Saturday 9 May 2020

పాలపిట్ట 2020 లిటరరీ అవార్డులు... ఎప్పుడు? ఎక్కడ?


ఉస్మానియా యూనివర్సిటీ ఐకానిక్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్...

1986 జనవరిలో ఒక సోమవారం, ఉదయం 8:00.

ఆర్ట్స్ కాలేజ్ బయట, ముఖ ద్వారం పక్కనే, గోడకు ఆనించి పెట్టిన నిలువెత్తు బ్లాక్ బోర్డు పైన ఒక ఎమ్మే కుర్రాడు కలర్ చాక్‌పీస్‌లతో  ఏదో రాస్తున్నాడు. ఇంకో  ఎమ్మే కుర్రాడు పక్కనే నిలబడి డిక్టేట్ చేస్తూ రాయిస్తున్నాడు.

అది "ఓయూ రైటర్ సర్కిల్" బ్లాక్ బోర్డ్ మ్యాగజైన్. దానిమీద రాస్తున్నది "ఈ వారం కవిత".

చేతిలో ఉన్న నోట్‌బుక్‌లోకి చూసి చెబుతూ ఆ కవిత డిక్టేట్ చేస్తున్నదీ... "నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నువ్వు రాయి" అని ఉబ్బించి, యువర్స్ ట్రూలీ మనోహర్ చిమ్మనితో ఆ బ్లాక్‌బోర్డ్ పైన రాయిస్తున్నదీ మరెవరో కాదు... గుడిపాటి వెంకట్.

ఓయూలో మా మిత్రబృందమంతా అతన్ని "గుడిపాటి" అని పిల్చేవాళ్లం. అదే అలవాటయిపోయింది అందరికీ.

మూడు దశాబ్దాలు దాటిన స్నేహం మాది. ఓయూలో ఎమ్మే చదివినప్పుడు ఇద్దరం 'ఏ' హాస్టల్లో ఉండేవాళ్లం. నాది రూం నంబర్ 55, గుడిపాటిది రూం నంబర్ 24. 

ప్రముఖ జర్నలిస్టు, శాసనమండలి సభ్యుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అప్పుడు అదే రూం నంబర్ 24 లో ఉండేవాడు.

ఓయూ రైటర్స్ సర్కిల్ అప్పటిదాకా మా సీనియర్, ప్రస్తుతం "ఆసియానెట్ న్యూస్" ఎడిటర్, కాసుల ప్రతాప్‌రెడ్డి సారధ్యంలో ఉండేది. ప్రొఫెసర్ చేకూరి రామారావు గారు గౌరవ సలహాదారుగా ఉండేవారు.

గుడిపాటి సారథ్యం తీసుకున్నాక, ఓయూ రైటర్స్ సర్కిల్ ఆధ్వర్యంలో చాలా సాహితీ కార్యక్రమాలు నిర్వహించేవాడు. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, నా క్లాస్‌మేట్ రామ్‌దాస్, నేను కూడా రైటర్స్ సర్కిల్లో అప్పుడు యాక్టివ్ మెంబర్స్‌గా ఉండేవాళ్లం. 

కట్ చేస్తే - 

ఓయూ ఆర్ట్స్ కాలెజ్‌లో "రూం నంబర్ 57" ఒక అద్భుత జ్ఞాపకం. అదొక మీటింగ్ హాల్. 1918 లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభమైనప్పటినుంచి, నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు... ఆ మీటింగ్ హాల్లో జరిగిన చారిత్రక సమావేశాలెన్నో!

పీవీ నరసింహారావు నుంచి, కాలోజీ, సినారే, శ్యామ్ బెనెగల్, కేసీఆర్ వంటి ఎందరో ప్రముఖ వ్యక్తులు,  పార్లమెంటేరియన్లు, లెజిస్లేచర్లు, మంత్రులు, సైంటిస్టులు, డాక్టర్లు, కవులు, రచయితలు, ఫిల్మ్ డైరెక్టర్లు, పొలిటీషియన్లు, స్పోర్ట్స్‌మెన్... ఇంకెందరో ఓయూ విద్యార్థులు ఆ హాల్లో ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నవాళ్లే... తిరగాడినవాళ్లే.

