Saturday 17 July 2021

ఒక అంతశ్శోధన

మన నిర్ణయాలనుబట్టే కొన్ని కలిసిరావడమో, కలిసిరాకపోవడమో జరుగుతుంది. ఇది నా వ్యక్తిగత నమ్మకం. చాలా సందర్భాల్లో నా అనుభవం కూడా. 

అలాగే - తలరాత, విధిరాత, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది .. వంటి మాటలను కూడా నేను నమ్మలేను. నమ్మను. మన కృషినిబట్టే ఫలితం ఉంటుందన్నది నేను గట్టిగా నమ్ముతాను. నా అనుభవం కూడా. 

అయితే - వీటన్నిటికి అతీతంగా, చాలా అరుదుగా, జీవితంలో కొన్ని ఊహించనివి కూడా జరుగుతుంటాయి. అపుడే అర్థమవుతుంది. సంథింగ్ ఇంకేదో అద్భుత శక్తి ఉందని!  

అప్పుడే బాగా ఆలోచనలో పడిపోతాం. నిజంగా ఆలోచిస్తాం.  

కట్ చేస్తే - 

పొద్దున లేవగానే మనకు కనిపించే సూర్యుడు, మనం పీల్చే గాలి, మన క్రియేటివిటీకి అందనన్ని అద్భుతాలతో ఎప్పటికప్పుడు మన చుట్టూ మనకు కొత్తగా కనిపించే ప్రకృతి... ఇవన్నీ నిజమే అయినప్పుడు, వీటన్నిటినీ సృష్టించిన ఆ అద్భుత శక్తి ఏదో కూడా నిజమే అని నా నమ్మకం. 

ఆ అద్భుత శక్తికే మనం దేవుడు-లేదా-దేవత అని పేరు పెట్టుకొని పిలుస్తున్నాం.  

ఈ అనంత విశ్వంలో ఉన్న ఎన్నో కోట్ల జీవరాశుల్లో, భూమ్మీది మనిషి కూడా ఒక జీవి అనుకుంటే... ఇన్ని కోట్లమంది మనుషుల్లో, ప్రతి ఒక్కరి మంచి చెడ్దల జమాఖర్చులు చూసుకొంటూ గడిపేంత లీజర్‌గా ఆ దేవుడు ఉండకపోవచ్చని నేననుకుంటాను. మన పాపపుణ్యాలనో, మన పూర్వజన్మ సుకృతాలనో దుష్కృతాలనో నేపథ్యంగా తీసుకొని, మనిషి జీవితంలో ఇన్ని బాధల్ని సృష్టించేంత శాడిస్టు కూడా కాదని నేను మరింత గట్టిగా నమ్ముతాను.

“పైవాడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది” అంటూ, దీనికి కూడా ఆ శక్తినే, ఆ దేవున్నే బాధ్యున్ని చేయడం అనేది హాస్యాస్పదమైన మూర్ఖత్వం. 

కాని, మన ఈ నమ్మకాలన్నిటికీ అతీతంగా కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ తప్పక చేసే ఉంటాడు దేవుడు అని కూడా అనుకోకతప్పదు. ఆయన ప్రోగ్రామింగ్‌ ప్రకారం కాకుండా మరో విధంగా మన జీవితం నడుస్తున్నప్పుడే మనం ఊహించని సంఘటనలు కొన్ని మన జీవితంలో జరుగుతాయి.  

అది మనకు బాగుంటే ఆ దారిలోనే నడవమనీ, అది మనల్ని బాధపెడితే మన నుంచి ఆయన ఆశించింది వేరనీ, మరింకేదో ప్రయోజనం మన జీవితానికుందనీ మనం అర్థం చేసుకోవాల్సిన రిమైండర్ అది. 

ఈగో వదిలేసి, దీన్ని ఫీలైన వాళ్ళు జీవితంలో సుఖంగా ఉంటారు. మిగిలినవాళ్ళు జీవిత పర్యంతం నానా సంఘర్షణలతోనే ముగిసిపోతారని నాకనిపిస్తుంది.   

సో, ఆయన చేయాలనుకొన్న పని ఆయన చేశాడు. మనం చేయాల్సింది మనం చేయాలి. అది కూడా అందంగా చేయాలి, ఆనందంగా వుండాలి. 

అప్పుడు మాత్రమే ఆయనకు... ఆ అద్భుతశక్తికి ఆనందంగా వుంటుంది. 

ఈమాత్రం అంతర్విశ్లేషణ చాలామందిలో యాభై దాటాక గాని రాకపోవడమన్నదే జీవితంలో అతి పెద్ద దుఖం.  

“Spirituality is more smiling, less worrying. More compassion, less judgment. More blessed, less stressed. More love, less hate.”
― Roy T. Bennett

2 comments:

  1. సో, ఆయన చేయాలనుకొన్న పని ఆయన చేశాడు. మనం చేయాల్సింది మనం చేయాలి - 👌👌

    The creator gave us discretion and some free will. It is up to the humans to use them wisely.

    ReplyDelete
    Replies
    1. Yes. You said it right! And... Thanks for the comment.🙂

      Delete