Tuesday 30 June 2020

ఒకే ఒక్కడు 2.0

కరోనాను, లాక్‌డౌన్ టైమ్‌ను ఆర్జీవీ వాడుకున్నంతగా ఎవరూ వాడుకొని ఉండరు అనుకున్నాను మొన్నటివరకూ.

కాని ఆయన తర్వాత ఇంకొకరు కూడా లైన్లో ఉన్నారని మొన్ననే అర్థమైంది.

ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే 98 సినిమాలు పూర్తిచేసి, 99 వ సినిమా మీద పనిచేస్తూ, 100 వ సినిమా అనౌన్స్‌మెంట్ గురించి సన్నాహాల్లో ఉన్నాడీయన.

100 వ సినిమా అయితే ది గ్రేట్ రాఘవేంద్రరావుగారితో కావచ్చు. లేదంటే, ఆర్జీవీతో కావచ్చు. ఏదైనా జులైలో అనౌన్స్‌మెంట్ ఉంటుంది.

ప్రపంచపు మొట్టమొదటి ATT (Any Time Theater) ShreyasET పుట్టడానికి కారణమైన ఆర్జీవీ... అదే ప్లాట్‌ఫామ్ మీద RGVWorld.in అని తన సినిమాల సూపర్ మార్కెట్ ఓపెన్ చేసి, ఒక్కో సినిమా రిలీజ్ చేసి, కోట్లు కొల్లగొడుతున్న విషయం మనమందరం చూస్తున్నాం.

ఈయన ఇంకో అడుగు ముందుకేసి, అదే ATT మీద తన షాప్ కూడా ఓపెన్ చేసి, ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు!

ఇది కామెడీ కాదు. చెప్పింది చేసి చూపించగలడీయన. ఆ సత్తా ఉంది కాబట్టే "మా బాస్" అని ఆయన చెప్పుకొనే ఆర్జీవీతో సినిమాలు తీయగలుగుతున్నాడు. ఇప్పుడు తన 100 సినిమాల మైలురాయిని తాకబోతున్నాడు.

ఈ ఉత్సాహ శిఖరం పేరు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ ఈయన బ్యానర్.

కట్ చేస్తే - 

కొంతమందితో కలిసినా, మాట్లాడినా ఉత్సాహం వస్తుంది. కొంతమందితో ఏం రాకపోయినా ఫరవాలేదు కాని, ఎక్కడో అడుక్కివెళ్లిపోతాం.

మొన్న రాత్రి రామసత్యనారాయణ గారితో సుమారు ఒక 50 నిమిషాలు మాట్లాడాను. మాట్లాడినంతసేపూ అంతులేని ఉత్సాహం.

ఒకవైపు ఇండస్ట్రీలో అతిరథమహారథులనుకొనేవాళ్లంతా ఏం చెయ్యాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, తన బాస్ ఆర్జీవీతో పోటీపడుతూ, సినిమాలమీద సినిమాలు ప్లాన్ చేస్తూ, మంచి బిజీలో ఉన్నాడు రామసత్యనారాయణ.


"OTT/ATT మంచి మోకా... బాగా ఉపయోగించుకొందాం" అని నేను కూడా ఓ పక్క 'సీరీస్ ఆఫ్ సినిమాలు' ప్లాన్ చేస్తూ ఎంత ముందుకెళ్తున్నా, నా టీమ్‌లోని ముఖ్యులు కొందరు చేతకాని ముసలివాళ్లకన్నా అధ్వాన్నంగా ఇంచ్ కదలనివ్వట్లేదు, నన్ను ఇంకా వెనక్కిలాగుతున్నారు! అది వేరే విషయం...

కట్ బ్యాక్ టూ రామసత్యనారాయణ -  

ఆర్ట్ ఈజ్ ఆర్ట్. అందులో ఎవరి స్టయిల్ వారిది. ఎవరి శైలి వారిది. ఎవరి టాలెంట్ వారిది.  అంతవరకు ఓకే. కాని, కోట్లు పెట్టి సినిమా తీసేది కోట్లు సంపాదించడానికే తప్ప అదేదో "కళామతల్లి" సేవకోసం అనడం కంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. రామసత్యనారాయణ ఈ విషయంలో కుండలు కొట్టేసినట్తు చెప్తాడు.

సినిమా అయినా, యాడ్స్ అయినా, ఫ్రీలాన్స్ రైటింగ్ అయినా, ఇంకేదయినా... ముందు బ్రతకడానికే. సంపాదనకే. కళామతల్లి వంటి మాటలన్నీ జస్ట్ మైక్ ముందు మాట్లాడే మాటలు. 

2020 అయిపోయేవరకు థియేటర్స్ తెరిచే విషయం మర్చిపోవాల్సిందే. ఈలోపు పీవీఆర్ వంటి మల్టీప్లెక్స్‌లు తెరచినా అంత ప్రయోజనం ఉండదు. లాక్‌డౌన్ తర్వాత మళ్ళీ అంతా నార్మల్‌కు వచ్చ్చేవరకూ బడ్జెట్లు తగ్గించుకొని సినిమాలు చేసుకోవడం, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకోంటూ "Pay Per View" పధ్ధతిలో బిజినెస్ చేసుకోవడం తప్ప ఇప్పటికయితే వేరే దారి లేదు అంటాడు సత్యనారాయణ.

అలాగని ఎవ్వరూ నిరాశపడాల్సిన అవసరం లేదు. థియేటర్స్ మాత్రమే ఉండి శాటిలైట్ రైట్స్ లేనప్పుడు సినిమాలున్నాయి. శాటిలైట్ రైట్స్ వచ్చాక సినిమాలున్నాయి. శాటిలైట్ రైట్స్ పోయాక కూడా సినిమాలున్నాయి. ఇప్పుడు ఓటీటీ, ఏటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్న సమయంలో కూడా సినిమాలున్నాయి. రేపు కరోనా సమస్యను అధిగమించిన తర్వాత కుడా ఫీల్డులో ఇంకేవేవో కొత్త అడ్వాన్స్‌మెంట్స్ వస్తాయి. అప్పుడు కూడా సినిమాలుంటాయి, సినిమా బిజినెస్ ఉంటుంది. జాగ్రత్తగా మార్కెట్‌కు స్టడీచేసి, బిజినెస్ చేసుకోవడమే మన బాధ్యత అంటాడు సత్యనారాయణ.

సినిమా ఒక బిజినెస్‌గా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉన్న రామసత్యనారాయణ తనదైన స్పీడ్‌లో ఇంకో 100 సినిమాలు కూడా ఈజీగా నిర్మించగలడని నా నమ్మకం.

ఆర్జీవీతో ఐస్‌క్రీమ్, ఐస్‌క్రీమ్ 2 సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన రామసత్యనారాయణ, ప్రస్తుతం ఐస్‌క్రీమ్ 3, 4, 5, 6 ... సినిమాల సీరీస్ చేసే సన్నాహాల్లో కూడా ఉన్నాడు!

రామసత్యనారాయణ Really Rocks...