Sunday 21 March 2021

ప్రతి సినిమాకూ ఓ కథ ఉంటుంది!

నేను చెప్పేది మామూలు సినిమా కథ గురించి కాదు... 

ప్రతి సినిమాకు ఒక విభిన్న నేపథ్యం ఉంటుంది. అంటే -  సినిమా వెనుక కథ అన్నమాట.

అసలా ఆలోచన ఎలా వచ్చింది... మార్కెట్ అవుతున్న కాంబినేషన్స్‌ను క్యాష్ చేసుకోవడం అన్న ఆలోచనలోంచి పుట్టిందా? ఒక కథ అనుకుని దానికి తగిన హీరోకి చెప్పి ఒప్పించుకోవడం నుంచి పుట్టిందా? నిర్మాతతో ఒక సిట్టింగ్ వేశాక పుట్టిందా? కొత్తవాళ్లతో చిన్న బడ్జెట్‌లో తీయాలి అనుకొని ప్రారంభించిందా? ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చిన ఒక కొత్త హీరోని పరిచయం చేయాలన్న లక్ష్యంతో మొదలెట్టిందా? ఒక హీరోయిన్‌తో ఉన్న పర్సనల్ ఆబ్లిగేషన్‌తో ఆమెను పైకి తీసుకురావాలని చేసిన ప్రాజెక్టా? అసలు ఎలాంటి ఆర్థిక వనరులు లేకుండా ప్రారంభించి అలా అలా కొనసాగించిందా? ఒక బిజినెస్ మ్యాన్ మనీ మానిప్యులేషన్స్ అవసరాల కోసం తీసిందా? ఇన్‌కమ్ ట్యాక్స్ అవసరాలకోసం ఫెయిల్ కావాలని తీసిందా?... ఇంకా చాలా ఉంటాయి.   

ఇలా - ప్రతి సినిమా వెనుక నిజంగా ఇంకో కథ ఉంటుంది. ఈ కథ గురించి కేవలం ఒకరిద్దరికే తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంకో నలుగురు ముఖ్యమైన వ్యక్తులకో, టీమ్‌మెంబర్స్‌కో తెలిసే అవకాశం ఉంటుంది. 

ఈ నేపథ్యం తెలియకుండా చేసే జడ్జ్‌మెంట్-aka-విశ్లేషణ ఏదైతే ఉందో... దాన్ని చూసి ఆయా సినిమాల మూలకర్తలు, నేపథ్యం తెలిసిన ఆ కొద్దిమంది నవ్వుకోడం, జాలిపడ్డం తప్ప వేరే ఏమీ ఉండదు. 

'అద్భుతం' అని వీళ్ళు విశ్లేషించి రాసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడతాయి. వీళ్ళు అది తక్కువుంది... ఇది ఎక్కువుంది... ఇలా తీయాల్సింది... అలా తీయాల్సింది అని ఏకేసి, 'చెత్త సినిమా' అని తేల్చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్‌లవుతాయి!

ఇక - కొంతమంది మేధావులు విశ్లేషించే అద్భుత సినిమాలకు అసలు జనం రారు!!

ఇదంతా ఆయా విశ్లేషకుల వ్యక్తిగత అభిరుచి, స్వేచ్చకు సంబంధించింది.  అయితే - 90 శాతం మంది సినీ ప్రేక్షకులకు ఈ విశ్లేషణలు తెలియవు, అసలు పట్టవు. 

కాని - టికెట్స్ తెగేదీ, సినిమా జయాపజయాలు నిర్థారించబడేదీ మాత్రం ఈ సగటు ప్రేక్షకులవల్లే అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన నిజం.      

అయితే - ఆయా విశ్లేషణలు రాసినవాళ్ళకు మాత్రం అదో తుత్తి. దాని కింద కామెంట్లు, మెచ్చుకోళ్ళు వారికి ఇష్టం, లేదా ఎడిక్షన్. 

అది వారి గోల్... వారి విశ్లేషణల వెనుక కథ. 

ఎవరి క్రియేటివ్ ఫ్రీడమ్ వారిది. ఎవరి గోల వారిది. సోషల్ మీడియా వచ్చాక ఈ గోల చాలా పీక్స్‌కు చేరింది. 

కొంతమందికి ఇందాక చెప్పినట్టు అదో తుత్తి. కొంతమందికి స్ట్రెస్ బస్టర్. కొందరికి టైమ్‌పాస్. కొందరికి వ్యక్తిగత అవసరం. కొందరికి ప్రొఫెషన్. 

కట్ చేస్తే - 

నాకున్న పరిమిత జ్ఞానంతో నేను గ్రహించింది ఏంటంటే - "సినిమా ఇలా తీయాలి, అలా తీయాలి, ఇక్కడ స్లో అయింది, అక్కడ చప్పగా ఉంది, సెకండాఫ్ పోయింది..." అని అంత బాగా సినిమా ఆర్ట్ గురించి తెలిసినవాళ్ళూ, అంత బాగా చెప్పేవాళ్ళూ ఎవ్వరూ ఇంతవరకు ఒక్క సినిమా తీయలేదు!

తీసిన ఒకరిద్దరు, వాళ్ళు దశాబ్దాలుగా వారు చెబుతూవచ్చిన తూనికల లెక్కలకు సరితూగే హిట్ సినిమా ఒక్కటి కూడా చేయలేదు. చేయలేరు!!

హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ మీదుగా, కోలీవుడ్, టాలీవుడ్... ఎక్కడయినా ఇంతే.

సినిమా తీసేవాళ్లు తీస్తుంటారు. వాటి గురించి రాసేవాళ్ళు రాసుకుంటారు. ఎవరి బిజినెస్ వారిది. ఎవరి పని వారిది.   

ఇప్పుడైతే సినిమా ఒక బిగ్ బిజినెస్. 

ఈ బిజినెస్‌లో - బాలీవుడ్‌ను కూడా వెనక్కి తోసి - చాలా కోణాల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.   

సినిమా అంటే ఇప్పుడు - క్రియేటివిటీ ఒక్కటే కాదు. సమీకరణాలు, లెక్కలు కూడా. 

ఎవరితో చేస్తున్నాం... ఏం చేస్తున్నాం... ఏ స్థాయిలో చేస్తున్నాం... డబ్బు ఎంత పెడుతున్నాం...   ఎంతొస్తుంది... అంత రావడానికి ప్రేక్షకులకు ఇంకా ఏమిస్తే బాగుంటుంది... ఎలాంటి ప్రమోషన్ చేయాలి? 

ఇదే ఇప్పటి సినిమా.

ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్ ఫస్ట్.

ఆ తర్వాతే ఇంకేదైనా. 

Filmmaking is an art. A passion. And... a big business too. 

No comments:

Post a Comment