Tuesday 26 October 2021

నిజము మరచి నిదురపోకుమా!

ఎవరైనా నేర్చుకోవాల్సింది, అలవాటు చేసుకోవాల్సింది 'గెలవడం ఎలా' అని. 'ఓడిపోకుండా ఉండటం ఎలా' అని కాదు. ఏది సరైనదో నిర్ణయించుకోవాల్సింది మనమే. 

అలాగే - కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ గ్యాప్ అనే రెండూ చాలా శక్తివంతమైనవి. ఒకటి పాజిటివ్ సంకేతాలనిస్తుంది. రెండోది నెగెటివ్ సంకేతాలనిస్తుంది. ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే.

కట్ చేస్తే - 

నిన్న జరగాల్సిన ఒక పని కాలేదు. వెళ్లాల్సిన ఒక ముఖ్యమైన మీటింగ్‌కు చాలా చెత్త రీజన్ వల్ల వెళ్లలేకపోయాను. కొత్తగా అనుకొన్న ఇంకో డీల్ కూడా మూడోసారి వాయిదా పడింది, ఆశ్చర్యకరంగా.     

వెంటనే రాత్రికి రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నాను. అన్నీ పక్కనపెట్టి, కొన్నాళ్ళు నా క్రియేటివ్ యాడ్స్ క్యాంపెయిన్ ప్లాన్ చేసి, వెంటనే మొదలెట్టాను. ఈ నెల 31 వరకూ ఇదిలాగే కొనసాగుతుంది. నా సోషల్‌మీడియాలో కూడా ఇదే కనిపిస్తుంది.  

నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న, తెలిసిన అతి కొద్దిమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, నా సత్వర బాధ్యతలు, లక్ష్యాల గురించి తప్ప... ఇంక వేటి గురించీ, ఎవరి గురించీ ఆలోచించటం లేదు. 

పని, పని, పని.   

చేసుకుంటూపోవడమే.

అదే చేస్తున్నాను.

దాదాపు 20 నెలలుగా వేధిస్తున్న కోవిడ్, కొత్త జీవితపాఠాల్ని నేర్పింది. 

సమయం మనచేతుల్లో ఉందనుకుంటాం. ఇంకెంతో టైమ్ ఉంది మనకు అనుకుంటాం. "మీకంత సీన్ లేదు" అని మొన్నటి ఫస్ట్, సెకండ్ వేవ్‌లు చెప్పాయి. కళ్ళముందే పిట్టల్లా రాలిపోయిన ఎందరో నాకంటే చిన్నవారి జీవితాలు, నాకు అతి దగ్గరివారి ముగిసిన జీవితాలు చెప్పాయి. 

ఇదిలా ఎంతకాలం కొనసాగుతుందో తెలీదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రష్యాలో, చైనాలో, ఇంకొన్నిచోట్లా కలకలం లేపుతోందట. అలవాటు ప్రకారంగా ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ మనదగ్గర కూడా సమస్య పెరగొచ్చు. చెప్పలేం. 

ఇలాంటి పరిస్థితుల్లో, దేని దారి దానిదే అనుకుంటూ జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకే వెళ్ళాలి తప్ప అసమర్థంగా ఆగిపోకూడదు. మన అసమర్థతకు... దీన్నో, ఎవరినో, ఇంకే పరిస్థితులనో సాకుగా తీసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.  

ప్రతి గంటకు, ప్రతి రోజుకూ ఎంతో కొంత ముందుకు కదలాలి. 

గడిచిపోయే సమయం మనకోసం మళ్లీ వెనక్కి రాదు. పెరుగుతున్న వయస్సు మనమేదో అర్థంలేని స్టకప్‌లో ఉన్నామని మనకోసం ఆగదు. 

సమయం విలువ, బాధ్యతల విలువ ఏంటో తెలిసినవాడెవ్వడూ రోజూ ఓడిపోవాలనుకోడు. ఆ ఎడిక్షన్‌లో కొట్టుకుపోడు. దాన్ని సమర్థించుకోడానికి కారణాలు వెతుక్కోడు. 

కట్ చేస్తే - 

మన లాజిక్‌కి అందని సంఘటనలు కొన్ని మన జీవితంలో జరుగుతోంటే అనిపిస్తుంది. సమ్‌థింగ్ ఇంకేదో ఉందనీ, దాని లక్ష్యం మరొకటేదో అనీ.   

ఉండొచ్చు. ఆ నమ్మకాల దారి వేరు. నిజ జీవితంలోని సమస్యలు, సంఘటనల దారి వేరు. 

మనచుట్టూ కటిక చీకటిలాంటి నెగెటివిటీ పేరుకుపోకుండా చూసుకోవటం ముఖ్యం.  

సమయం విలువ, ప్రొడక్టివిటీ విలువ తెలిసిన పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ వ్యక్తులు మనచుట్టూ ఉన్నప్పుడు... అలాంటి పాజిటివ్‌లీ అగ్రెసివ్, ప్రొయాక్టివ్‌లీ పవర్‌ఫుల్ వ్యక్తులతో నిండిన పీర్‌గ్రూప్‌ మధ్య మనం ఉన్నప్పుడు... ఎలాంటి సమస్యలు, స్టకప్‌లు కూడా మనల్ని ఏం చేయలేవు. మనం ముందుకే కదుల్తుంటాం. 

అలా కదలటమే ఎవరికైనా కావల్సింది. అదే చాలా ముఖ్యం.

సమర్థించుకోడానికి మనం చూపే అనేక సాకులు... చేసే అనేక వాదనలు, తర్కాలు వృధా. 

అవన్నీ... అయితే మన పాండిత్యం ప్రదర్శించుకోడానికో, లేదంటే మన నోరు పెద్దది అని ప్రూవ్ చేసుకోవడానికో. అంతకన్నా ఏం లేదు. 

కళ్ళముందు కనిపిస్తున్న నిజాల ముందు ఇవన్నీ జస్ట్ ఒక గడ్డిపోచతో సమానం.   

When it comes to becoming stronger, healthier and better – there are no excuses. Just fucking do it.

No comments:

Post a Comment