Tuesday 21 July 2020

"యూట్యూబ్ థంబ్‌నెయిల్" స్థాయికి దిగజారిన జర్నలిజం!

"ఏటీటీలో అంత భవిష్యత్తు ఉందా ?"
"ఏటీటీ అంటే బూతేనా?"
"వర్మ గుల తీరుతుందా, నిజం తెలుసా?"...

పై మూడు హెడ్డింగుల్లో ఒకటి ఓ వెబ్‌సైట్‌లో వచ్చింది కాగా, రెండోది ఓ దినపత్రికలోని సినిమా సెక్షన్లో వచ్చింది. మూడోది పక్కా యూట్యూబ్ హెడ్డింగే!

సినిసిజమ్. అల్టిమేట్ నెగెటివిటీ. హాబిచువల్ శాడిజమ్...

మొదటిదాన్ని అసలు ఆర్టికల్ అనలేము. ఏదో నింపాలి అన్నట్టు రాసిన ఫిల్లర్. అసలు ఏం రాయాలనుకున్నాడో, ఏం రాశాడో కూడా బహుశా ఆ రాసినతనికే తెలిసుండదు.

ఇది పబ్లిష్ చేసిన సైట్‌కు సంబంధించిన మాతృసంస్థ మాత్రం ఆన్‌లైన్లో మంచి మంచి ఇంటర్వ్యూ ప్రోగ్రాములు, టాక్ షోలు చేస్తూ, అతి తక్కువకాలంలో టాప్ స్థాయికి ఎదిగింది. వారి సైట్లో రాతలు మాత్రం ఇంత అర్థంలేని స్థాయిలో ఉండటం అనేది, బహుశా రావల్సినవారి దృష్టికి ఇలాంటివి రాకపోవడంవల్లనే అనుకుంటాను.

ఇక రెండోది సీనియర్ ఫిలిం జర్నలిస్టు వినాయకరావు రాసింది. ఆయన రాసినదాంట్లో ఈ హెడ్డింగ్‌లో ఉన్నంత నెగెటివిటీగాని, బూతుగాని లేదు. ఏటీటీ వల్ల భవిష్యత్తులో చిన్న బడ్జెట్ సినిమాలకు ఉండే ప్రయోజనాలను చెబుతూ మంచి నిర్మాణాత్మక శైలిలో బాగా రాశారు. నాకు తెలిసి, ఇలాంటి హెడింగ్ వినాయకరావు పెట్టి ఉండరు.

ఏటీటీలో ఆర్జీవీ వదిలిన 2 సినిమాల్లో కొంత అడల్ట్ కంటెంట్ ఉందనుకుందాం. అలాంటి సోకాల్డ్ బూతు లేని అదే ఆర్జీవీ సినిమాలు కరోనావైరస్, 12'ఓ క్లాక్, పవర్‌స్టార్ వంటివి కూడా అదే "ఆర్జీవీ వరల్డ్ థియేటర్" ఏటీటీలో రేపు రిలీజ్ కాబోతున్నాయికదా?... మరి ఏటీటీ అంటే బూతు ఎలా అవుతుంది?!

అదే "శ్రేయాస్ ఈటీ" ఏటీటీలో ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ వినాయక్, చంద్ర సిధ్ధార్థ వంటి డైరెక్టర్ల సినిమాలు కూడా త్వరలో రిలీజ్ కానున్నాయి. మరి వీళ్లంతా కూడా బూతు సినిమాలు తీసే డైరెక్టర్లనేనా ఈ పత్రిక ఉద్దేశ్యం?   

"ఏటీటీ అంటే బూతేనా?" అని ఏటీటీ గురించి అంత చీప్‌గా ప్రొజెక్ట్ చేసే టైటిల్ పెట్టిన ఆ పత్రిక, ఆ వ్యాసానికి ఇంకేదైనా ఫోటో వేయాల్సింది. కాని అప్సరా రాణి సెక్సీ ఫోటోనే వేసుకుంది!

"రామ రామ" అని లెంపలేసుకొంటున్న ఓ బుధ్ధిమంతుడి ఫోటో వెయ్యొచ్చుకదా?... వెయ్యరు, వెయ్యలేరు.

ఎందుకంటే...

ఆ పత్రికే కాదు... ప్రపంచంలోని ఏ పత్రికైనా, ఏ మీడియా అయినా సినీ ఆర్టిస్టుల ఫోటోలు, సినీ కంటెంట్ లేకుండా బ్రతకలేవు.

ఇక మూడోది పూర్తిగా యూట్యూబ్ థంబ్‌నెయిల్ కంటెంటే కాబట్టి, దాని గురించి నేను పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. ఈ 'యూట్యూబ్ జర్నలిస్టు' తను రెగ్యులర్‌గా రాజకీయాల గురించి చెప్పినంత డిగ్నిటీతోనే ఈ కంటెంట్‌ను కూడా ప్రజెంట్ చేయాల్సింది. కాని, మరీ "గుల" స్థాయికి దిగజారిపోవటం శోచనీయం.

డిజిటల్ ఫిలిం మేకింగ్ వచ్చిన కొత్తలో కూడా ఇలాగే రాశారు. ఇలాగే మాట్లాడారు. తర్వాత ఏమైంది? ఫిల్మ్ తయారుచేసే ఫాక్టరీలే మూతపడ్డాయి! ఇప్పుడూ అంతే. OTT, ATT ల మీద కనీస అవగాహన లేకుండా తోచిన ఏ చెత్తో రాయడం ఈజీ. తర్వాత ఫూల్స్ అయ్యేది వీళ్లే!

Naysayers always talk BS...

కట్ చేస్తే -

బూతు బూతు అని మొత్తుకొనే వీళ్లలో అత్యధికశాతం మంది నిజజీవితంలో బూతు లేకుండా బ్రతకగలరా?

బూతు బూతు అని బయటికి మొత్తుకొంటూ, లోపల వాట్సాపుల్లో బూతునే షేర్ చేసుకొనే ఈ ద్విముఖులంతా, తాపీ ధర్మారావు రాసిన "దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?" పుస్తకం ఒకసారి చదవాల్సిన అవసరం చాలా ఉంది.