Saturday 25 September 2021

బ్రిటిష్ హృదయాలను గెల్చుకొన్న మన ‘డాక్టర్ రామ్!’

పుట్టింది ఎక్కడో కరీంనగర్‌లోని ఒక మారుమూల గ్రామం – సంకెనపల్లిలో.

నాలుగో తరగతి వరకు అతను చదువుకున్న ప్రభుత్వ స్కూలు – ఒక చిన్న గుడిశె.

డాక్టర్ కావాలనుకొన్నాడు, అయ్యాడు.

హార్ట్ సర్జన్‌గా చిన్న పిల్లలకు సేవ చేయాలనుకున్నాడు. చేశాడు, చేస్తున్నాడు.

హార్ట్ క్యాంపుల ద్వారా దేశ విదేశాల్లో వందలాది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేసి బ్రతికించాడు.

బ్రిటిష్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక “హార్ట్ హీరో” అవార్డు అందుకున్నాడు.

ఎక్కడి సంకెనపల్లి… ఎక్కడి లివర్‌పూల్?

“మనిషి తల్చుకొంటే ఏదైనా సాధించవచ్చు” అని మరోసారి నిరూపించిన ఈ కార్డియోథొరాయిక్ సర్జన్ పేరు – డాక్టర్ రమణ ధన్నపునేని. ప్రొఫెషనల్ సర్కిల్‌లో అందరూ అతన్ని “రామ్” అని పిలుస్తారు.


కట్ చేస్తే –

డాక్టర్ రమణ పుట్టిన ఊరు – కరీంనగర్ జిల్లా, వెలగటూరు మండలంలోని సంకెనపల్లి అనే చిన్న గ్రామం. నాలుగో తరగతి వరకు అదే ఊళ్ళోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. పాఠశాల అంటే అదేదో ఇటుక, సిమెంటులతో కట్టిన బిల్డింగేమీ కాదు. ఒకే ఒక్క చిన్న గుడిశె!

రమణ తల్లిదండ్రులు వెంకట్రావు, అరుణ.

పాలిటెక్నిక్ వరకు చదివిన రమణ తండ్రి – జగిత్యాలలో చిన్న మెడికల్ షాప్ ప్రారంభించడంతో, రమణ చదువు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జగిత్యాలలో జరిగింది.

అప్పుడు జగిత్యాలలో “నాయుడు” అని ఒకే ఒక్క “పెద్ద డాక్టర్” ఉండేవాడు. అతన్ని చూసి, అలా డాక్టర్ అవ్వాలని అనుకొనేవాడు రమణ.

అప్పుడున్న ట్రెండ్ ప్రకారం – 10వ తరగతి తర్వాత, ఇంటర్మీడియట్ బైపీసీ గుంటూరులో చదివాడు రమణ. ఎమ్‌సెట్ రెండో ప్రయత్నంలో, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్‌లో సీటు సాధించాడు.

సాధారణంగా రమణ నేపథ్యాన్ని బట్టి – ఇక్కడివరకే ఓ పెద్ద అచీవ్‌మెంట్ అనుకోవచ్చు. కాని, రమణ విషయంలో నిజమైన లక్ష్యాలు, లక్ష్యసాధనలూ ఇక్కడినుంచే ప్రారంభమయ్యాయి.

మెడిసిన్ చదివుతున్నప్పుడు – అతను చదివే ఎన్నో సబ్జక్టు పుస్తకాలు, మెడికల్ జర్నల్స్‌లో ఆయా కంటెంట్ రైటర్స్ అయిన డాక్టర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్ట్స్‌ను కూడా బాగా అధ్యయనం చేసేవాడు రమణ. వారిలో అత్యధికశాతం మంది బ్రిటిష్ డాక్టర్లు. వారందరి ప్రభావం రమణ మీద అధికంగా పడింది.

“అలాంటి గొప్ప ప్లేస్‌కు కదా నేను వెళ్ళాల్సింది… వాళ్లంతా చదువుకున్న ఆ మెడికల్ కాలేజీల్లో కదా నేను చదవాల్సింది” అని అనుకొనేవాడు.

