Friday 17 December 2021

సినిమాలో కథారచయిత స్థానం ఎక్కడ?

చాలా సార్లు ప్రి-రిలీజ్ ఈవెంట్స్‌లో నాకు నచ్చని ఒక విషయం గమనించాను... కొవిడ్ లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత కూడా. 

మొన్న వరంగల్‌లో జరిగిన శ్యామ్ సింగరాయ్ ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో కూడా ఇదే విషయం గమనించాను. 

ఎంతసేపూ కెమెరామన్ బాగా చూపించాడు, ఎడిటర్ బాగా కష్టపడ్డాడు, ఆర్ట్ డైరెక్టర్ నిద్రపోలేదు, నిర్మాత బాగా ఖర్చుపెట్టాడు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో టీమ్ అంతా అసలు నిద్రపోలేదు... అని ఇవన్నీ ప్రతి ఒక్కరూ చెప్తారు.

కాని, అంత పెద్ద ప్రాజెక్టుకి పునాదిలాంటిది అయిన కథ గురించి, కథా రచయిత గురించి మాత్రం చెప్పరు! 

హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ కూడా అంతే. ఒక్క రచయిత పేరు తప్ప... మిగిలిన అందరినీ మెచ్చుకుంటారు, పదే పదే థాంక్స్ చెప్తారు. రచయిత మాత్రం ఏ ఒక్కరికీ గుర్తుకురాడు. 

ఇలాంటి సంస్కృతి ఈమధ్యే వచ్చింది. అంతకు ముందు ఇలా లేదు. సినీ కథా రచయితకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు. మంచి గౌరవం ఉందేది.    

కట్ చేస్తే - 

ఇప్పుడు డైరెక్టర్స్‌లో దాదాపు 60 శాతానికి పైగా కథ కూడా వారే రాసుకుంటున్నారు. అది వేరే విషయం. కాని, కథ వేరే వ్యక్తి అందించినప్పుడు ఆ రచయిత పేరు చెప్తే వచ్చే నష్టం ఏంటి వీరికి? 

"రచయిత ఫలానా సో అండ్ సో. ఈ సినిమాకు మంచి కథ అందించారు" అని ఒక్క మాట చెప్తే ఏం పోతుంది? అందరికీ ఇచ్చినట్టు స్టోరీ రైటర్‌కూ ఒక్క నిమిషం మైక్ ఇవ్వచ్చు కదా? సమస్య ఎక్కడ? 

అంత ఇన్‌సెక్యూరిటీనా? కథ వేరే రచయితది అని చెప్తే డైరెక్టర్ వాల్యూ ఏమైనా పడిపోతుందా? రచయితకు ప్రమోషన్ ఇవ్వటం ఎందుకు అనా? 

ఆ రచయిత కథ విని ఇంప్రెస్ అయ్యే కదా ఆ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ప్రాజెక్టుకి ఒప్పుకొంది? కథ లేకుండా సినిమా ఎలా ఉంటుంది? 

ఇలాంటి చిన్న చూపు... విజయేంద్రప్రసాద్ గారి విషయంలో చెయ్యగలరా? 

నిజానికి విజయేంద్రప్రసాద్ గారికి ఒక కథా రచయితగా ఇలాంటి ఫంక్షన్స్‌లో మాట్లాడే అవకాశం కూడా ఎక్కువ ఇస్తారు. అలా ఇవ్వాలి కూడా. 

నా ఉద్దేశ్యంలో ఇది కథా రచయిత పట్ల గౌరవం లేకపోవడం, చిన్నచూపు మాత్రమే కాదు. కావాలని ఇలా చేసే ఆయా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్, హీరోహీరోయిన్స్ మీన్ మెంటాలిటీని కూడా ఇది బహిర్గతం చేస్తుంది.

వాళ్లేంటో వాళ్లకై వాళ్లే చెప్పుకోవడమన్నమాట! 
***

#TeluguCinema #Writer #ScreenplayWriter #ScriptWriter #Tollywood #ManoharChimmani #NagnachitramBlog #WriterValue #FilmWriter #MovieWriter

1 comment:

  1. మీరన్నది సరిగా ఉంది. సినిమాకు కథయే ప్రాణం. అది సరిగా లేకపోతే మరెన్ని గొప్పగొప్పగా ఉన్నా అన్నీ‌ శవాలంకరణలే. కథారచయితకే అగ్రతాంబూలం ఇవ్వాలి తప్పకుండా

    ReplyDelete