Monday 6 July 2020

ఏది సెన్సేషన్ చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఒక్క నిమిషం ఆలోచించాలి!

ఇందాకే ఒక కొత్త యూట్యూబ్ చానెల్లో ఓ చిన్న వీడియో చూశాను. ఆ 2.55 నిమిషాల వీడియోలో కనీసం ఒక డజన్ సార్లు "హైద్రాబాద్ భయానకం", "అత్యంత దారుణం", "కరోనా విళయతాండవం" వంటి పదాలతో లేని "భయానక-దారుణ-విళయతాండవం"ను క్రియేట్ చేసి, సెన్సేషన్ చేసే ప్రయత్నం జరిగింది.

అది కూడా ఎక్కడో హైద్రాబాద్‌కు కనీసం ఓ 600 కిలోమీట్ర్ల దూరంలో ఉండి!

మనదేశంలో కోటికిపైగా జనాభా ఉన్న అన్ని మెట్రోసిటీల్లో పరిస్థితి ఎలా ఉందో, హైద్రాబాద్‌లో కూడా అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా మెరుగ్గా ఉంది.

అలాగని ఈ వీడియో ఏ రాజకీయ ప్రయోజనాలకోసమో చేశారని నేను అనుకోను. ఏదో ఒకటి సెన్సేషనల్‌గా చెప్పాలన్న అత్యుత్సాహంతో చేసిన వీడియో ఇది. యూట్యూబ్‌లో చేసే అనేక చిల్లర వీడియోల్లాగా, ఇలాంటి న్యూస్ ఐటెమ్స్ గురించి చెప్పే వీడియోలను రూపొందించవద్దు. ఇలాంటి వీడియోలు ప్రజల మానసిక స్థైర్యం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్నది ఒక్క నిమిషం ఆలోచించాలి.

ఇప్పుడున్న ఈ కరోనా విపత్తులో ఇలాంటి వీడియో తాండవాలు అసలు చెయ్యకూడదు. 

కట్ చేస్తే -

ఆర్జీవీ ఈ 3 నెలల్లో, ఇదే హైద్రాబాద్‌లో ఒక అరడజన్ సినిమాలను నిర్మించి, OTT ద్వారా వాటిలో కొన్ని రిలీజ్ చేసి, కోట్లు కొల్లగొట్టాడు. ఇంకో అరడజన్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇదే పధ్ధతిలో ఇంకొందరు డైరెక్టర్లు సినిమాలు రూపొందిస్తున్నారు. నా సినిమాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

కొత్తగా ఇంకో నాలుగు OTT లు కూడా రంగప్రవేశం చేయబోతున్నాయి. వాటిల్లో నా మిత్రుడు ఒకరిది కూడా ఉంది. ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ న్యూస్‌నో, ఇంకేదో న్యూస్‌నో సెన్సేషన్ చేసి చెప్పడంలో కొంత అర్థం ఉంటుంది.

తగిన జాగ్రత్తలు చెబుతూ, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన న్యూస్ విషయంలో, హైద్రాబాద్‌లో లేని విళయతాండవాన్ని సృష్టించి, ఏదో సెన్సేషన్ చెయ్యాలనే ప్రయత్నం చెయ్యడం మాత్రం మూర్ఖత్వం, అవివేకం, బాధ్యతారాహిత్యం కూడా.