Wednesday 23 March 2022

ఎవరీ హంస?

నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ చదివినప్పటి జ్ఞాపకం ఈ హంస.

మా క్లాస్‌లో సుమారు ఓ డజన్ మంది అమ్మాయిలుండేవాళ్లు. ఆ డజన్ మంది గాళ్ స్టుడెంట్స్‌లో కనీసం ఓ నలుగురో, అయిదుగురో ఆంటీలు కూడా ఉండేవాళ్లు. వారిలో కొందరు పెళ్లయి పిల్లలున్నవాళ్లు. కొందరు అప్పటికే మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు.

ఆ నలుగురయిదుగురు ఆంటీలను నేనెప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు... గమనించలేదు. నా క్లాస్‌మేట్స్ కొందరు మాత్రం ప్రత్యేకంగా వాళ్లకే లైనేసేవాళ్లు.. అది వేరే విషయం.

ఒకరోజు - "అబ్స్‌ట్రాక్టింగ్ అండ్ ఇండెక్సింగ్" సబ్జెక్టును అద్భుతంగా చెప్పే మా వేణుగోపాల్ సర్ క్లాస్‌కి ఒక ఆంటీ చాలా లేట్‌గా వచ్చింది. వచ్చి అలా గమ్మున కూర్చోకుండా, పక్కనున్న స్టుడెంట్‌తో ఏ టాపిక్ చెప్తున్నారు... వగైరా ఎంక్వయిరీ చేయసాగింది గుసగుసగా.

అసలే డిస్టర్బ్ అయిన వేణుగోపాల్ సర్ ఆమెను చడమడా తిట్టేశారు. బోరున ఏడ్చేసింది మా క్లాస్‌మేట్.

అలా నా దృష్టిలో మొదటిసారిపడిన అప్పటి నా క్లాస్‌మేట్ పేరు హంస. 

మనం మామూలుగా "హంస" అనే ఉచ్ఛరిస్తాము. తను మాత్రం "హన్స" అనేది. ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్ కూడా తనది 'Hansa' అనే ఉందేది వెరైటీగా. 

ఆ తర్వాత మా మధ్య జరిగిన కొన్ని సంభాషణల్లో బయటపడ్డ విషయమేంటంటే, అప్పటికి సుమారు పదేళ్లక్రితం హంస "మాభూమి" సినిమాలో నటించింది. 

సాయిచంద్‌తో లంబాడి చంద్రి పాత్రలో... 

ఒక్కసారిగా షాక్!

ముందు నమ్మలేకపోయాను. కానీ తర్వాత జాగ్రత్తగా గమనించాను. నిజమే, పోలికలు అవే. కానీ, ఈ పదేళ్లలో కొంచెం లావెక్కింది హంస. 

పాలరాతి బొమ్మలా గుండ్రంగా ఉండే ఆ హంసకు తెలుగు రాదు. మరాఠీ అమ్మాయి అని తర్వాత తెలిసింది. నోట్స్ కోసమో, ఇంకేదయినా మాట్లాడ్డం కోసమో హంస నా వైపు వస్తున్నపుడల్లా తప్పించుకొనే ప్రయత్నం చాలా చేసేవాణ్ణి.  

కట్ టూ నా ఇంగ్లిష్  - 

హంస నోరు తెరిస్తే ఇంగ్లిష్. ఆమె రేంజ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడ్డానికి నాకు అప్పట్లో చాలా భయం. కొద్దిరోజుల తర్వాత నాలో ఉన్న ఆ భయాన్ని తనే ఎగరగొట్టేసిందనుకోండి... తెగ మాట్లాడీ, మాట్లాడించీ.

లైబ్రరీకి ప్రాక్టికల్స్ కోసం వస్తున్నానని చెప్పి నేను వెళ్లకపోవడమో, తనకు ఏదయినా నోట్స్ ఇస్తానని చెప్పి టైమ్‌కు నేను ఇవ్వకపోవడమో మా మధ్య చాలా కామన్‌గా జరిగేది. అలా మిస్ కావడానికి కారణం అప్పటి నా హాస్టల్ లైఫ్. లేదా, నా రష్యన్ డిప్లొమాలోని అమ్మాయిలతో క్యాంపస్‌లోని చెట్లక్రింది క్యాంటీన్ దగ్గర ఎడతెగని కబుర్లు.

ఇలాంటి ఒక సందర్భంలోనే... అప్పటికి నాకు తెలియని, నేను అప్పటివరకూ వాడని ఒక ఇంగ్లిష్ వర్డ్‌ను హంస నోటివెంట విన్నాను. ఆ మాట ఇప్పుడెప్పుడయినా నేనే వాడినా, ఇంకెవరి నోటనయినా విన్నా... నాకు అప్పటి నా క్లాస్‌మేట్ హంసనే గుర్తుకొస్తుంది.

"Hey, don't ditch me!"

తనొక్కతే ఉన్నప్పుడు... ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండే అప్పటి నా క్లాస్‌మేట్ హంస ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనిపించలేదు. 

ఎవరికయినా తెలిస్తే చెప్పండి. దాదాపు పాతికేళ్ళు దాటి ఉంటుంది మేం కలిసి... 

కనీసం ఒక "హాయ్" చెప్తాను. 

No comments:

Post a Comment