Saturday 8 January 2022

'చిన్న బడ్జెట్ సినిమా' అంత చిన్నదేం కాదు!

ఈ ప్రపంచం మొత్తం "డ్యూయాలిటీ" మీద నడుస్తుంది. ధనిక-పేద, ఆడ-మగ, కింద-మీద, నలుపు-తెలుపు, దొడ్డు-సన్నం, పొడుగు-పొట్టి, దూరం-దగ్గర, నవ్వు-ఏడుపు, సుఖం-దుఖం, లాభం-నష్టం, హిట్-ఫ్లాప్, చిన్న-పెద్ద ఎట్సెట్రా. 

డ్యూయాలిటీలో రెండిటికీ విలువ ఉంటుంది. మధ్యలోదంతా ఉట్టి ట్రాష్. దానికసలు విలువుండదు.  

ఉదాహరణకు, సినిమాల్లో హిట్, ఫ్లాప్ అని రెండే ఉంటాయి. నో మిడిల్ గ్రౌండ్. యావరేజ్ అనేది ఉట్టి భ్రమ. దానికి అర్థం లేదు. డబ్బులొచ్చాయా హిట్ సినిమా. రాలేదంటే ఫ్లాప్. అంతే.   

అలాగే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు. అంతవరకే. మిడ్ రేంజ్ హీరోలు, మిడిల్ క్లాస్ సినిమాలు అనేం ఉండవు. ఉన్నాయి అనుకొని ఎవరైనా భ్రమపడ్డా అదంతా లెక్కలోకి రాదు. 

కట్ చేస్తే - 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి ఒక 10 కంటే ఎక్కువ ఉండవు. ఈ పెద్ద సినిమాల మొత్తం బడ్జెట్ సుమారుగా ఒక 1000 కోట్లు ఉంటుందనుకుందాం. ఈ 10 సినిమాల నిర్మాతలు, వీటిల్లో పనిచేసే హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టు, టెక్నీషియన్స్ అంతా కలిపి ఒక 200 మందికి మించి ఉండరు. 

పెద్ద సినిమాలు ఎంత భారీ రేంజ్‌లో హిట్ అయినా సరే... ఆ లాభాలు, ఆ స్థాయి రెమ్యూనరేషన్స్, ఖర్చులు అన్నీ ఈ 200 మంది మాత్రమే పొందుతారు, అనుభవిస్తారు. నష్టమొస్తే - ఆ 10 సినిమాల నిర్మాతలు, బయ్యర్లవరకే. 

చిన్న బడ్జెట్ సినిమాలు అలా కాదు. ఇవి సంవత్సరానికి కనీసం ఒక 150 దాకా తయారవుతాయి. అంతా కలిపి, ఈ 150 సినిమాల బడ్జెట్ ఒక 300 కోట్లే ఉండొచ్చు. కాని, ఈ 150 సినిమాల మీద ఆధారపడి ఒక 5 వేల కుటుంబాలు బ్రతుకుతాయి. 

వివిధరూపాల్లో ఇండస్ట్రీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి కూడా ఈ 150 చిన్న సినిమాలే. 

వారసత్వంగా వచ్చే హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కాకుండా - సొంత కెపాసిటీతో అవకాశాలు సంపాదించుకొని, పైకొచ్చే ఫ్యూచర్ స్టార్స్, మెగా స్టార్స్ అంతా కూడా ఈ చిన్న సినిమాల ద్వారా మాత్రమే ముందు పరిచయమవుతారు. 

అయితే - చిన్న సినిమాల ద్వారా పైకొచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా పైకొచ్చాక ఇదే చిన్న సినిమాలను చాలా చిన్న చూపు చూస్తారు.

కాని - హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఈ చిన్న బడ్జెట్ సినిమాలు మొదటినుంచీ తమ ప్రత్యేక ఉనికిని నిలబెట్టుకుంటూనే ఉన్నాయి. 

ఇప్పుడు, కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్‌లో వచ్చిన ఎన్నో కొత్త పరిణామాలు, ఈ చిన్న బడ్జెట్ సినిమాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచాయి. కొత్తగా ఓటీటీ వంటి మరెన్నో లాభాలకు ద్వారాలు తెరిచాయి.  
***

#Cinema #BigBusiness #TeluguCinema #Tollywood #SmallBudgetCinema #LowBudgetFilms #MicroBudgetMovies #ManoharChimmani #NagnaChitram #MyBlog #TeluguBlog

No comments:

Post a Comment