అదే అతని ప్రాథమిక లక్ష్యమయ్యింది.


కట్ చేస్తే –

ఎంబీబీయస్ అయిపోగానే – మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక సంవత్సరంపాటు ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే – ఒకవైపు ఇంగ్లిష్ గ్రామర్ క్లాసులకు వెళ్లేవాడు, మరోవైపు ఇంగ్లండ్ వెళ్ళి పీజీ చదువుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండేవాడు.

పీజీలో తను కార్డియాక్ సర్జనే కావాలనుకున్నాడు. అది కూడా, హృద్రోగంతో బాధపడే చిన్నపిల్లలకు శస్త్ర చికిత్స చేసి, వారిని బ్రతికించగలిగే కార్డియాక్ సర్జనే కావాలనుకున్నాడు.

ఒకవేళ – ఈ స్పెషలైజేషన్‌లో సీటు రానట్టయితే మాత్రం – “ప్లాస్టిక్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ” చేయాలనుకున్నాడు.

కాని, డాక్టర్ రమణ సంకల్పం గొప్పది. కార్డియాక్ సర్జనే అయ్యాడు. ప్రస్తుతం లివర్‌పూల్‌లోని ఆల్డర్ హే చిల్డ్రెన్స్ హాస్పిటల్‌లో కన్‌సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

ఇక్కడొక విషయం తప్పక చెప్పుకోవాలి…

మనవాళ్లలో ఒక విచిత్రమైన మైండ్‌సెట్ ఉంటుంది… మాతృభాష అయిన తెలుగు మీడియంలో చదివినవాళ్లు అంతర్జాతీయస్థాయి పోటీలో నిలబడలేరనీ, తట్టుకోలేరనీ, రాణించలేరనీ!

ఈ మైండ్‌సెట్ ఉట్టి ట్రాష్ అని డాక్టర్ రమణ లాంటివాళ్ళు పదే పదే ప్రూవ్ చేశారు.

ఇటీవలి జనరేషన్ వరకూ – దేశంలోని అత్యధికశాతం మంది ఐఏయస్‌లు, ఐపియస్‌లు, డాక్టర్లూ, ఇంజినేర్లూ… విదేశాల్లో కూడా అత్యున్నతస్థాయి ప్రొఫెషన్స్‌లో పనిచేస్తున్న ఎందరో కూడా, వారి కాలేజీ స్థాయివరకు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారే!

కట్ బ్యాక్ టూ మన డాక్టర్ రామ్ –

ప్రారంభంలో రమణ ఆలోచనలు వేరే. బ్రిటన్‌లో చదువుకుని, తిరిగి ఇండియా వచ్చి, ఇక్కడే డాక్టర్‌గా సేవలందించాలని.

కాని – అక్కడున్నప్పుడే పెళ్లి కావడం, పిల్లలు, వారి చదువు కొనసాగడం… ఇవన్నీ ఒకదానివెంట ఒకటి అలా అలా అతన్ని అక్కడే స్థిరపడేలా చేశాయి.

అయితే – మధ్యలో ఒకసారి ఇండియా వచ్చాడు. యూకే నించి తిరిగి ఇండియా వచ్చి, ఇక్కడే స్థిరపడి, ఇక్కడే డాక్టర్‌గా సేవలందించాలనుకున్నాడు.

కొంత అధ్యయనం చేశాడు. కొన్ని హాస్పిటల్స్‌లో ఇంటర్వ్యూలకెళ్ళాడు.

కాని, డాక్టర్ రమణకు ఇక్కడి హాస్పిటల్స్‌లోని కార్పొరేట్ సిస్టమ్ నచ్చలేదు. హాస్పిటల్స్ ప్రయారిటీస్‌లో ఆరోగ్యం కంటే ముందు బిజినెస్ ఉండటం అనేది అసలు నచ్చలేదు.


