Monday 6 September 2021

ఒక మాయలా, ఒక మహాద్భుతంలా...

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు... ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. 

గత కొన్నేళ్లుగా... ఊపిరాడనివ్వని కొన్ని ప్రొఫెషనల్ సమస్యల్లో ఇరుక్కొని, ఎంతకూ బయటపడలేక, నేను ఎక్కువగా ట్రావెల్ చెయ్యటం లేదు.

అయితే - నిజానికి సమస్య అది కాదు. 

వివిధ దశల్లో నేను ఎన్నుకున్న మనుషులు, నేను తీసుకున్న నిర్ణయాల ఫలితం ఇదీ అని... ఎవరికీ చెప్పుకోలేని ఒక రేంజ్‌లో బాగా నష్టపోయి, చివరికి నన్ను నేనే పరామర్శించుకున్నాను. "జరిగిందేదో జరిగింది... ఇప్పుడిక ఈ పాయింట్ నుంచే జీవితం"... అని నా మైండ్ సెట్ చేసుకున్నాను. ఒకప్పటి నా వీక్ మెంటాలిటీ నుంచి దాదాపు పూర్తిగా బయటపడ్డాను.  

రాగ్స్ నుంచి మళ్ళీ పనులు ప్రారంభించాను. 

కట్ చేస్తే - 

సముద్రం మీద వ్యామోహంతో, ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు... ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. 

ఈ రెండూ... నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. 

దేని ప్రత్యేకత దానిదే.

అయితే... గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది. 

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా... కార్లో వెళ్తూ, కుడి వైపు అలా సముద్రాన్ని చూసుకొంటూ, నచ్చినచోట దిగుతూ, ఆగుతూ, రోజంతా గడిపేయొచ్చు. 

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనీ పనే చేస్తాను. 

ఈ పని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు వైజాగ్‌లోనే  చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద కూడా, అనుకోకుండా వైజాగ్‌కే నేను ఎక్కువసార్లు వెళ్లాల్సిరావడం కూడా నాకే ఆశ్చర్యంగా ఉంది.  

లేటెస్ట్‌గా, మొన్న ఏప్రిల్‌లో, కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా వైజాగ్‌ వెళ్ళాను.   

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.  

తర్వాత - చలం, భీమ్‌లీ... ఆ తర్వాత - అరకు, స్టీల్ ప్లాంట్, పోర్ట్, గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో, మా టీమ్‌తో నేనున్న ఆ నాలుగు రోజులూ... 

ఇంకోసారి, అదే గెస్ట్ హౌస్  లో నాకు పరిచయమై దగ్గరైన ఒక  స్టార్, ఇప్పటికీ కొనసాగుతున్న మా స్నేహం...  

ఆర్కే బీచ్, అక్కడి కాఫీడే... రిషికొండ బీచ్, అక్కడి రిసార్ట్స్... రియోబీచ్, నొవాటెల్ హోటళ్ళు... ఎయిర్‌పోర్టూ, బస్‌స్టాండూ... లలితా జ్యువెల్లరీస్ దగ్గర్లో ఫుట్‌పాత్ మీద బొకేలమ్మే చిన్న షాపూ... వైజాగ్ కి కొంచెం దూరంలో - గాజువాకలోని సినిమా హాళ్ళూ, అక్కడి గ్రీన్ యాపిల్ హోటల్... 

వైజాగ్ సిటీలోనూ, స్టీల్‌ప్లాంట్ చుట్టుపక్కలా వున్న నా ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి. 

1987లో అనుకుంటాను, మా ఎమ్మే క్లాస్‌మేట్స్‌తో నేను మొట్టమొదటిసారిగా వైజాగ్ వెళ్ళాను. ఒరిస్సాలోని కోణార్క్, భువనేశ్వర్‌ల నుంచి మా తిరుగు ప్రయాణంలో వైజాగ్ వెళ్లాం. అప్పుడే మొదటిసారి... నేను అరకులోయ చూడ్డం! 

కొన్నేళ్ళ  క్రితం... నా మొదటి సినిమా షూటింగ్ కోసం కూడా, నా టీమ్‌తో ఓ నాలుగయిదు రోజులున్నాను వైజాగ్‌లో. ఒక మంచి లొకేషన్‌గా తప్ప, అప్పుడు కూడా వైజాగ్ అంటే నాకు మరీ అంత ప్రత్యేకమైన ఫీలింగేమీ  కలగలేదు. తర్వాత ఎన్నోసార్లు వైజాగ్ వెళ్లాను గానీ, ఏ ఒక్క సారి కూడా -  వైజాగ్‌ను మరీ అంత స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు. 

నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత, బహుశా ఓ పదేళ్ల క్రితం అనుకుంటాను... ఉన్నట్టుండి - అసలు మొత్తంగా వైజాగ్‌కే మారిపోవాలని అనుకున్నాం. అక్కడున్న తెలిసినవారితో కనెక్ట్ అయి - ఫ్లాట్ కొనుక్కుంటే ఎక్కడ బాగుంటుంది... రెంట్స్ ఎలా ఉన్నాయి... ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి దగ్గర్లో ఉన్న మంచి రెసిడెన్షియల్ ఏరియా ఏది... ఇవన్నీ కనుక్కున్నాం. ఇదే పని మీద రెండుసార్లు నేను వైజాగ్ వెళ్ళాను కూడా. కాని, ఎందుకో ఆ ఆలోచన అప్పుడు సఫలం కాలేదు. 

మళ్ళీ - గత మూడు నాలుగేళ్ళుగానే... ఉన్నట్టుండి ఒక్కసారిగా... వైజాగ్ నాకు అత్యంత ఇష్టమైన విజిటింగ్ ప్లేస్ అయింది! 

ఈ పాండిచ్చేరి, గోవా... ఇవన్నీ వైజాగ్ తర్వాతే కదా అని ఇప్పుడనిపిస్తోంది. 

అసలు 'వైజాగ్ అందమే వేరు'... అని నేను పూర్తిగా ఫిక్స్ అయిపోయాను. 

గొప్ప గొప్ప రచయితలు, కవులకు... వారి రచనలకూ పుట్టిల్లుగా... వైజాగ్ సాహితీ సాంస్కృతిక నేపథ్యం నాకు ముందే తెలుసు. అయితే - వైజాగ్ నన్ను ఇంత బాగా ఆకర్షించడానికి ఇదొక్కటే కారణం కాదు. 

కొన్నిటికి కారణాలుండవు. లాజిక్కులుండవు. అలా జరిగిపోతాయ్. 

అంతా ఒక మాయలా, ఒక మహాద్భుతంలా అనిపిస్తుంది. 

అసలేంటీ... ఒక ప్రదేశంపైన అంత ఈజీగా చెప్పలేని ఈ ప్రేమ... కాదల్... ఇష్క్... ప్యార్... మొహబ్బత్... ల్యుబోఫ్... లవ్... ?!  

లవ్... అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది కూడా... వైజాగే. 

బాలచందర్ అపూర్వ సృష్టి 'మరోచరిత్ర'... బాలు-స్వప్న క్యారెక్టర్స్... అందమైన భీమిలి లొకేషన్ బ్యాక్ డ్రాప్... కమలహాసన్, సరిత... 'పదహారేళ్ళకూ'  అని యస్ జానకి గారు పాడిన పాట... 

ఐ థింక్... నా లవ్ కూడా అక్కడే ఉంది, వైజాగ్‌లో. 

వైజాగ్‌లో ఉన్న నా లవ్, నా ప్రేయసి, నా వాలెంటైన్ మరెవరో కాదు... సముద్రం.  

"సముద్రం ఇంకా చాలా చోట్ల ఉంది కదా?"... అంటే, ఉండొచ్చు. బట్, ఇది వేరే.  

"ఎందుకలా?"... అంటే చెప్పడానికి నాదగ్గర కారణాల్లేవు. 

ఏదో 'స్పిరిచువల్ కనెక్షన్' అనుకుంటాను... అంతే. 

“Our souls speak a language that is beyond human understanding. A connection so rare the universe won't let us part.” 
― Nikki Rowe

8 comments:

 1. సముద్రం లేకపోతే పోయింది కానీ హైదరాబాద్ కి మించిన సిటీ లేదు. ఎక్కడికి వెళ్ళినా మనసు మాత్రం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఎంత పని చేస్తున్నా చెమట పట్టదు. హైదరాబాద్ ను ప్రేమించడానికి ఈ ఒక్క కారణం చాలు.

  ReplyDelete
  Replies
  1. ఫస్ట్ లవ్ ఎప్పుడూ హైద్రాబాదే! అందులో సందేహం లేదు. కాని, 1983 నుంచి ఇక్కడ ఉండీ ఉండీ బోర్ కొట్టేసింది. అప్పుడప్పుడూ సముద్రపు గాలి, ఆ చమట, ఆ జిడ్డు కూడా అవసరమే అనిపిస్తుంది నాకు. :-)

   Delete
  2. వైజాగ్ ది ఒకరకమైన జిడ్డు. చెన్నైది మరో రకమైన(దారుణమైన) జిడ్డు.

   Delete
  3. వైజాగ్ జిడ్డు ఓకే. భరించవచ్చు. చెన్నైదా... అబ్బో! దారుణాతి దారుణం.

