Thursday 21 October 2021

ఫేస్‌బుక్‌తో ఏదైనా సాధ్యమే!

అమ్మాయిలు ఈజీగా అబ్బాయిల్ని పడేయొచ్చు. అబ్బాయిలు అమ్మాయిల్ని పడేయొచ్చు. కొంచెం మెచ్యూర్డ్ భాషలో చెప్పాలంటే ఎవరు ఎవరితోనైనా ఫ్రెండ్స్ అయిపోవచ్చు.

ఈ ప్రాసెస్‌కు ఏజ్ ఫాక్టర్ లేదని ప్రపంచవ్యాప్తంగా చాలామంది విషయంలో చాలా సార్లు రుజువైంది. 

అయితే ఒక వార్నింగ్ –

అమ్మాయిలు అనుకొని, ఎవరో సిల్లీ ఫెలోస్ క్రియేట్ చేసిన “లేని అమ్మాయిల ప్రొఫైల్స్”నే ప్రేమిస్తూ కొందరు అబ్బాయిలు జీవితాలనే వృధా చేసుకోవచ్చు. పరిణితిచెందని మానసిక దౌర్బల్యం వల్ల, అమ్మాయిలు అబ్బాయిల జీవితాల్లో ఇంకెన్నో సమస్యలు రావచ్చు. వీరిలో కొందరు జీవితాల్నే ముగించేసుకోవచ్చు. కొందరి జీవితాలకు ఇంకెవరో ముగింపు చెప్పొచ్చు. అవన్నీ మనం చూస్తున్నాం.   

అంతేనా? ఇంకా చాలా ఉంది... 

హాయిగా ఉన్న కుటుంబ జీవితాన్ని, కుటుంబ సభ్యులమధ్య ఉన్న సంబంధాల్నీ అతలాకుతలం చేసుకోవచ్చు. ఒక్క ఇంట్లోనే అసలు ఒకరికొకరు మాట్లాడుకోకుండా... అంతా అతి సులభంగా మరమనుషులయిపోవచ్చు. నాలుగు గోడల మధ్యే కలిసి జీవిస్తూ, పరాయివారయిపోవచ్చు. 

ఇంకా అయిపోలేదు, చాలా ఉంది...  

జీవిత భాగస్వామిపట్ల, జీవనశైలిపట్ల అసంతృప్తి ఉన్న పురుషులు, స్త్రీలు కొత్త దారులు వెతుక్కోవటంలో బిజీ అయిపోవచ్చు. ప్రయత్నించకుండానే కొన్నిసార్లు కొన్ని పరిచయాలు ఊహించని కొన్ని కొత్తదారులకు దారితీయవచ్చు. 

ఈ ఒక్క ప్లాట్‌ఫామ్ పైన అసలు సాధ్యం కానిదంటూ లేదు. అన్నీ సాధ్యమే.  

ఎన్నో ఉదంతాలని, ఎందరో వ్యక్తుల్నీ, బాగా అధ్యయనం చేశాకే పై వాక్యాలు పుట్టాయి. వాటిల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగని వీటన్నిటినీ తప్పు అని కూడా చెప్పలేం. 

ఎవరి దృక్కోణం వారికుంటుంది. ఎవరి నిర్వచనాలు వారికుంటాయి. 

అదంతా ఒక కాంట్రవర్షియల్ సైడ్.

కాసేపు, దాన్నలా వదిలేద్దాం... 

