Thursday 28 May 2020

ఇండస్ట్రీ ఎప్పుడూ మంచిదే!

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా... నిజంగా ఇండస్ట్రీ ఎప్పుడూ మంచిదే.

సత్తా ఉన్నవాడికి అది ఎప్పుడూ స్వాగతం చెప్తుంది. కొంచెం ముందూ వెనకా అంతే.

చిన్నవో పెద్దవో... నాలాంటి కొంతమందిని వెతుక్కొంటూ అవకాశాలొస్తాయి. కాని, అసలు  చిక్కంతా ఆ తర్వాతే.

కట్ చేస్తే - 

ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్లు నాకు మంచి మిత్రులు. వారు నాకు పరిచయమైన 'డే వన్' నుంచి ఇప్పటివరకూ, వారిలో ప్రతి ఒక్కరిపట్ల నాకు అదే గౌరవం. వారు కూడా నన్ను అంతే అభిమానంగా చూస్తారు.

ప్రతి ప్రొఫెషన్‌లో, ప్రతి బిజినెస్‌లో కొన్ని ప్రాథమిక వ్యవహార సూత్రాలుంటాయి. ఏది మారినా అవి మారవు. కొత్తగా వచ్చే వ్యక్తులతో, సాంకేతిక అభివృధ్ధితో వీటికి సంబంధం లేదు. ఇవి మారవు గాక మారవు. సో, ఆయా వృత్తివ్యాపారాల్లోకి ఎంటరైనవాడు విధిగా ఆ బేసిక్స్ పాటించాల్సిందే.

సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఇక్కడ పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు విధిగా పాటించాల్సిందే...

రోమ్‌కు వెళ్ళినపుడు అక్కడ రోమన్‌లా ఉండాలి తప్ప నేను టిబెటన్‌లా ఉంటానంటే కుదరదు. ఇంకా మాస్‌గా చెప్పాలంటే - తాడిచెట్టుకిందకెళ్ళినప్పుడు అక్కడ కల్లే తాగాలి తప్ప నేను కాఫీ త్రాగుతా అంటే కుదరదు.

నీ ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకపోవచ్చు. నువ్వు గుడ్డిగా ఫాలో కావల్సిన ఆ ప్రాథమిక సూత్రాల్లో ఎలాంటి లాజిక్ నీకు కనిపించకపోవచ్చు. అయినా సరే, విధిగా నువ్వు ఆ సూత్రాల్నే ఫాలో అయితీరాలి.

వాటిని నువ్వు లైట్ తీసుకుంటే, ఇండస్ట్రీ నిన్ను యమ లైట్ తీసుకుంటుంది.

జస్ట్ అలా దూది పింజలా ఎగిరిపోతావ్...

మొగిలిరేకులు సీరియల్ లాగా, ఈ విషయాన్ని ఇండస్ట్రీలోని నా సీనియర్ మిత్రులు నాకు  1001 సార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పారు.   

కట్ చేస్తే - 

మన ఫెయిల్యూర్‌కి కారణం ఎప్పుడూ ఇండస్ట్రీ కాదు...

మన నిర్ణయాలు, మనం కావాలని ఎంచుకొన్న వ్యక్తులు. మనం వారి మాటల మీద పెట్టుకొన్న నమ్మకం, ఆ నమ్మకానికి వారిచ్చిన విలువ. చివరికి మనల్నే తప్పుబట్టి వేలెత్తిచూపగలిగే వారి వాక్చాతుర్యం, వారి అసలు టాలెంటు... అది ముందే ఏమాత్రం గుర్తించలేని మన అజ్ఞానం...

ఇది ఇండస్ట్రీ ప్రాథమికసూత్రాలను పాటించకుండా చేసిన తప్పు. కాబట్టి, అనుభవించక తప్పదు.

ఇండస్ట్రీ ప్రాథమిక సూత్రాల్ని పాటించినప్పుడు మనం ఎన్నుకొనే వ్యక్తులు పూర్తిగా వేరేగా ఉంటారు...

వీళ్లు పెద్దగా చదువుకోకపోవచ్చు. నాకు ఇంత తెలుసు, అంత తెలుసు అని కోతలు కొయ్యకపోవచ్చు. కాని, వీళ్లంతా ఇండస్ట్రీలో "ఒక్క ఛాన్స్" విలువ తెలిసినవాళ్లు. అది ఎంత కష్టమో అనుభవం ద్వారా తెలుసుకున్నవాళ్లు. ఛాన్స్ వచ్చినతర్వాత కూడా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి ఎంత కష్టపడాలో తెలిసినవాళ్ళు. అంతకు పదిరెట్ల కష్టం పడటానికి అనుక్షణం సిధ్ధంగా ఉండేవాళ్లు.

వీటన్నిటికితోడు... తమ నోటినుంచి వచ్చినమాటకు ఉండే విలువేంటో తెలిసినవాళ్ళు. ప్రాణంపోయినా సరే ఆ మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు.

మనం అతితెలివితో ఎన్నుకొన్న వ్యక్తులకు ఇండస్ట్రీ ద్వారా వచ్చే పేరు, గ్లామర్ వగైరా అన్నీ కావాలి. కష్టం మాత్రం వద్దు. మాటకు కట్టుబడటం వద్దు.

అయితే ఇలాంటి వ్యక్తులవల్ల నష్టపోయేది వారొక్కరేకాదు. మనం, మన మీద ఆధారపడిన ఇంకెందరివో జీవితాలు. ఇది వీరికి అర్థం కాదు, అర్థం చేసుకొనే స్థాయి కూడా కాదు. బట్... అప్పటికే మన చేతులు కాలిపోయుంటాయి.

ఇండస్ట్రీ ప్రాథమిక సూత్రాలను పాటించినప్పుడు ఇలాంటి తప్పులు జరగవు. ఇలాంటి నిర్ణయాలను మనం తీసుకోము. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోము. ఇంత సమయం వృధా కాదు. ఇంత క్షోభ అనుభవించము.

సో, తప్పు ఎప్పుడూ అవతలివారిది కాదు. మనది. మనం తీసుకొన్న నిర్ణయాలది.

అందుకే "పెద్దలమాట సద్దిమూట" అన్నారు. సీనియర్స్ వారి అనుభవంతో ఏదైనా చెప్పినప్పుడు బాగా ఆలోచించాలి. లాజిక్స్ ఒక్కటే కాదు, రియాలిటీ కూడా చూడాలి.
^^^^^

(ఇవ్వాళ ఫేస్‌బుక్‌లో  సీనియర్ హిట్ డైరెక్టర్ వి ఎన్ ఆదిత్య గారు అత్యంత బాధతో పెట్టిన ఒక పోస్టు చూశాక వెంటనే ఇది రాయాలనిపించింది.)