Wednesday 15 December 2021

ఒక్క గంట సమయం మీకుందా?

ఏదయినా చేయండి... మీ నిద్రని కొంత తగ్గించుకోండి. మీ జీవిత భాగస్వామికీ, మీ పిల్లలకూ లంచాలూ, తాయిలాలివ్వండి. రోజూ ఆ సమయంలో రొటీన్‌గా చేసే ప్రతి చెత్త పనినీ కాసేపు మర్చిపోండి. అవసరం ఉన్నా లేకపోయినా ఆ పనిని చేసెయ్యాలన్న దురదని కూడా... ఆ కొద్దిసేపు మర్చిపోండి.

ఇంకా ఏ త్యాగమయినా సరే.. ఫరవాలేదు. చేసెయ్యండి. కానీ –

మీ దినచర్యలో మొదటి అరవై నిమిషాల సమయాన్ని మాత్రం మీ కోసం రిజర్వ్ చేసుకోండి. సంపూర్ణంగా.

"Me-time" అన్నమాట!

ఈ ఒక్క గంట చాలు... మనకున్న 24 గంటల్లో – మనకోసం మనం కెటాయించుకొనే ఈ ఒక్క గంటకు మన జీవితగమనాన్నే మార్చివేసే శక్తి ఉంది. సరిగ్గా ఉపయోగించుకోగలిగితే.

ఈ ఒక్క గంటనే, టొనీ రాబిన్స్ వంటి “పీక్ పెర్ఫామెన్స్” స్పెషలిస్టులు, “Hour of Power” గా చెప్తారు.

ముందుగా – ఈ ఒక్క గంటలో మనం ఏం చేయకూడదో చూద్దాం:
> ఫేస్‌బుక్ జోలికి వెళ్లకండి. అలాగే ట్విట్టర్, ఇతర సోషల్ మీడియానీ మర్చిపోండి.
> నో ఈమెయిల్స్ ప్లీజ్!
> న్యూస్‌పేపర్ చదవొద్దుగాక చదవొద్దు. కనీసం ఆ ఒక్క గంట. మేగజైన్లు కూడా స్ట్రిక్ట్‌లీ నో. టీవీ ప్లగ్ పీకేసేయండి.

మరేం చేయాలి?

ఇదిగో, ఇవి:
> అలవాటుంటే డైరీ రాయండి. లేదా బ్లాగ్ చేయండి. ఏదయినా రాయండి.
> నాలుగు గోడలు దాటి బయట ఒంటరిగా జాగింగ్‌కి వెళ్లండి. వాక్ చేయండి.
> అలా నడుచుకుంటూ వెళ్లి మీకిష్టమైన బండిపైనో, బంకు దగ్గరో టీ త్రాగండి.
> మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఏదయినా పుస్తకంలోని ఒక చాప్టర్ చదవండి.
> మీ అంతరంగాన్ని దర్శించుకోండి. మెడిటేషన్ చేయండి.
> మీ జీవనశైలి గురించి, మీ జీవిత లక్ష్యాల గురించి ఆలోచించండి.
> మీరెక్కడున్నారో తెలుసుకోండి. ఇంకా ఎంత దూరం వెళ్లాలో, ఏమేం చేయాల్సి ఉందో గుర్తించండి.

ఇదంతా ఏదో చిట్కాల బ్లాగ్ పోస్ట్ కాదు. 

సక్సెస్ సైన్స్! 

ఆధునిక జీవనశైలికి అలవాటుపడిపోయి, మనం మర్చిపోతున్న ఒక కళ.

మీ దినచర్యలో మీకోసం మీరు కెటాయించుకోనే ఈ అరవై నిమిషాలకి నిజంగా చాలా శక్తి ఉంది. దీన్నొక అలవాటుగా చేసుకోండి. కేవలం ఒక్క నెల తర్వాత మీలో, మీ ఆలోచనల్లో, మీ జీవనశైలిలో ఎంతో మార్పు ఉంటుంది.

అది మీకిష్టమైన మార్పు. మీరు కోరుకున్న గమ్యానికి మిమ్మల్ని సులభంగా చేర్చే మార్పు.

ఆ మార్పు మీకవసరం. నాకవసరం. మనందరికీ అవసరం.

రోజుకి ఒక గంట కెటాయించే ఇదే Me-time ను, నెలకి ఒక సారి... ఒక్క రోజంతా... మీ ఇష్టారాజ్యంగా గడపగలిగితే, అది మీ "Self-date" అవుతుంది. 

ఒకసారి ఈ రెండింటి గురించి ఆలోచించండి. ఆచరించి కూడా చూడండి. మీకే అర్థమవుతుంది... మీరేంటో, మీరేం కోల్పోతున్నారో!   

“Identify your problems, but give your power and energy to solutions.”
– Tony Robbins
***

#MeTime #SelfDate #Aloneness #SelfMotivation #LoveYourself #ArtDay 

No comments:

Post a Comment