ఫేస్‌బుక్‌కు పాజిటివ్ సైడ్ కూడా ఒకటుంది. ఈవైపు చాలా తక్కువమంది చూస్తారు. పాజిటివ్ వైపు ఉపయోగించుకొన్నప్పుడు అదే సేమ్ ఫేస్‌బుక్ ఇలా కూడా తోడ్పడుతుంది:

> దశాబ్దాల క్రితం సంబంధాలు తెగిపోయిన మిత్రుల్ని, బంధువుల్నీ ఫేస్‌బుక్ ద్వారా నిమిషాల్లో కలుసుకోవచ్చు.
> నిత్యజీవితంలోని ఎన్నో టెన్షన్లను తట్టుకోడానికి, గాడితప్పిన జీవితాన్ని ఒక పాజిటివ్ కోణంలో బాగుపర్చుకోడానికి… ఒక ప్రయోగశాలగా, ఒక మెడిటేషన్ సెంటర్‌గా కూడా ఫేస్‌బుక్‌లోని పనికొచ్చే ఎన్నో మంచి మంచి గ్రూపులని ఉపయోగించుకొని లాభం పొందవచ్చు.
> ఫేస్‌బుక్‌లో ఫ్లోట్ అవుతున్న ఎందరో వ్యక్తులు, ఎంతో సమాచారం, ఎన్నో ఇన్‌స్పయిరింగ్ కొటేషన్లు, పోస్టుల నేపథ్యంగా - కేవలం ఒకే ఒక్క వ్యక్తితో పరిచయం, లేదా ఓ చిన్న పోస్టు, ఓ చిన్న సమాచారం, ఓ చిన్న కొటేషన్ మీ జీవితాన్నే పూర్తిగా మార్చివేయవచ్చు. మీ జీవిత గమ్యాలవైపు మిమ్మల్ని అవలీలగా నడిపించవచ్చు.
> ఫేస్‌బుక్‌ని బాగా ఉపయోగించుకొని చోటా గల్లీ లీడర్ల స్థాయి నుంచి, బడా రాజకీయనాయకుల స్థాయికి ఎదగొచ్చు. ఒక అద్భుతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా దీని శక్తి ఏంటో గుర్తించి బాగా ఉపయోగించుకొంటే మంత్రుల దాకా కూడా ఎదగొచ్చు. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి.
> మీకు అవసరమైన ఏ సమాచారాన్నైనా, ఏ సలహానైనా సంబంధిత ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా క్షణాల్లో ఫ్రీగా పొందవచ్చు.
> పైసా ఖర్చు లేకుండా మీ వృత్తి, వ్యాపారాలను అమితంగా విస్తరించుకోవచ్చు. ఒకే ఒక్క ఫేస్‌బుక్‌ పేజి తో ఆన్ లైన్ లో మిలియన్ల వ్యాపారం చేయొచ్చు. దీన్ని ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేసినవాళ్ళెందరో వున్నారు.
> వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ… మీ అభిరుచికి సూటయ్యే అద్భుతమైన స్నేహితులను, స్నేహితురాళ్ళను సంపాదించుకోవచ్చు.

ఇంత గొప్ప అవకాశాల్న్ని, సౌకర్యాల్ని, ఇంత సింపుల్‌గా ఫేస్‌బుక్‌ రూపంలో ఓ గొప్ప అద్భుతంగా మనకోసం రూపొందించిన మార్క్ జకెర్‌బర్గ్‌కి మనం థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలం? 

ఇంతకీ ఫేస్‌బుక్‌లో మనం ఎటు వెళ్తున్నట్టు? పాజిటివ్ దిశలోనా... నెగెటివ్ దిశలోనా?... ఆలోచించాల్సిన అసలు పాయింట్ ఇదీ!

ఒక్క ఫేస్‌బుక్ విషయంలోనే కాదు... మిగిలిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా దాదాపు ఇలాంటి లాభాలుంటాయి. మనం ఎలా ఉపయోగించుకొంటాం వాటిని అన్నదే మిలియన్ డాలర్ కొశ్చన్!

2 comments:

  1. నిప్పు, కత్తి, పురుగుల మందు, ఫ్యాన్ , రైలు లాంటి వాటిని ఉపయోగిస్తున్న అనుభవం ఉంది జనాలకు.
    ఇప్పుడు టెక్నాలజీ .. వాళ్ళ ఇష్టం.

    ReplyDelete