1986 లోనే అనుకుంటాను... సాల్మన్ రష్దీ రచించిన "సాతానిక్ వర్సెస్" నవలను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ అంశం మీద కూడా రూం నంబర్ 57 లో, ఓయూ రైటర్ సర్కిల్ తరపున గుడిపాటి నిర్వహించిన సభ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఆ మర్నాడు అన్ని దినపత్రికల మొదటిపేజీలు ఆ వార్తను బాగా కవర్ చేయటం నాకింకా గుర్తు. 

కట్ బ్యాక్ టూ మ్యాగజైన్ - 

సూర్యాపేటలో చదువుకునేరోజుల్లో "చైతన్యవాణి", "ప్రజావాణి" లిఖితపత్రికల నిర్వహణ, డిగ్రీలో ఉండగా "స్రవంతి" సైక్లోస్టైల్డ్ పత్రిక, ఓయూలో పీజీ తర్వాత "ఉజ్వల" అనే మినీ మ్యాగజైన్ నిర్వహణలో కీలక భాగస్వామి గుడిపాటి. అప్పట్లో గుడిపాటి ప్రచురించిన ఉజ్వల బులెటిన్లో నేను తెలుగులోకి అనువదించిన ఒక రష్యన్ కథానిక అచ్చయింది నాకింకా జ్ఞాపకం.   


ఈ నేపథ్యంతోపాటు... ఓయూ ఆర్ట్స్‌కాలేజ్ ముందు, అప్పట్లో రైటర్స్ సర్కిల్ బ్లాక్‌బోర్డ్ మ్యాగజైన్‌తో 1986 నుంచీ గుడిపాటిలో కొనసాగిన ఆ వ్యామోహం, 2010 ఫిబ్రవరిలో ఒక పూర్తిస్థాయి సాహితీ మాసపత్రిక వెలువరించేదాకా చల్లారలేదు.

ఆ పత్రిక పేరు "పాలపిట్ట".

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచి నిరాఘాటంగా ప్రచురితమవుతున్న ఏకైక సాహితీ మాసపత్రిక.

సూర్యాపేటలో పుట్టి, అక్కడే డిగ్రీ వరకు చదుకొన్న గుడిపాటి... ఓయూలో ఎమ్మే పొలిటికల్ సైన్స్‌తోపాటు బిసిజె, బి ఎడ్ కూడా చదివాడు. ఎమ్మేలో స్వామి రామానంద తీర్థ గోల్డ్ మెడల్ సాధించాడు.

గుడిపాటికి వృత్తిపరంగా రెండేరెండు ఇష్టాలుండేవి. అయితే లెక్చరర్‌గా పనిచేయాలని, లేదంటే జర్నలిస్టు కావాలని.

లెక్చరర్‌గా అప్పట్లో కొన్నాళ్లు ఏదో కోపరేటివ్ కాలెజీలో పనిచేశాడు గుడిపాటి. నచ్చలేదు. తన ఇష్టం, తన మార్గం, తన గమ్యం అది కాదని అర్థమైంది. లెక్చరర్ ఉద్యోగం వదిలేశాడు. 

కట్ చేస్తే - 

యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే "ఆంధ్రజ్యోతి" హైద్రాబాద్ ఎడిషన్‌కు స్ట్రింగర్‌గా పనిచేసేవాడు గుడిపాటి. అప్పుడు ఏబీకే ప్రసాద్ హైద్రాబాద్ ఎడిషన్‌కు ఇంచార్జిగా ఉన్నారు. తర్వాత కొంతకాలం "సాయంకాలం" పత్రికకు పనిచేశాడు. "నలుపు" పక్షపత్రిక ప్రారంభ సంచికలకు కూడా పనిచేశాడు. తర్వాత "వార్త"లో చేరాడు. ఇక ఆతర్వాతంతా చరిత్రే. ఇప్పుడున్న జర్నలిజం, లిటరరీ సర్కిల్స్‌లో చాలామందికి తెలిసిందే.


