Wednesday 1 December 2021

సిరివెన్నెల ఒక జ్ఞాపకం

నా మొదటి సినిమా "కల" కోసం ఒక పాట రాయమని నేను సిరివెన్నెల గారిని కోరాను. 

శాస్త్రి గారు అప్పటికే కొత్త డైరెక్టర్స్, చిన్న బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళ కోసం ఇలా "ఒక్క పాట" రిక్వెస్టులను ఒప్పుకోవటం మానేశారు.  

గ్రీన్ పార్క్‌లో రూం వేసుకొని, ఎక్కువగా సింగిల్ టైటిల్ కార్డుతో లిరిక్స్ రాస్తున్నారు. భారీ రెమ్యూనరేషన్! 

అరుదుగా తనకు బాగా నచ్చిన, ఇష్టమున్న కొన్ని సంస్థలకు, దర్శకులకు మాత్రం ఒకటి రెండు పాటలు రాస్తున్నారు. 

ఇక్కడ తను రాయకూడదని కాదు. చిన్న బడ్జెట్ సినిమాలను, కొత్త దర్శకులను తక్కువచేయడం కూడా కాదు. "చిన్న బడ్జెట్ సినిమాలకు ముందే బడ్జెట్ సమస్య. నాతో రాయించుకొనే ఆ ఒక్క పాటకు వారు ఎందుకు ఇబ్బంది పడాలి" అన్నది వారి ఆలోచన. ఇంకొకటి - కొత్త లిరిక్ రైటర్స్‌కు కూడా ఎక్కువ అవకాశాలుంటాయి కదా అని. 

ఇలాంటి సమయంలోనే - ఏమైనా సరే నా సినిమాలో సిరివెన్నెల గారి పాట ఒక్కటయినా ఖచ్చితంగా ఉండాలని నేను మొండిగా అనుకున్నాను. నేను పరిచయం చేసిన నా మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ (మణిశర్మ కజిన్) తో అదే చెప్పాను.

ఆయన్ని కలిసి అడిగాము. 

నన్ను కిందా మీదా చూసి, "సిచువేషన్ చెప్పండి" అన్నారు. 

చెప్పాను. 

"ట్యూన్ ఉందా" అన్నారు. వెంటనే జేబులోంచి వాక్‌మాన్ తీసి, నొక్కాను. 

విని, పల్లవి అప్పటికప్పుడే ఆశువుగా చెప్పారు. తర్వాత పాట రాసిచ్చారు. 

తర్వాత ఆ పాటను బాలు, చిత్ర గార్లతో పాడించుకున్నాం. చిత్ర గారు చెన్నైలో పాడారు. బాలు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ మహతిలో పాడారు. 

ఆ పాట ఒక యుగళ గీతం. దాని గురించి రాత్రే ప్రత్యేకంగా ఒక బ్లాగ్ రాసి, పోస్ట్ చేసాను.  

కట్ చేస్తే - 

సిరివెన్నెల గారు సిగరెట్స్ బాగా తాగుతారు. ఎంత బాగా అంటే - నేను ఆ రేంజ్‌లో ఇప్పటివరకు ఇంకొకర్ని చూళ్లేదు.  

ఆయన కూర్చున్న కుర్చీకి కుడివైపు ఒక చిన్న బకెట్ సైజు ప్లాస్టిక్ బిన్ ఉంటుంది. దాంట్లో సగం దాకా నీళ్లుపోసి ఉంటాయి. 

సిగరెట్ కొంచెం కాల్చటం, సగం కూడా అయిపోకముందే దాన్లో వెయ్యటం... మళ్ళీ ఇంకోటి వెలిగించటం... 

అంత చెయిన్ స్మోకింగ్! 

తర్వాతేమైనా తగ్గించారేమో తెలీదు. కాని, ఆయనలోని అప్పటి ఆ చెయిన్ స్మోకింగ్ అలవాటు ఈరోజు ఇంత త్వరగా, ఇలాంటి సమయంలో ఆరోగ్యం పాడవటానికీ, తిరిగి కోలుకోలేకపోవటానికీ తప్పకుండా ఒక కారణమయ్యుంటుంది. 

ఇవన్నీ ఇప్పుడు అనుకోకూడదు. కాని... వారంటే, వారి సాహిత్యం అంటే నాకున్న అభిమానం ఇలా అనుకునేలా చేసి బాధపెడుతుంది. 

డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పినట్టు - "ఆయన తెలుగు సినిమా పాటలు రాయటం ఆయన దురదృష్టం. మన అదృష్టం."

సినిమా పాటల రచయిత కాకుండా - ఆయన కేవలం వచన కవిత్వం మీదే కొనసాగి ఉంటే మాత్రం ఒక అంతర్జాతీయ స్థాయి కవిగా వెలుగొందేవారు. 

సిరివెన్నెల గారు విశ్వనాథ్ గారికి రాశారు. ఆర్జీవీకీ రాశారు. అన్ని సిచ్యువేషన్స్‌కు రాశారు. అన్ని సంగీత ప్రక్రియలకు రాశారు. స్వయంగా కొన్ని పాటలు రాసి, పాడారు కూడా. 

సినిమా పేరునే తన ఇంటిపేరుని చేసుకొన్న ఏకైక తెలుగు సినిమా పాటల రచయిత "సిరివెన్నెల" సీతారామశాస్త్రి గారికి నా వినమ్ర నివాళి! 
^^^^^



No comments:

Post a Comment