Tuesday 23 November 2021

మాధవరెడ్డి ఎంత మంచివాడంటే...

టైటిల్ చూసి, ఇదేదో చీప్ క్వాలిటీ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనుకుంటారేమో! 

నో... కాదు.  

ఎట్ ద సేమ్ టైం... రాజకీయాలకు సంబంధించిన టాపిక్ కూడా కాదు.  

1999 లో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలిమినేటి మాధవరెడ్డి మినిస్టర్‌గా ఉన్నప్పుడు, నేనూహించని విధంగా, ఒక సందర్భంలో, మా ఇద్దరిమధ్య జరిగిన ఓ అయిదారు నిమిషాల సంభాషణ తాలూకు జ్ఞాపకం గురించి... ఈ పాడ్‌కాస్ట్. 

కట్ చేస్తే -  

అప్పుడు నేను కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నాను. మద్రాస్ నుంచి ఎవరైనా పిల్చినప్పుడల్లా వెళ్ళి, అక్కడ రైటర్‌గానో, ఘోస్ట్ రైటర్‌గానో పీస్ వర్క్ లాగా పనిచేసి వస్తుండేవాణ్ణి. 

డబ్బులు కూడా అప్పుడు బాగానే వచ్చేవి. 3, 4 రోజుల్లో ఒక డైలాగ్ వెర్షనో, ఒక కథావిస్తరణో, ఓ ట్రీట్‌మెంటో రాసిచ్చి వచ్చేవాణ్ణి. అలా వెళ్ళినప్పుడల్లా కనీసం 20-30 వేలకు తక్కువ కాకుండా ఇచ్చేవాళ్ళు. 

ఆలిండియా రేడియోలో అప్పుడు నా నెలజీతం కూడా అంత వచ్చేది కాదనుకుంటాను. 

డబ్బులొక్కటే కాకుండా...  మెరీనా బీచ్‌లో పెద్దవాళ్లతో కలిసి విండోస్ పైకెత్తిన ఫియట్ కార్లో కూర్చొని, పల్లీలు తింటూ ఓ పెగ్ తీసుకోడం... సెలబ్రిటీలతో తరచూ కలిసే అవకాశం ఉండటం... అంతా ఓ రేంజ్ లో ఉండేది అప్పుడు. 

అప్పటి ఆ స్క్రిప్ట్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్ అనుభవాలతో - "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" అనే పుస్తకం ఒకటి రాశాను. చకచకా  ప్రింట్స్ వేయాల్సి వచ్చింది. ఎర్ర మంజిల్ లోని మా అన్న ఇంటినుంచి, కర్నూల్లో మా ఇంటినుంచి, విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్ ల నుంచి అప్పట్లో మొత్తం ఓ 5 వేల కాపీలు సేలయ్యాయి. అదొక రికార్డు. 

ఆ పుస్తకానికే "బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్" క్యాటగిరీ కింద నాకు నంది అవార్డు వచ్చింది. 

ఆ సంవత్సరం నంది అవార్డుల ప్రదానోత్సవం నాడు... అవార్డు గ్రహీతలందరికీ ముందు గోల్కొండ హోటల్లో లంచ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  

సాయంత్రం లలిత కళాతోరణంలో నంది అవార్డుల కార్యక్రమం తర్వాత, జూబ్లీ హాల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. 

అక్కడ ఏవీయస్ గారూ, ఇంకో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు, నేనూ ఒకచోట నిల్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ ఇద్దరు అందమైన ఫిమేల్ ఆర్టిస్టులే ఆ రోజు స్టేజి మీద అవార్డులు, చెక్కులు వగైరా అందించే పనికి నియమించబడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు సినిమాల్లో వెరీ బిజీ సపోర్టింగ్ ఆర్టిస్టు. అది వేరే విషయం.     

