Wednesday 15 December 2021

బాపుగారి బొమ్మ

బాపుగారి బొమ్మ అంటే మామూలుగా అయితే రెండర్థాలు స్పురిస్తాయి:

బాపు గీసిన బొమ్మ, బాపు సినిమాలో హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయి. 

ఈ రెండూ కాకుండా, సుమారు 15 ఏళ్ళక్రితం చెన్నైలోని వారి ఇంట్లో బాపుగారిని కలిసినప్పటి సంగతులు ఇప్పుడు నేను రాస్తున్నాను.

అప్పట్లో నేను రాయదల్చుకున్న ఒక పుస్తకం కోసం కొంతమంది నేను ఎన్నికచేసుకొన్న దర్శకులను కలవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఒక మధ్యాహ్నం వారి టైమ్ తీసుకొని బాపుగారి ఇంటికి వెళ్లాను. నాతోపాటు నా మిత్రుడు, కోడైరెక్టర్ వేణు కూడా వచ్చాడు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి, సాయంత్రం 7 మధ్యలో – సుమారు 5 గంటలపాటు బాపుగారితో మాట్లాడుతూ, వారి ఇంటర్వ్యూను ఆడియో రికార్డు చేశాను.

అసలు బాపుగారితో పక్కపక్కనే ఒకే సోఫా మీద కూర్చొని, వారితో అన్ని గంటలపాటు ముచ్చటించటం, వారి ఇంటర్వ్యూని రికార్డ్ చేయటం అనేది నిజంగా అదొక గొప్ప అనుభవం.

బాపుగారు కేవలం ఒక చలనచిత్ర దర్శకుడే కాదు… ఒక అంతర్జాతీయ స్థాయి పెయింటర్, ఇల్లస్ట్రేటర్, కార్టూనిస్ట్, స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఆర్టిస్ట్, డిజైనర్ కూడా.

1964 లోనే యునెస్కో స్పాన్సర్ చేసిన ఒక అంతర్జాతీయ సెమినార్లో చిల్డ్రెన్స్ బుక్స్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన మేధావి. వాల్టర్ థామ్సన్, ఎఫిషియెంట్ పబ్లిసిటీస్, ఎఫ్ డి స్టీవార్ట్స్ వంటి అంతర్జాతీయ స్థాయి యాడ్ ఏజెన్సీలకు గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న బహుముఖప్రజ్ఞాశాలి. 1960 ల్లోనే ఫోర్డ్ ఫౌండేషన్‌ తరపున ది సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కు ఆర్ట్ కన్సల్టెంట్‌గా పనిచేశారాయన. అదంతా కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వంటివి లేని కాలం అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి.

అప్పట్లో పబ్లిష్ అయిన ప్రతి తెలుగు నవలమీద, ప్రతి కథా సంకలనం మీద, వీక్లీల కవర్లపైన, మ్యాగజైన్ల వార్షిక సంచికలమీద… బాపు గారి ముఖచిత్రం మాత్రమే ఎక్కువగా ఉండేది. అలాంటి ముఖచిత్రాలు ఎన్ని వందల పుస్తకాలకు వేశారన్నది చెప్పటం కష్టం. బహుశా ఆ సంఖ్య వేలల్లోనే ఉండొచ్చు.

దర్శకుడిగా బాపు చేసిన దాదాపు 48 సినిమాల్లో 10 హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా కూడా ఉంది. వారి సినిమాలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. అవార్డులు, రివార్డులు గెల్చుకొన్నాయి.

బాపు గారికి కూడా 2013లో పద్మశ్రీ అవార్డుతో పాటు అంతకు ముందే ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఒక దశలో హిందీలో ఒక టాప్ హీరోగా వెలిగిన అనిల్ కపూర్‌ను, తెలుగులో వంశవృక్షం చిత్రం ద్వారా మొట్టమొదటగా వెండితెరకు పరిచయం చేసింది బాపుగారే అవటం ఒక గమ్మత్తైన విశేషం.

బాపుగారు షూటింగ్‌కు ముందే తాను తీయబోయే ప్రతి షాట్‌నూ స్టోరీబోర్డ్ రూపంలో గీసుకుంటారు. సినిమాల్లో వారి ఫ్రేమ్స్ అన్నీ వారు గీసిన స్టోరీబోర్డులో బొమ్మల్లాగే ఉండటంలో ఎలాటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా వారి సినిమాల్లో హీరోయిన్స్… వారి కళ్ళు, క్లోజప్స్, చీరెకట్టు, నడుము వొంపులు, వాలు జడ, కాళ్ళు, పాదాలు…

వారి చాలా సినిమాల స్టోరీబోర్డులను వారి ఇంట్లోనే స్వయంగా చూసిన అతికొద్దిమందిలో నేనూ ఒకన్ని.