   Delete
 2. నాకు దాదాపు ముప్పై రెండేళ్ళ అనుబంధం విశాఖపట్నం తో, మనోహర్ గారు. వరంగల్ దేవకి ఐతే విశాఖపట్నం యశోదా అంటు ఉంటాను నేను. మా నాన్న గారి వృత్తి రిత్య వరంగల్ నుండి వైజాగ్ కు నా మూడో యేట (1988) వలసోచ్చేశాము.. అలా మొదట డీజిల్ లోకో షెడ్ ,కంచెరపాలెం లో (నేస్తాలమ్మ వీధిలో అద్దెకు ఉన్నామేము). అటు పిమ్మట మర్రిపాలెం లోగల వనాట్ ఫోరేరియా (శ్రీవిజయనగర్) లో ఉన్నామేము (శ్రీలక్ష్మీనరసింహ థియేటర్ దరి ఏయిరోప్లేన్ బిల్డింగ్ లో అద్దెకున్నాము). 1991 నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కునగరమందు మొదట సెక్టర్ 2, తర్వాత 1992~1994 మధ్య సెక్టర్ 6, 1995-2016 వరకు సెక్టర్ 1, 2017~ నుండి సెక్టర్ 6 లో ఉంటున్నాము. భీమ్లి బీచ్ మొదులుకుని కాపులుప్పాడ, చేపలుప్పాడ, వియమార్డియే కైలాసగిరి, బొజనకొండ, సింహాచలం, యారాడా, జోడుగుళ్ళపాలెం, ఆర్కే మిషన్ బీచ్, ఐ యన్ యస్ కురుసురా, టీయూ142 ఇవన్ని తిరగాడిన చోట్లే.. డాబాగార్డెన్స్, డైమండ్ పార్క్, దొండపర్తి, ద్వారకానగర్, సీతం పేట, గురుద్వార సాధ్ సంగత్, ఏయూ, ఏయమ్‌సీ, కేజీఎచ్, మెలడి, చిత్రాలయ, చౌల్ట్రీ, సూర్యాబాగ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, కాకతీయ గేట్, హెచ్‌పీసీయల్ కాల్టెక్స్, వీపీటి, భారత్ హెవి ఎలెక్ట్రీకల్ (హెవి ప్లేట్స్ వెసెల్స్ ప్లాంట్), సింధియా (గాంధిగ్రాం), హెచ్ యస్ ఎల్, మంగళగిరి ఆండాళమ్మ విద్య పరిషథ్, ఘాసియా మసీద్ (బాలచెరువు), గాజువాక, పూర్ణ మార్కెట్, సెయింట్ అల్లోయిస్ స్కూల్, చావులమాడుమ్ అలియాస్ కాన్వెంట్ జం., అల్లిపురం, వాల్తేర్, నోవోటెల్, గ్రాండ్ బే, తాజ్ హోటల్, అంబికా సీ గ్రీన్, హవా మహల్, సిరిపురం, దత్త్ ఐలాండ్, కోస్టల్ బ్యాటరి, ఫిషింగ్ హార్బర్, ఆకాశవాణి, దూర్దర్శన్ హెచ్పీటి ఎల్పీటి సింహాచలం, సిరిపురం, ఫ్లైయింగ్ స్ఫగెటి మాన్స్‌టర్, సీయమార్ సెంట్రల్, మద్దిలపాలెం, ఓక్ రిడ్జ్ ఆనందపురం, పైడా, విజ్ఞాన్, అనిట్స్, దాకమర్రి, గంభిరం, తగరపువలస, అగనంపూడి, వడ్లపూడి.

  ReplyDelete
  Replies
  1. వావ్! మొత్తం విశాఖపట్నం కవర్ చేశారు! ఇంకేమన్నా మిగిలాయా మీరు రాయనివి?! You're lucky.

   మీ పేరులోనే కాస్త మ్యాజిక్ ఉంది. ఇద్దరు కలిసిన పేరా?... ఒక్కరివే రెండు పేర్లా? Just curios... :-)

   Delete
  2. నా గత ముప్పై రెండేళ్ళలో నేను తిరగాడిన, చూసిన ప్లేసేసవి మనోహర్ గారు. పై పెచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి (శోంట్యం, శిమిలిగూడ, అరకు వంటివి).

   ఔను మనోహర్ గారు.. ఆ పేరు పోర్ట్ మాంటేయు.. నా పేరు శ్రీధర్ నా సతిమణి పేరు అనిత.. ఆ రెంటి కాంబోలో ధరణి కామన్ సబ్ సెట్.

   అలానే "srid har sha rany a nitha" లో మా పిల్లల పేర్లు కూడా ఉన్నాయి. "శ్రీధర్ హర్ష, శరణ్య, అనిత"

   మీ కుతుహలానికి ధన్యవాదాలు సర్

   Delete
  3. మీ అందరి పేర్లు కలిసేలా మీ పేరు డిజైనింగ్ అద్భుతహ! :-)

   Delete