యూకేలో 98% హెల్త్ సర్విస్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఏ స్థాయిలోనైనా ఇక్కడిలాంటి కరప్టివ్ సిస్టమ్ అక్కడి హాస్పిటల్స్‌లో ఉండదు.

“ఇక్కడ చేయలేను” అనుకున్నాడు. ఇక, ఆ ఆలోచన మానుకున్నాడు.

ఆల్డర్ హే హాస్పిటల్‌లో కార్డియాక్ సర్జన్‌గా ఎన్నో వందల సర్జరీలు చేసి ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడాడు డాక్టర్ రమణ.

బ్రతికిన ఆ పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ ఒక హీరో అయ్యాడు. వారందరి నుంచీ ప్రతి యేటా, పండుగలప్పుడూ, ప్రత్యేక సందర్భాల్లోనూ ఉత్తరాలూ, గ్రీటింగ్సూ అందుకుంటుంటాడు డాక్టర్ రమణ.

తన ప్రొఫెషనల్ సర్కిల్‌లో, హాస్పిటల్లో బ్రిటిషర్స్ చాలామందికి “రమణ” పేరును కరెక్టుగా ఉచ్ఛరించడం కష్టమై – సింపుల్‌గా అందరూ “రామ్” అని పిలవడం అక్కడ అలవాటైపోయింది.

తమ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా, కొంతమంది పేరెంట్స్ “రామ్” పేరునే తమ పిల్లలకు పెట్టుకున్నారంటే – డాక్టర్ రమణలోని సేవాదృక్పథం, తన వృత్తిపట్ల ఒక పవిత్రమైన సంకల్పం ఏ స్థాయివో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఆల్డర్ హే హాస్పిటల్లోనే కాకుండా – దేశవిదేశాల్లోని అనేక హెల్త్ క్యాంపులు కూడా అటెండవుతూ కూడా, వందలాది చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేస్తూ వారి ప్రాణాల్లు కాపాడుతున్న రికార్డు డాక్టర్ రమణకుంది.


“హీలింగ్ లిటిల్ హార్ట్స్” అనే చారిటీ సంస్థలో ట్రస్టీ పదవితోపాటు, ప్రధాన కార్డియాక్ సర్జన్‌గా కూడా ఉన్నాడు డాక్టర్ రమణ.

ఇప్పటివరకు ఇండియా, టాంజానియా, పాలస్తీనా వంటి దేశాల్లో హార్ట్ క్యాంపులకు వెళ్లాడు రమణ. ఇండియాలో – శ్రీనగర్, పాండిచ్చేరి, సూరత్, దుర్గాపూర్, పూనే, ముంబై, విజయవాడ, కరీంనగర్‌లలో క్యాంపులు నిర్వహించాడు. నమీబియా, జోర్డాన్, నికరాగ్వా దేశాలకు కూడా వెళ్ళాల్సింది. ఇటీవలి కోవిడ్ లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఆ హార్ట్ క్యాంప్ పర్యటనలు వాయిదా పడ్డాయి.

మొత్తంగా ఇప్పటివరకు సుమారు 250 ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేసి, పిల్లల ప్రాణాలు కాపాడాడు డాక్టర్ రమణ.

ప్రఖ్యాత బీబీసి చానల్ రూపొందించిన హెల్త్‌కేర్ వెబ్ సీరీస్ “హాస్పిటల్”లో డాక్టర్ రమణకు కూడా సముచితమైన స్థానమివ్వడం మరొక గొప్ప విషయం.

డాక్టర్ రమణలోని ఈ సేవా దృక్పథాన్ని, ఈ దిశలో అతని రికార్డుని గుర్తించి, 2019 లో బ్రిటిష్ హార్ట్స్ ఫౌండేషన్ వారు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక హార్ట్ హీరో అవార్డుల్లో – “హెల్త్‌కేర్ హీరో” అవార్డును ఇచ్చి సత్కరించారు.