ఏవియస్ గారు, మా అన్న... ఎర్రమంజిల్లో అనుగ్రహ పార్ట్‌మెంట్స్‌లో పక్కపక్క ఫ్లాట్స్‌లోనే ఉండే వాళ్లు. నేను హైదరాబాద్ వచ్చినపుడల్లా ఏవియస్ గారు, నేను కల్సుకోనేవాళ్ళం. అలా మా ఇద్దరికీ బాగా పరిచయం ఉంది... జోకులు కూడా వేసుకునేంత చనువు కూడా ఉండేది.  

జూబ్లీ హాల్లో డిన్నర్ తర్వాత, లాన్లో నిల్చుని, అలా మేం మాట్లాడుకుంటున్నప్పుడు - వెనకనుంచి నా భుజం పైన ఓ చెయ్యి పడింది. 

"ఏం మనోహర్... ఏంది సంగతి" అంటూ చాలా క్యాజువల్ గా, నన్ను తీసుకొని అలా పక్కకి నడిచాడు ఆ వ్యక్తి. అసలేం జరుగుతోందో అర్థం కాక, నేనూ అనుసరించాను. 

నా భుజం మీద చెయ్యేసి, నన్ను పలకరించి, అంతకు ముందే నేను బాగా తెలిసినట్టు, చాలా క్యాజువల్ గా నన్నలా పక్కకి తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ... మినిస్టర్ మాధవరెడ్డి! 

ఇప్పుడున్నంత సెక్యూరిటీ హడావిడి అప్పుడు లేదు. ఆయన వెనుక ఒకే ఒక్క సెక్యూరిటీ ఆఫీసర్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. అక్కడ అంతా కలిపి ఒక యాభైమంది కూడా లేరు. సగం మంది అవార్డీలు వెళ్ళిపోయారు. ఎవరికోసమో వెయిట్ చెస్తూ, రెండు నిమిషాలు అలా క్యాజువల్ గా టైం పాస్ చెయ్యడానికే బహుశా లాన్లోకి వచ్చి ఉంటాడని తర్వాత నాకర్థమైంది.  

నాకిప్పటికీ ఆశ్చర్యం... 

సాయంత్రం అవార్డులిస్తున్నప్పుడు నంది బహుమతిని సి యమ్ చంద్రబాబు ఇవ్వగా, నందితో పాటు ఇచ్చే ఒక లామినేటెడ్ ధృవపత్రాన్ని, చెక్కును... ఆరోజు నాకు అందించింది మాధవరెడ్డి. 

మైక్ లో ఎనౌన్స్ మెంట్ తర్వాత... ఒక్కొక్కటీ నాకు అందిస్తూ, వాటి మీద రాసున్న నా పేరుని, "చిమ్మని మనోహర్"  అని రెండు సార్లూ చిన్నగా ఆయన బయటికే చదువుతూ నాకు అందించటం నాకు ఇంకా గుర్తుంది.  

కాని, ఓ 2 గంటల తర్వాత, జుబ్లీ హాల్లో డిన్నర్ వరకూ నా పేరుని, నన్నూ ఆయన గుర్తు పెట్టుకోవడం - లేదా ఆయనకు గుర్తుండటం... నాకిప్పటికీ ఆశ్చర్యమే. 

ఆయన అడుగుతున్న ప్రశ్నలకు జవాబులిస్తూపోతున్నాను. నా ఉద్యోగం గురించి కూడా అడిగాడు. కర్నూలు ఆలిండియా రేడియోలో ఏడెనిమిదేళ్ళుగా నేను చేస్తున్న జాబ్ గురించి చెప్పాను.  

"ఇంకెన్నేండ్లుంటవ్  మనోహర్ కర్నూల్ల? హైద్రాబాద్ కు రా" అన్నారాయన. 

ట్రాన్స్‌ఫర్ కష్టమని చెప్పాను. అప్పటికే 2 సార్లు, నా ఫ్రెండ్స్ తో కలిసి ఢిల్లీ వెళ్ళి ప్రయత్నించినా పని కాలేదన్న విషయం చెప్పాను. 