బయట రిపోర్టింగ్‌కు అవకాశం ఉన్నా, సాహిత్యం పట్ల తనకున్న ఇష్టంతో వివిధ డెస్క్‌ల్లో సబ్ ఎడిటర్‌గానే పనిచేయడానికి ఇష్టపడ్డాడు గుడిపాటి.

వార్తలో కొన్నాళ్ళు "బుక్ రివ్యూ" పేజీని చూసేవాడు గుడిపాటి. తర్వాత వార్త ఇంటర్నెట్ ఎడిషన్లో కూడా ముఖ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇలా వివిధ విభాగాల్లో పనిచేసినప్పటికీ, "వార్త ఆదివారం" ఎడిటర్‌గానే ఎక్కువకాలం పనిచేశాడు గుడిపాటి.

వార్త ఆదివారం మ్యాగజైన్‌లో గుడిపాటి ప్రవేశపెట్టిన కొత్త అంశాలన్నీ, తర్వాత ఈనాడుతో సహా మిగిలిన దినపత్రికలన్నీ అనుసరించక తప్పలేదు. అంతకుముందువరకూ ఈనాడు ఆదివారం పుస్తకంలో ఇంగ్లిష్ పత్రికల కంటెంట్ అనువాదమే ఎక్కువగా ఉండేది. ఈనాడును అప్పటినుంచీ చదువుతున్నవారికి ఈ విషయం బాగా గుర్తుంటుంది. 

కట్ టూ అడవిలో అన్నతో -

వార్త ఆదివారం ఎడిషన్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడే... 1999 లో, ఒకరోజు ఆ పత్రిక ఎడిటర్ గిరీష్ సంఘీ గుడిపాటిని పిలిచి ఓ రిపోర్టింగ్ అసైన్‌మెంటును అప్పగించాడు.

అది పూర్తిగా గుడిపాటి చేస్తున్న పనితో సంబధంలేని రిపోర్టింగ్ పని. చాలా రిస్క్‌తో కూడుకొన్న బాధ్యతకూడా.

ఎక్కడో నల్లమల అడవుల్లోకి వెళ్లి, పీపుల్స్ వార్ సెక్రటరీ సంతోష్ రెడ్ది ఇంటర్వ్యూ తీసుకొనివచ్చే అసైన్‌మెంట్ అది!


"నా లెఫ్టిస్టు భావజాలపు నేపథ్యం సంఘీకి తెలుసు. అందుకే నాకా పని అప్పగించి ఉంటాడు" అని నాతో అప్పట్లో చెప్పాడు గుడిపాటి. అప్పుడు నేను ఆలిండియా రేడియో, కర్నూల్లో పనిచేస్తున్నాను. కాని, నాకు తెలిసి, వార్త రిపోర్టర్‌లలో కనీసం ఒక 60% మంది అదే లెఫ్టిస్ట్ భావజాలం నేపథ్యంతో ఉన్నవాళ్లున్నారు. కాని, గిరీష్ సంఘీ గుడిపాటినే పిలిచి ఈ అసైన్‌మెంట్ అప్పగించాడంటే కారణం గుడిపాటిలోని నిబధ్ధతే అని నా ఉద్దేశ్యం.

యూనివర్సిటీరోజుల నుంచి, ఇప్పటివరకూ గుడిపాటిలో నేను చూస్తున్నది అదే. తను చేస్తున్న పనిపట్ల సిన్సియారిటీ, సీరియస్‌నెస్, అంకితభావం... ఇవన్నీ గుడిపాటిలో ఏ కొంచెం కూడా తగ్గలేదు. 

కట్ చేస్తే - 

వార్త ఆదివారం మ్యాగజైన్ ఎడిటర్‌షిప్ ఇచ్చిన కిక్ నుంచి బయటపడి, తన డ్రీమ్ మ్యాగజైన్‌ను వెలువరించడానికి గుడిపాటికి సుమారు దశాబ్దం పట్టింది.

2010 ఫిబ్రవరిలో, ఒక పూర్తిస్థాయి తెలుగు సాహిత్య మాసపత్రికగా "పాలపిట్ట"ను స్వీయ సంపాదకత్వంలో ప్రారంభించాడు గుడిపాటి.