దేశం కాని దేశంలో – ఒకప్పుడు వర్ణ వివక్ష రాజ్యం ఏలిన రాజ్యంలో – మన డాక్టర్, అక్కడి నేటివ్ బ్రిటిషర్స్‌కు ఒక ఆరాధ్య హీరో కావడం, దాన్ని ఆ దేశపు జాతీయస్థాయి సంస్థ బ్రిటిష్ హార్ట్స్ ఫౌండేషన్ గుర్తించడం… నిజంగా ఎంత గొప్ప విషయం! ఎంత గర్వించదగ్గ విషయం!!


ఇక డాక్టర్ రమణ వ్యక్తిగత జీవితానికొస్తే –

డాక్టర్ రమణ 1997 లో వివాహం చేసుకొన్నాడు. భార్య పేరు శిరీష. తను కూడా డాక్టరే. తను మెడిసిన్ చదివింది కూడా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోనే.

అలాగని, వారిద్దరిదీ ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన వివాహం కూడా కాదు.

“నీకు ఆ అమ్మాయి అయితే బావుంటుంది” అని ఫ్రెండ్స్ కుదిర్చిన “ఫ్రెండ్స్ అరేంజ్‌డ్ మ్యారేజ్!”

డాక్టర్ రమణ-డాక్టర్ శిరీషలకు హృదిత, మన్హిత అని ఇద్దరమ్మాయిలు.

పిల్లలిద్దరి పేర్లలో కూడా “హార్ట్” ఉన్న విషయం మనం గుర్తించవచ్చు!

డాక్టర్ రమణకు క్రికెట్, కబడ్డీ అంటే ఇష్టం. ముఖ్యమైన టోర్నమెంట్స్ టీవీలో చూస్తాడు. ఇండియన్ టీమ్ గాని ఇంగ్లండ్‌లో ఆడుతున్నట్తైతే మాత్రం – టికెట్ తీసుకొని స్టేడియం వెళ్ళి చూస్తాడు.

చిన్నప్పుడు రమణకు ఆర్ట్, పోయెట్రీ వంటివి చాలా ఇష్టంగా ఉండేవి. ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మ్యూజిక్ ఇష్టపడతాడు. ప్రతిరోజూ తెలుగు దినపత్రికలు ఆన్‌లైన్‌లో చదువుతాడు. తన ప్రొఫెషనల్ కొలీగ్స్‌తో, పేషెంట్స్ పేరెంట్స్‌తో, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు డాక్టర్ రమణ.


లండన్ లోని “ఆల్ ఆంధ్ర గ్రాడ్యుయేట్స్ మీట్” అనే సాంస్కృతిక సంస్థ ద్వారా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండి పాలుపంచుకొంటాడు. 2015 లో ఈ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తనికెళ్ల భరణిని ఆహ్వానించాడు రమణ.

ఇంకా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్‌గా పాల్గొంటూవుంటాడు డాక్టర్ రమణ.

సుమారు గత 28 ఏళ్ళుగా యూకేలో ఉంటున్న డాక్టర్ రమణ… ఇండియా నుంచి యూకే వచ్చి చదువుకోవాలనీ, కెరీర్‌లో ఎదగాలనీ అనుకొనే యువతరానికి ఆన్‌లైన్‌లో నిరంతరం అవసరమైన సలహాలనిస్తూ ప్రోత్సహిస్తుంటాడు.

“నాకు ఇది లేదూ… అది లేదూ అనుకోవడం అంతా ఉట్టిది. సాధించాలనుకుంటే ఇవన్నీ ఏవీ ఎవరికీ అడ్డం కావు” అంటాడు డాక్టర్ రమణ.


ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“Have an ambition or goal, never loose focus on your goal. With determination, courage and hard work you will achieve your dreams. Failures are common but never loose hope, learn from them and use them as stepping stones for success.”

దటీజ్ డాక్టర్ రామ్ – ఉరఫ్ – డాక్టర్ రమణ ధన్నపునేని!

No comments:

Post a Comment