Wednesday 17 February 2021

హాపీ బర్త్‌డే, కేసీఆర్!

రాష్ట్ర అసెంబ్లీలో ఒకప్పుడు తెలంగాణ పదాన్నే నిషేధించారు అని విన్నప్పుడు రక్తం మరుగుతుంది. 

అదే అసెంబ్లీలో - తమ పార్టీ అధినేతలకు చెంచాగిరీ చేస్తూ, నోరెత్తక కూర్చున్న అనేకమంది ‘సన్నాసి’ తెలంగాణ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్లేలను గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గనిపిస్తుంది. 

ఇలాంటి నేపథ్యంలో - దశాబ్దాలుగా లేస్తూ, పడిపోతూ .. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి, నింగిని అంటుకునేలా రగల్చడానికి ఒక ఉద్యమ నాయకుడు అవసరమయ్యాడు. 

ఆ అవసరాన్ని గుర్తించి - తెలంగాణ సాధనే తన జీవితాశయంగా, జీవితంగా మార్చుకొని - తిరుగులేని ఉద్యమనాయకుని అవతారమెత్తిన ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు .. ఉరఫ్ .. కేసీఆర్.  

తన తిండి, తిప్పలు, గాలి, నీరు, నిద్ర .. అన్నీ తెలంగాణగా పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో నానా విన్యాసాలు చేశాడు కేసీఆర్. 

ఎన్నో అడ్డంకులు. అవమానాలు. ఎదురుదెబ్బలు. ఎగతాళి. తిట్లు. శాపనార్థాలు. 

అయినా చెక్కు చెదరని ఏకాగ్రతతో - ఎదుటివారికి ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్టులు ఇస్తూ, తికమకపెడుతూ, అవేశం రగిలినప్పుడు తిడుతూ, అవసరమైనచోట అణకువ పాటిస్తూ, అందరిని కలుపుకుపోతూ - ఉద్యమాన్ని ముందుకే నడిపాడు తప్ప .. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జ్వాల ఆరిపోనివ్వలేదు. 

ఏం మేధస్సు .. ఎంతటి వాగ్ధాటి .. అసలు ఏమిటా జ్ఞాపక శక్తి .. 

ఎంత పట్టుదల .. ఎంత ఓర్పు .. ఎంత శక్తి .. ఎంత మానవత్వం .. ఎంత చాకచక్యం .. ఎన్ని ఎత్తులు .. ఎన్ని జిత్తులు .. 

అన్నీ ఒకే ఒక్క లక్ష్యం కోసం. 

అది .. తెలంగాణ సాధన. 

ఈ ఒక్క లక్ష్యమే కేసీఆర్ నోటివెంట విసరడానికి సిధ్ధంగా ఉన్న గ్రెనేడ్ లాంటి ఒక మాటగా వేలాదిసార్లు వినిపించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించింది: 

"తెలంగాణ తెచ్చుడో .. సచ్చుడో!" 

ఎంత ఆత్మ విశ్వాసం .. ఎంత తెగింపు .. ఎంత లేజర్ ఫోకస్ .. 


చివరికి ఒక రోజు - "ఆంధ్రప్రదేశ్ నుంచి డిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణ గడ్డమీదనే!" అని చెప్పి మరీ వెళ్లాడు కె సి ఆర్. 

చెప్పినట్టుగానే, నాలుగురోజుల తర్వాత .. డిల్లీ నుంచి తెలంగాణ గడ్డమీదనే మళ్ళీ కాలుపెట్టాడు కేసీఆర్. 

దటీజ్ కేసీఆర్! 

విజయమే లక్ష్యంగా - వందలాది నాయకుల్ని, వేలాది గ్రూపుల్నీ సంఘాల్నీ, కోట్లాది ప్రజలను సమన్వయం చేసుకొంటూ - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ, పరుగెత్తిస్తూ - ఉద్యమాన్ని ఉరకలెత్తించి గమ్యం చేర్చిన కేసీఆర్ గత పద్నాలుగేళ్ల జీవితం, నా జీవితకాలంలో నేను స్వయంగా నా కళ్లముందు చూసిన ఒక విజయ గాథ. 

ఒక లైవ్ సక్సెస్ స్టోరీ. 

కాగా - ఈ గమ్యం చేరుకోవడం కోసం ఆయన వేసుకున్న బ్లూప్రింటు, అనుసరించిన వ్యూహం, నడిపించిన డిప్లొమసీ, కూడగట్టిన లాబీయింగ్, వేసిన ఎత్తులు, చేసిన జిత్తులు, ఆవేశంలో అరచిన అరుపులు, పడిన తిట్లు, పాటించిన మౌనం, పెట్టిన చెక్‌లు .. అదంతా ఒక యుద్ధతంత్రం. 

అప్పుడు ఉద్యమ సమయంలో తెలంగాణ సాధనకోసం - ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ అద్భుత భవిష్యత్తు కోసం - ఇంటా బయటా ఇంచుమించు అదే యుద్ధతంత్రం! 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన అంతటి ఒక వ్యక్తికి, ఉద్యమశక్తికి .. తన కలల తెలంగాణ రూపశిల్పికి, దాని సాధనకోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిపోతున్న సిసలైన రెనెగేడ్ కార్యసాధకునికీ .. ఒక రచయితగా, ఒక చలనచిత్ర దర్శకుడిగా,  ఒక అభిమానిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఇవే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు... 

No comments:

Post a Comment