Wednesday 29 July 2020

మరియా షరపోవాకు బాగా నచ్చిన కొటేషన్!

వుమెన్ టెన్నిస్ క్రీడాకారిణులలో నాకు మరియా షరపోవా అంటే చాలా ఇష్టం. 

అందం ఒక్కటే కాదు, షరపోవా మీద నా ఇష్టానికి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి... 

రష్యన్ భాష అన్నా, రష్యన్ చరిత్ర-సంస్కృతి అన్నా, రష్యన్ అమ్మాయిలన్నా నాకు చాలా ఇష్టం.

మరియా షరపోవా రష్యన్ అమ్మాయి.  

ఆమె క్రీడాకారిణి మాత్రమే కాదు... ఇంటర్నేషనల్ మోడల్, నైక్ వంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాస్సాడర్ కూడా. షరపోవా పేరు మీద ఎన్నో బ్యూటీ, ఫిట్‌నెస్, ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ప్రపంచ మార్కెట్లో ఉన్నాయి.

వింబుల్డన్, ఫ్రెంచ్, యూఎస్, ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్స్ నాలుగూ గెలుచుకొన్న అతితక్కువమంది ప్రపంచ క్రీడాకారిణుల్లో షరపోవా ఉంది. తను మొత్తం 5 సార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకొంది. 

ఈమధ్యే ఫిబ్రవరి 26 నాడు టెన్నిస్ నుంచి రిటైరయిన షరపోవా పుట్టింది రష్యాలోని న్యాగన్‌లో, కాని 1994 నుంచి అమెరికాలోనే పర్మనెంట్ రెసిడెంట్‌గా స్థిరపడిపోయింది. 

కట్ టూ మరియా షరపోవా, ది అన్‌స్టాపబుల్ -

యూఎస్ లోని ఫ్లోరిడాలో ఒకరోజు అర్థరాత్రి... ఒక తండ్రి, తన కూతురిని తీసుకొని గ్రేహూండ్ బస్ దిగి, నేరుగా నిక్ బొలెట్టేరి టెన్నిస్ అకాడెమీ బెల్ కొట్టాడు.

అంత అర్థరాత్రి సమయంలో ఆ అకాడెమీకి ఎవరో ఇద్దరు వచ్చి అలా బెల్ కొడతారని అకాడెమీలో ఎవరూ అనుకోలేదు. 

ఆ ఇద్దరూ వచ్చింది రష్యా నుంచి... 

7 ఏళ్ల ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి తండ్రికి ఆ క్షణం మనసులో ఉన్న సంకల్పం ఒక్కటే... ఆ అమ్మాయి భవిష్యత్ టెన్నిస్ స్టార్ కావడం! 

అంత పెద్ద లక్ష్యంతో రష్యా నుంచి తన కూతురిని తీసుకొని అమెరికా వచ్చిన ఆ తండ్రిదగ్గర అప్పుడున్న డబ్బు కేవలం 700 డాలర్లు. 

ఆతర్వాత వాళ్లు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్నెన్ని త్యాగాలు చేశారో వారికి మాత్రమే తెలుసు. కాని, వారి కల నిజమైంది. అనుకున్నది సాధించారు.

తన 17 ఏళ్ల వయసులో, అదే అమ్మాయి, వింబుల్డన్ ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి టెన్నిస్ స్టార్ అయింది. 

అప్పటి ఆ 7 ఏళ్ల అమ్మాయే... ఈ 17 ఏళ్ల టెన్నిస్ స్టార్ మరియా షరపోవా! 

తర్వాతంతా చరిత్రే. 

తన 18వ ఏట WTA ప్రపంచపు నంబర్ 1 ర్యాంక్ సాధించింది షరపోవా. ఒక్కొక్కటిగా వరుసగా ప్రపంచపు 4 గ్రాండ్‌స్లామ్స్ సాధించింది. ప్రపంచం మర్చిపోలేని అతికొద్దిమంది టెన్నిస్ స్టార్స్‌లో ఒకరిగా చరిత్రలో తనకంటూ ఒక అందమైన పేజీని సృష్టించుకొంది.     

చాలా హుందాగా, అందంగా... సరైన సమయంలో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది.

షరపోవా ఈ విజయయాత్ర వెనుక లెక్కలేనన్ని ఆమె చేసిన త్యాగాలు, ఆమె పడ్ద కష్టాలు, తను అనుభవించిన ఎన్నెన్నో మానసిక, భౌతిక గాయాలు... మొత్తంగా ఆమె ఆట లాగే, ఒక థ్రిల్లింగ్ అనుభూతినిచ్చే సంగతులెన్నో షరపోవా రాసుకున్న తన పుస్తకం "UNSTOPPABLE - MY LIFE SO FAR" లో మనం చదవొచ్చు.

షరపోవా మాటల్లోనే చెప్పాలంటే, ఆమె రాసిన ఈ పుస్తకం - "This is a story about sacrifice, what you have to give up. But it’s also just the story of a girl and her father and their crazy adventure."
స్వీట్లు తినడం చాలా ఇష్టపడే మరియా షరపోవాకు "ప్లీజ్", "థాంక్యూ" అనే రెండు ఇంగ్లిష్ పదాలంటే చాలా ఇష్టం. అయితే, ఈ రెండు అద్భుతపదాలను ఖచ్చితంగా అవి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలంటుంది షరపోవా. 

ఇక, షరపోవాకు బాగా నచ్చిన కొటేషన్ ఇది: "What makes a river so restful to people is that it doesn't have any doubt - it is sure to get where it is going, and it doesn't want to go anywhere else."

లక్ష్యసాధన విషయంలో షరపోవా నమ్మిన ఈ కొటేషన్ ఎంత సింపుల్‌గా ఉందో అంత సహజంగా ఉంది. అంత అద్భుతంగా కూడా ఉంది. 

"నదికి తెల్సు 
తను ఎక్కడికెళ్లాలో.
ఎన్ని అడ్దంకులొచ్చినా సరే,
అది ఎన్ని వంకలైనా తిరుగుతుంది,
ఎన్ని కొండలైనా దూకుతూ పారుతుంది.
కించిత్ సందేహం లేకుండా   
అది ఎక్కడికెళ్లాలో అక్కడికే వెళ్తుంది,
ఇంకెక్కడికీ వెళ్లదు."          

No comments:

Post a Comment