Wednesday 20 May 2020

థియేటర్స్, హౌజ్‌ఫుల్స్ ఇంక ఒడిశిన కథేనా?

100% అంతే...

ఇది నేను చెప్తున్న జోస్యం కాదు...

ప్రపంచవ్యాప్తంగా, గత కొన్నేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులను అలా తొక్కిపెడుతూ వచ్చారు. లేదా హిపోక్రసీకి పెద్దగా పట్టించుకోనట్టు నటించారు.

అంతకు ముందు కూడా అంతే...

"ఫిల్మ్ మేకింగ్‌లో 'ఫిలిం' పని అయిపోయింది... ఇక ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీదే కాలం" అంటే ఎవ్వరూ వినలేదు. పట్టించుకోలేదు.

డిజిటల్ కెమెరాలతో షూట్ చేసేవాళ్లను ఎగతాళి చేశారు. డిజిటల్ కెమెరాలతో షూట్ చేసిన సినిమాలకు అసలు శాటిలైట్ రైట్స్ ఇవ్వొద్దు అన్నారు. థియేటర్స్‌లో ప్రదర్శనకు పనికిరావన్నారు.

అలాంటి మహామహోపాధ్యాయులంతా ఇప్పుడు తోకముడుచుకొని వారి సోకాల్డ్ భారీ సినిమాలను రెడ్, అలెక్సా ఎక్స్‌టీ వంటి డిజిటల్ కెమెరాల్లోనే షూట్ చేస్తున్నారు!

కట్ చేస్తే -

దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలు, ఏ యూనియన్ లీడర్స్ పరిష్కరించలేకపోయిన థియేటర్స్ సమస్యను ఇప్పుడు కరోనావైరస్ చాలా సింపుల్‌గా తీర్చేసింది.

చిన్న సినిమాలకోసం 'అయిదో షో' జీవో వస్తోందని నా చిన్నప్పటినుంచి వింటున్నాను...

అది రాదు, రానీయరు. ఇప్పుడు ఆ జీవో వచ్చినా కూడా ఎవడూ దాని మొహం చూడడు.

చిన్న సినిమాల నిర్మాత "మాకు రెంటు కట్టినా థియేటర్స్ ఇవ్వట్లేదు" అని ఎక్కడా మొత్తుకోడు.

మాకు క్యాంటీన్ మెయింటెనెన్స్, కరెంట్ బిల్లు ఖర్చులు కూడా రావు అని చిన్న సినిమాలను ఎగతాళిచేసిన థియేటర్స్ అతి త్వరలో వాటి షేపులు మార్చుకొని... ఏ గోడౌన్సో, ఫంక్షన్ హాల్స్‌గానో మారిపోయేరోజులు చాలా దగ్గరలో ఉన్నాయి.

టెక్నాలజికల్ డెవలప్‌మెంట్‌ను ఎవ్వరూ ఎక్కువకాలం తొక్కిపెట్టలేరు, ఆపలేరు... అని మరోసారి రుజువయ్యింది.

ఇకనుంచీ భారీ సినిమానా, చిన్న సినిమానా అన్నది పాయింట్ కాదు. థియేటర్స్‌లో, మల్టీప్లెక్సుల్లో రిలీజయ్యిందా లేదా అన్నది కూడా పాయింట్ కాదు.

ఓటీటీలో రిలీజ్ అయ్యిందా లేదా అన్నదే మెయిన్ పాయింట్ కాబోతోంది... చేతిలో ఉండే మొబైల్ యాప్‌లో రిలీజయ్యిందా లేదా అన్నదే మెయిన్ పాయింట్ కాబోతోంది... 

కరోనా తర్వాత... మనిషి జీవనశైలిలో ఊహకందని మార్పులు ఎన్నో అత్యంత వేగంగా జరగబోతున్నాయి. మనిషి ఆలోచనావిధానమే పూర్తిగా మారబోతోంది.

కంటెంట్ బాగుంటే చాలు. ఓటీటీలకు, యాప్‌లకు కొరతలేదు. సినిమాల రిలీజ్ అనేది ఇకమీదట అసలు సమస్యే కాదు.

సో, కంగ్రాట్స్ టూ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్‌మేకర్స్!... కంటెంట్ మీద ఫోకస్ చెయ్యండి. మీ ఓపిక... ఎన్ని సినిమాలైనా తీయొచ్చు. ఎన్నైనా రిలీజ్ చేసుకోవచ్చు.

ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ సినిమానే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆర్జీవీ "క్లైమాక్స్" యాప్‌లో రిలీజ్ కాబోతోంది. ఇంక వర్రీ ఎందుకు?