ఇంకా రాస్తోంది. 

మామూలుగా స్త్రీలు 'ఇవి' రాయకూడదు, 'అవి' రాయకూడదు అనే సమాజంలోని ఇన్‌డైరెక్ట్ రూల్స్‌ని పట్టించుకోకుండా... సెక్స్, హోమోసెక్స్కువాలిటీ, సెలెబ్రిటీలు, వీఐపీల 'ఎవరినీ పట్టించుకోని' జీవనవిధానాలు వంటి అంశాల్ని కూడా "స్ట్రేంజ్ అబ్‌సెషన్", "స్టారీ నైట్స్" వంటి తన నవలల్లో అలవోకగా రాసుకుంటూ వెళ్ళింది. 

ఇది నచ్చని చాలామంది ఆమెను "బూతు రచయిత్రి" అంటూ, "ఇండియన్ డానియల్ స్టీల్" అంటూ ఆనందిస్తుంటారు. కాని, ఆమె రచనల మీద ఆక్స్‌ఫర్డ్ స్థాయి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎందరో అధ్యయనాలు చేశారు, చేస్తున్నారు. 

తనకు 70 ఏళ్ళు వచ్చాక "సెవెంటీ... అండ్ టు హెల్ వితిట్!" అనే పుస్తకాన్ని కూడా రాసింది శోభా డే. పెంగ్విన్ రాండమ్‌హౌజ్ పబ్లిష్ చేసిందా పుస్తకాన్ని.   

రచయితలుగా ఎదగాలనుకునే స్త్రీలు, అనుకున్నది రాయాలనుకునే స్త్రీలు... జె కె రౌలింగ్, శోభా డే ల జీవితాల్ని చదవాలి. 

శోభా డే "సెలక్టివ్ మెమొరీ" రైటర్స్‌కు సంబంధించి నేను చదివిన మంచి ఆటోబయోగ్రఫీల్లో ది బెస్ట్...  అది కూడా చదవాలి. 

ముంబైలోని ఒక సాంప్రదాయిక మిడిల్ క్లాస్ అమ్మాయి... ఎలా మోడల్ అయింది, తర్వాత రిపోర్టింగ్, ప్రెస్, మ్యాగజైన్ ఎడిటర్, రైటర్, సెలెబ్ పార్టీలు, అక్కడి జీవితాలు... ఇన్ని దశల్ని శోభా డే ఎలా చకచకా దాటుకుంటూ వెళ్ళింది...  అవన్నీ శోభా డే మీద చూపిన ప్రభావం...  ఇవన్నీ రచయిత్రులకు  కావల్సినంత ఇన్‌స్పిరేషన్‌ను ఇస్తాయి. రైటర్‌గా తమ పూర్తి పొటెన్షియాలిటీని కాగితం పైనో, కంప్యూటర్ పైనో పెట్టేలా చేస్తాయి. ప్రపంచానికి పరిచయం చేస్తాయి. 

నిజానికి ఈ ఇద్దరి జీవితం గురించి ఆడ, మగ అనేం లేదు... అందరూ చదవాలి. రైటర్స్ అందరికీ మంచి ఇన్‌స్పిరేషన్.        

ఈ ఇద్దరు రచయిత్రులు ఎదుర్కొన్న పరిస్థితులు, ఇబ్బందులు, కట్టుబాట్ల ముందు బహుశా వేరే ఏ ఇతర పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు నిలబడవు.  ఏవైనా చెప్పుకోవాలనుకున్నా అవన్నీ కేవలం సాకులే అనిపిస్తాయి. 

నాకు తెలిసిన ఈ రెండు ముక్కలు షేర్ చేసుకొంటూ - 

నేను ఎక్కువగా చదవలేదు. కాని, నేను చదివిన రచయిత్రుల్లో, నా టీనేజ్‌లో యద్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన నవలలు బాగా చదివాను. లత సాహిత్యం నన్ను అప్పట్లో బాగా ఇంప్రెస్ చేసింది. తర్వాత - నా యూనివర్సిటీ రోజుల్లో నేను చదివిన ఓల్గా, కుప్పిలి పద్మ రచనలు ప్రత్యేకం. ఇంకా ఎందరెందరో రచయిత్రులున్నారు. ఎలాంటి పరిధులు, పరిమితులు వీరి రచనా వ్యాసంగాన్ని అడ్డుకోలేకపోయాయి. రచన పట్ల వీరికున్న ప్యాషన్ ముందు ఇంకేవీ నిలబడలేదు. 

ఈ డిజిటల్-సోషల్ మీడియా యుగంలో అయితే, అసలేదీ అడ్డురావడానికి వీల్లేదు.            

స్త్రీలు తప్పకుండా రాయాలి. వారు అనుకున్నది రాయాలి. 

వారు అనుకుంటే ఏదీ అసాధ్యం కాదు.                        

2 comments:

  1. ఇలాంటి స్ఫూర్తినిచ్చే వ్యాసాలు , ఎందరో కొత్త రచయితలకు బూస్టర్ డోసు లాగా పనిచేస్తాయి.

    ReplyDelete