అప్పట్లో తెలుగు కాస్త బాగా రాయగలిగిన దాదాపు ప్రతి యువకుడూ, ప్రతి కవీ, ప్రతి రచయితా తమ చేతి వ్రాతను బాపుగారి స్టయిల్లో రాసే ప్రయత్నం చేసేవారంటే అతిశయోక్తికాదు. బాపు రైటింగ్ శైలి ప్రభావం నామీద కూడా బోలెడంత వుంది. 

ఏదైనా కథ రాస్తున్నప్పుడో, ఇంకేదైనా ఆర్ట్ వర్క్ ఉన్నప్పుడో... తెలుగులో ఏదైనా టైటిల్-లేదా-హెడ్డింగ్ రాయాల్సిన అవసరం ఉన్నా కూడా... నేను నాకు తెలియకుండానే బాపు గారి శైలిని అనుకరిస్తూ రాసేస్తాను. నా పెళ్ళిపత్రికను కూడా నేనే స్వయంగా రాసుకొని, బాపు గారి స్టైల్‌లోనే బార్డర్ వేసి, స్క్రీన్ ప్రింట్ చేయించాను... 

మనకు తెలీకుండానే అదలా జరిగిపోతుంది. బాపుగారి శైలి ప్రభావం!  

కట్ చేస్తే –

నేను బాపుగారింటికి వెళ్ళినరోజు ఇంట్లో ఎవరూ లేరనుకొంటాను. ఒకసారి వాళ్ల అబ్బాయి, మరొకసారి స్వయంగా బాపుగారే అందించిన కాఫీ త్రాగటం మర్చిపోలేని జ్ఞాపకం.

వారి ఇంట్లో కూర్చున్న ఆ 5 గంటలూ నన్ను “మీరు” అని, “మనోహర్ గారు” అని పిలవటం నేను చాలా ఇబ్బందిపడిన విషయం. నాకు తెలిసి, బాపుగారు వారి అసిస్టెంట్స్‌ను కూడా “మీరు” అనే పిలుస్తారట.

ఇంటర్వ్యూ నడుస్తుండగా, 90 నిమిషాల ఆడియో క్యాసెట్ సరిపోదన్న విషయం ముందే గుర్తించిన నా మిత్రుడు వేణు బయటకెళ్ళి వేగంగా ఇంకో క్యాసెట్ కొనుక్కొచ్చిన విషయం నాకింకా గుర్తుంది.

వీటన్నిటినీ మించి బాపుగారికి సంబంధించి నేను చెప్పదల్చుకొన్న మరొక అద్భుత విషయాన్ని గురించి ఇప్పుడు చివరగా చెప్తున్నాను... 

అది… బాపుగారి “వర్క్‌రూమ్-కమ్-స్టడీరూమ్.”

బాపు గారి వర్క్‌రూమ్ ఒక పెద్ద హాల్ సైజులో ఉంటుంది. దానికి రెండువైపులా ద్వారాలుంటాయి. చుట్టూ వున్న నాలుగు గోడలు పూర్తిగా నిలువెత్తు ర్యాక్స్‌తో ఫిక్స్‌చేసివుంటాయి. వందలాది పుస్తకాలు.

హాల్ మధ్యలో వేర్వేరుచోట్ల కూర్చొని పనిచేసుకోడానికి అక్కడక్కడా రెండు బీన్ బ్యాగులు, చిన్న చిన్న పీటల్లాంటి కుషన్లు. ఎక్కడ కూర్చొంటే అక్కడే ఆర్ట్, రైటింగ్ సెటప్… బ్రష్షులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇంకులు, రంగులు, ప్యాలెట్లు…

అంటే – ఆయన ఎక్కడ కూర్చోవాలనుకొంటే అక్కడే కూర్చొని ఆర్ట్ వేయటమో, రాసుకోవడమో, చదవటమో చేస్తారన్నమాట!

నేనొక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, ఒక 30 నిమిషాలపాటు స్పెల్‌బౌండ్ అయి చూసిన బాపుగారి వర్క్‌రూమ్-కమ్-స్టడీని ఇప్పటికీ అడుగు అడుగూ వర్ణించగలను!

సృజనశీలి అయిన ఒక అద్భుత వ్యక్తికి అంతకు మించిన ఆస్తి ఏముంటుంది?

వెళ్తూ వెళ్తూ ప్రచురణకోసం వారి ఫోటో అడిగాను. తర్వాత మనసు మార్చుకొని – సిగార్‌తో వున్నదీ, ఆయనే స్వయంగా వేసుకొన్న ‘బాపుగారి బొమ్మ’ కావాలన్నాను. “నేను మీకోసం కొత్తగా ఒకటి వేసి మీకు పోస్ట్ చేస్తాను” అని నా అడ్రెస్ తీసుకొన్నారు. మాట ఇచ్చినట్టే సరిగా వారం రోజుల్లో బాపుగారినుంచి పోస్టులో ‘సిగార్‌తో బాపుగారి బొమ్మ’ వచ్చింది!