"సెంటర్ల ఐ & బి మినిస్టర్ మనోడే కదా... ఓసారి కలవకపోయినవ్?" అన్నారాయన. 

"అదీ అయింది సర్. వాళ్లావిడే స్వయంగా రికమెండ్ చేశారు ఆయనకు. హైద్రాబాద్‌లో నా పోస్ట్ ఒకటి ఖాళీగా కూడా ఉంది. ఆయన ఆఫీసునుంచి ఒక పిఏనో, పియస్సో చెప్పినా పని అయిపోద్ది సర్... కాని, ఆయన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు" అన్నాను.

"ఇది చాలా చిన్న పని బై... ఆయనో టైప్‌లే!  చెయ్యలేదు... గంతే కదా... సరే... నువ్వు మల్ల ఈసారి హైద్రాబాద్ వచ్చినప్పుడు నన్ను కలువ్. నేను చేయిస్తా" అని చాలా సింపుల్‌గా చెప్పారు మాధవరెడ్డి.   

నా జీవితంలో అదే మొట్టమొదటిసారి... నేను ఒక మినిస్టర్‌తో అంత దగ్గరగా ఉండి, అంత క్లోజ్‌గా మాట్లాడ్డం! 

ఏవియస్ గారు, పక్కనున్న ఇద్దరు ఆర్టిస్టులు మావైపే చూస్తున్నారు. 

ఇంతలో మా పక్కనుంచే సి యం చంద్రబాబు నాయుడు నడిచివెళ్తోంటే, నా భుజం మీద చరుస్తూ "రైట్ మనోహర్... ఈసారి వచ్చినప్పుడు కలువ్ మరి" అంటూ బాబు వెనకే స్పీడ్‌గా నడుస్తూ వెళ్ళిపోయారాయన. మాధవరెడ్డి వెనుకే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ ఫాలో అయ్యాడు. అప్పటిదాకా ఎక్కడున్నారో తెలీదు కాని, సెకన్లో ఇంకో నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్లు వారిని ఫాలో అయ్యారు.  

"ఏంటి... మినిస్టర్ గారు మీకు ముందే తెలుసా?!" అని ఏవీయస్ గారు నన్ను ప్రశ్నించటంతో - ఆ ట్రాన్స్ లోంచి నేను బయటికి వచ్చాను. 

నిజంగా ఆ క్షణమే నాకు హైద్రాబాద్ ట్రాన్స్‌ఫర్ అయిపోయినంత హాప్పీగా ఫీలయ్యాను. 

అదీ... మాధవరెడ్డి అంటే. 

ఆ తర్వాతే నేను మాధవరెడ్డి గురించి కొంత తెలుసుకున్నాను. 

"నేను మినిస్టర్ ను" అనే భేషజం లేని మనిషి... మంచి మనిషి. మంచి చేతల మనిషి. 

పనికిమాలిన వాగుడు, మీడియా పిచ్చి, లేని పోని బిల్డప్పులు... ఆయనకు పడవ్.     

తర్వాత నేను కర్నూలు నుంచి హైద్రాబాద్‌కు - జస్ట్ నా ట్రాన్స్ ఫర్ పనిమీదనే... కేవలం మాధవరెడ్డిని కలవటం కోసం... ప్రత్యేకంగా ఓ నాలుగురోజుల ట్రిప్ ప్లాన్ చేసుకుంటుండగానే బాంబ్ బ్లాస్ట్ జరిగింది.  

మాధవరెడ్డి బ్రతికుంటే మాత్రం అప్పుడు నాకు నిజంగా వెంటనే ట్రాన్స్‌ఫర్ అయ్యేది. నా కెరీర్, నా లైఫ్... మరోలా ఉండేవి.       
***

This is the transcript of my latest podcast episode: #32 #ManoharChimmaniPodcast. Links to this episode:

Anchor Link: 

Spotify Link:

No comments:

Post a Comment