ఏకవ్యక్తి సైన్యంగా, అన్నీ తానే అయి, గత పదేళ్లుగా ఈ పత్రికను వెలువరిస్తున్న గుడిపాటి కృషి నిజంగా అభినందనీయం. 

మధ్యలో కొన్ని సంచికలు మిస్ అయినా, తర్వాత వెంటనే నిలదొక్కుకొని, క్రమం తప్పకుండా పాలపిట్ట మాసపత్రికను పబ్లిష్ చేస్తున్నాడు గుడిపాటి. అప్పట్లో "రచన", "ఆహ్వానం" వంటి సాహిత్య పత్రికలు కొన్నాళ్లు వచ్చి కనుమరుగైపోయినా, గుడిపాటి పాలపిట్ట మాత్రం నిరాఘాటంగా వస్తూనే ఉంది. ఒక మ్యాగజన్‌ను క్రమం తప్పకుండా నడపడం ఎంత కష్టతరమైన పనో మనకు తెలియంది కాదు.

బాలమురళీకృష్ణ, సామల సదాశివ, గోరటి వెంకన్న, ఓల్గా వంటి ఎందరో ప్రముఖులమీద పాలపిట్ట ప్రత్యేక సంచికలు వచ్చాయి. తెలుగు సాహిత్యం మీద, కాళోజీమీద, తెలంగాణ సాహిత్యం మీద కూడా పాలపిట్ట విశేష సంచికలు వచ్చాయి.

"పాలపిట్ట బుక్స్" పేరుతో ఇప్పటివరకు సుమారు 250 పుస్తకాలను కూడా ఎడిట్ చేసి ప్రచురించాడు గుడిపాటి. వీటిలో సుమారు 70 కవితా సంకలనాలు!

ఒక రచయితగా, విమర్శకుడిగా గుడిపాటి ఇప్పటివరకు 12 పుస్తకాలను రాసి ప్రచురించాడు. వీటిలో 2 బయోగ్రఫీలున్నాయి.

ఏదో న్యూస్‌ప్రింట్‌తో అచ్చేసి, పత్రిక తీశామా అంటే తీశాం అన్నట్టు కాకుండా... పాలపిట్ట తొలి సంచిక నుంచి ఇప్పటి తాజా సంచిక వరకూ... మంచి క్వాలిటీ పేపర్‌తో, ప్రామాణికమైన కవర్‌పేజీతో ఈ మాసపత్రికను వెలువరిస్తుండటం అంత మామూలు విషయం కాదు.

రెండు తెలుగురాష్ట్రాల్లో కలిపి, ఇప్పుడు తెలుగులో వస్తున్న ఏకైక సాహిత్య మాసపత్రిక పాలపిట్ట ఒక్కటే.


చదివే అలవాటు క్రమంగా తగ్గిపోతున్న ఈరోజుల్లో... తనలోని సాహితీ పిపాసే పెట్టుబడిగా, గత దశాబ్దంగా పాలపిట్ట మాసపత్రికను ప్రచురిస్తూ సాహితీ వ్యవసాయం చేస్తున్న గుడిపాటి వంటి వారికి సాహిత్యాభిమానుల చేయూత ఉంటే ఈ దిశలో తను ఇంకెంతో సాధిస్తాడనడంలో సందేహం లేదు.

ఇన్ని సాధించినా, తనగురించి ఏమాత్రం చెప్పుకోడానికి ఇష్టపడని గుడిపాటి త్వరలోనే మరొక సంచలనానికి తెరతీయబోతున్నాడు.

అది... పాలపిట్ట లిటరరీ అవార్డ్స్.

అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రామాణికంగా గుడిపాటి ప్రారంభించబోతున్న ఈ వార్షిక సాహిత్య అవార్డులు ఆధునిక తెలుగు సాహితీరంగంలో ఒక కొత్త వరవడికి నాందిపలుకుతాయనుకోవచ్చు.
^^^^^

(పాలపిట్ట మాసపత్రిక, పాలపిట్ట బుక్స్ కోసం: Palapitta Books, Block-6, MIG-2, APHB, Baghlingampally, Opp. Sundaraiah Park Gate Lane, Hyderabad - 500044. Phone: 040-27678430. email: palapittabooks@gmail.com, WhatsApp: +91 9490099327)