ఆ బొమ్మ, ప్లస్, వారిదగ్గర నేను అడిగి తీసుకొన్న ‘పెళ్ళిపుస్తకం’ సినిమాలోని ఒక సీన్‌కు వారు వేసుకొన్న మొత్తం స్టోరీబోర్డు కాపీ, వారి ఇంటర్వ్యూ కేసెట్లు... ఇప్పటికీ ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెలో నాదగ్గర భద్రంగా ఉన్నాయి. వన్ ఫైన్ డే... ఒక పుస్తకంలో భాగంగా వాటిని ప్రింట్‌లో బయటికి తెస్తాను.  

వారికి సెలవు చెప్పి బయటికి వస్తోంటే ఇంటిముందు విశాలమైన ఆవరణలో ఒక ఊయల. ఎదురుగానే హీరో మమ్ముట్టి ఇల్లు. గేట్ దాటి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగిచూస్తే – ఇంకా బయటే మాకు చేయి ఊపుతూ బాపు గారు!

ఇన్ని అద్భుత జ్ఞాపకాలనిచ్చిన బాపుగారికి వారి జయంతి సందర్భంగా ఇదే నా వినమ్ర నివాళి.
***

#Bapu #FilmDirectorBapu #BapuGariBomma #MutyalaMugguBapu 

2 comments:

  1. బాపుగారితో నా పరిచయం చాలా చిత్రంగా జరిగింది. ఈటీవీ భాగవతం "వీ ఎఫ్ ఎక్స్" కోసం మా డిపార్త్మెంటుని అడిగారు. అప్పటికే కొన్ని ఎంగ్లీష్ సినిమాలకు వర్క్ చేసిన నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. నీటీ అడుగులో దేవతలకీ, రాక్షసులకి జరిగే యుధ్ధాన్ని తియ్యాలి. నేను చించుకుంటూ.. పిచ్చ రియలిస్టిగ్గా చేస్తూ.. వెనక అలికిడైతే తిరిగి చూశాను. ఒక సన్నటి వ్యక్తి.. మాసిన తెల్ల జుబ్బా, నలిగిన బ్లూ జీంసూ.. కాళ్ళకి అరిగిపొయిన రబ్బరు చెప్పులు వేసుకోని.. నా మోనిటర్లోకి తదేకంగా చూస్తున్నాడు. "సాధారణంగా పెద్ద్ పెద్ద వాల్లనికూడా అనుమతించని ప్లేసులోకొచ్చిన వీడేవడ్రా బాబూ!"(మనసులో) అనుకోని.. నాపని నేను చేసుకుంటున్నాను. అతనక్కడ్నుంచీ ఎంతకీ కదల్డే!.. ఓ పావుగంటతర్వాత మా బాస్ వచ్చాడక్కడికి. మాఇద్దర్ని కాస్త విచిత్రంగాచూసి "చిరంజీవి సార్! ఇతనెవరో తెలుసా మీకు? గుర్తుపట్టారా?" అని అడిగాడు. ఎవ్వర్నైనా "సార్" అని పిలవడం ఆయన గొప్పదనం. అలాగని ఆయన్ని ఎవరైనా "సార్" అంటే ఊరుకునేవాడు కాదు. పేరుతో పిలవమనేవాడు. ఇక విషయంలోకొస్తే.. వింతగా ఆవ్యక్త్ని చూస్తూ "లేదండీ.. నేను గుర్తుపట్టలేకున్నాను" అన్నాను. "అదేంటీ? భాగవతంకి చేస్తా, బాపూగారు తెలియదా?" అని అడిగారు ఆశ్చర్యంగా. నాకు ఫ్యూజులు ఎగిరిపొయ్యాయి. ఆయనమాత్రం మా ఇద్దర్నీ పట్టించుకోకుండా మొనిటర్లోకే చూస్తున్నాడు. "ఎలావుండండీ ఔట్పుట్? హాల్వుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా.. పూర్తి రియలిస్టిక్గా చేస్తున్నారు సారు" అని మాబాస్ బాపుగారితో అన్నారు. "ప్చ్" అని తేలిగ్గా పెదవి విరిచేశారు ఆయన. ఈసారి నాతోబాటూ.. మా బాస్ కి గూడా ఫీజులెగిరాయి. "నాకు రియాలిటీ వొద్దు. ఫాంటసీ కావాలి. స్క్రీన్ మీద బుడగలొస్తే చాలు. అది నీటి అడుగు అని అందరికీ అర్ధమైపోతుంది" అన్నారు.

    అలా మాకు పరిచయం మొదలైంది.

    ReplyDelete