Wednesday 22 April 2020

The Show Must Go On...

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు!

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట ...

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది.

వాళ్లకి తెలీదు... ఫీల్డులో హైస్కూల్ డ్రాపవుట్స్ నుంచి, ఎమ్ బి ఏ లు, యూనివర్సిటీ డబుల్ గోల్డ్ మెడలిస్టులు, న్యూక్లియర్ ఫిజిక్స్ పీజీలు, ఐ ఐ ఎమ్ నేపథ్యాన్ని అలవోగ్గా అలా వదిలేసినవాళ్ల దాకా ఎందరో ఉన్నారని! 

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.

దేన్నయినా సరే జనరలైజ్ చేసి మాట్లాడే ఇలాంటివాళ్లంతా తెలుసుకోవాల్సిన ఒక నిజం ఎన్నటికీ తెల్సుకోలేరు.

'మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్'... అనేది కామన్‌సెన్స్.

అన్ని ఫీల్డుల్లో మంచీ చెడు ఉంటుంది. ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి, ఇక్కడ దగ్గినా తుమ్మినా బ్రేకింగ్ న్యూసే.

సినిమా న్యూస్‌లు, సినిమావాళ్ళమీద టిడ్‌బిట్స్, సినిమా బేస్‌డ్ ప్రోగ్రామ్స్, సినిమావాళ్ల ఫోటోలు, బైట్స్ లేకుండా ఏ పత్రికా, ఏ చానెల్ బ్రతకలేదు. సగటు మనిషి జీవితంలో కూడా సినిమా ఒక అంతర్భాగం. 

కట్ చేస్తే - 

కరోనా లాకౌట్ కారణంగా... సినిమాల షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్లు అన్నీ ఇప్పుడు ఎక్కడికక్కడ స్థంభించిపోయాయి.

ఇప్పుడున్న పరిస్థితి కొద్దిగా తగ్గుముఖం పడితే, జులై నుంచి మళ్ళీ షూటింగ్స్ ప్రారంభం కావచ్చు అంటున్నారు. సినిమా థియేటర్స్ మాత్రం డిసెంబర్ దాకా తెర్చుకోనే అవకాశాలు ఏమాత్రం కనిపించటం లేదు.

ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వచ్చిన ఇలాంటి పరిస్థితివల్ల, జాతీయ స్థాయిలో, ఇప్పటివరకు సుమారు  3 వేల కోట్ల రూపాయలవరకూ నష్టం వచ్చినట్టు విశ్లేషకుల అంచనా.

హోమ్‌స్టే కారణంగా అన్నీ ఆగిపోయాయి నిజమే. కానీ, లోపల్లోపల కదిలే పనులు వీలయినన్ని కదుల్తూనే ఉన్నాయి.

రాజమౌళి తన తర్వాతి సినిమా మహేశ్‌తోనే అని చెప్పేశాడు. పూరి జగన్నాథ్ ముంబైలో స్క్రిప్టులు రాసుకుంటున్నాడు. కొంతమంది నిర్మాత-దర్శకులు తమ తర్వాతి సినిమాల కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నారు.

హీరోయిన్స్ ఇళ్ళల్లో వంటలు చేస్తున్నారు. హీరోలు చీపురు పట్టి ఇళ్ళు ఊడుస్తున్నారు. చాలామంది హాయిగా పగలూరాత్రీ తెలియకుండా నిద్రపోతున్నారు. లేచినప్పుడు ఒక ట్వీటో, ఇన్స్‌టాగ్రామ్‌లో ఒక ఫోటోనో పెడుతున్నారు.   

కరోనా కారణంగా తమ సినిమాల రిలీజ్ ఆగిపోయిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల టెన్షన్ కంటిన్యూ అవుతోంది.

అన్నీ సెట్ చేసుకొని, ఈ నెల్లో షూటింగ్ ఓపెనింగ్ పెట్టుకొన్న ఎందరో చిన్నా చితకా ఆర్టిస్టులు-డైరెక్టర్ల సినిమాల్లో ఎన్ని ఉంటాయో, ఎన్ని ఎగిరిపోతాయో తెలియటంలేదు.

మరోవైపు, చాలామంది సినీ కార్మికులు, టెక్నీషియన్స్ వారి దినవారీ బేటాల్లేక అల్లాడిపోతున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తులు, సంస్థలు తమకు చేతనైన సహాయం చేస్తూనే ఉన్నారు.

ఇదంతా ఇప్పుడు ఇలా ఉన్నప్పటికీ... రేపు జులై నుంచి మళ్లీ షూటింగ్స్ ప్రారంభమైతే చాలు. అంతా మామూలైపోతుంది.

The Show Must Go On... 

బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో చెప్పొచ్చు. అది మామూలే.

వీటన్నింటినీ మించిన వాస్తవం ఏంటంటే... సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.

గ్లామర్, ఫేమ్ అనేవి సినిమాలో  'బై డిఫాల్ట్' ఉంటాయి. కాని, సినిమా అల్టిమేట్ టార్గెట్ మాత్రం...  ఇప్పుడు డబ్బే.