Tuesday 10 March 2020

Live Life to the Fullest

Concentrate all your thoughts upon the work at hand. The sun’s rays do not burn until brought to a focus.
    
           
ముందు పని. తర్వాతే ఏదైనా...

నేను చేయాల్సిన సినిమాలు, వెబ్ సీరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు, పబ్లిష్ చెయ్యాల్సిన పుస్తకాలు, పూర్తిచేయాల్సిన ఇతర పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి.

సో మచ్ టు డు, సో లిటిల్ టైమ్...

ఒక యాక్సిడెంట్‌లో అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం ఆపరేట్ అయిన నా ఎడమకాలుకు, ఇన్నేళ్లతర్వాత మళ్లీ ఓ చిన్న సమస్య వచ్చింది.

అది కూడా అనుకోకుండా జరిగిన నా నిర్లక్ష్యం వల్లనే...

కాలు లోపలున్న ఇంప్లాంట్స్ ఎప్పుడో తీయించాల్సింది. ఆ పని చేయలేదు.

"తీయించకపోయినా పర్లేదు" అని కూడా చెప్పిన డాక్టర్స్ మాటకే విలువిచ్చానని నన్ను నేను సమర్థించుకొన్నా, చాలావరకు అది నిజం కాదు.

కోరితెచ్చుకొన్న కొన్ని వ్యక్తిగత సమస్యలు, వృత్తిపరమైన తలనొప్పులు, ఊహించని ఆలస్యాలు... అన్నీ... నేనీ అతిముఖ్యమైన విషయంపట్ల నిర్లక్ష్యం వహించడానికి కారణమయ్యాయి.

"చిన్న సర్జరీనే కదా... ఇంక అయిపోవచ్చింది... ఒక వారంలో ఫ్రీ అవుతాను... అప్పుడు వెంటనే సర్జరీ చేయించుకొంటాను"... అనుకొంటూ, అనుకొంటూ... చూస్తుండగానే నెలలు గడిచాయి.

ఇప్పుడిక పరిస్థితి తప్పనిసరి అయి కూర్చుంది.

ఉపయోగించినా, ఉపయోగించకపోయినా... 'ఎల్బో స్ట్రెచ్' అనబడే ఒక సపోర్టింగ్ స్టిక్ ఇప్పుడు నాచేతిలో తప్పనిసరి. రోడ్డు దాటాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా పక్కన ఒకరు తప్పనిసరిగా ఉండటం అవసరం.

సర్జరీకి ఈ నెలాఖరుకు ముహూర్తం పెట్టుకున్నాను. అప్పటివరకు కూడా రెస్ట్ తీసుకొనే అవకాశంలేదు. తీసుకోవల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొంటూనే పనిచేస్తున్నాను. జర్నీలు కూడా చేస్తున్నాను.

కట్ చేస్తే -

ఈ బ్లాగ్‌లో ఇదే చివరి పోస్ట్.

సుమారు 8 సంవత్సరాల సహచర్యం తర్వాత, నాకెంతో ప్రియమైన నా బ్లాగ్ "నగ్నచిత్రం"కు
ఈరోజు గుడ్‌బై చెప్తున్నాను.

దస్విదానియా. సయొనారా. గుడ్‌బై. సెలవు. 

"మైండ్ చేంజెస్ లైక్ వెదర్" అన్నారు.

ఇంతకుముందు కూడా రెండు మూడుసార్లు ఇలా గుడ్‌బై చెప్పాలని చాలా గట్టిగా అనుకొన్నాను. కానీ, అంత ఈజీగా ఆ పని చేయలేకపోయాను.

కొన్ని అలవాట్లు అంత ఈజీగా వదలవు.

కానీ, ఇప్పుడు మాత్రం ఊరికే అనుకోవడం కాదు. నిజంగా ఈ విషయంలో నిర్ణయం తీసేసుకున్నాను.

ప్రాధాన్యాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటికి నా బ్లాగ్ కూడా ఉపయోగపడొచ్చు. కానీ, ఆ పని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌ల ద్వారా కూడా నేను చేయగలను.

కట్ టూ 'సెలెక్టివ్ మెమొరీ' -

ఈ బ్లాగ్‌లోని కొన్ని ఎన్నికచేసిన బ్లాగ్ పోస్టులతో "నగ్నచిత్రం" పేరుతో తీరిగ్గా, ఒక ఏడాది తర్వాత ఒక పుస్తకం తప్పక పబ్లిష్ చేస్తాను.

అది నా జ్ఞాపకం కోసం.

నగ్నచిత్రం పుస్తకం పీడీఎఫ్ ఫ్రీగా ఆన్‌లైన్‌లో పెడతాను. నా ప్రియమైన బ్లాగ్ రీడర్స్ కావాలనుకొంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.

ఇప్పటికే, ఈ బ్లాగ్‌లో రాసిన కొన్ని పోస్టులు, దినపత్రికల్లో వచ్చిన మరికొన్ని నా ఆర్టికిల్స్ కలెక్షన్‌తో కలిపి, కేసీఆర్ గారి మీద ఒక పుస్తకం అతి త్వరలో పబ్లిష్ చేస్తున్నాను.

కొంత గ్యాప్ తర్వాత, నేను ఎప్పటినుంచో అనుకొంటున్న ఒక కొత్త బ్లాగ్‌తో మళ్లీ నా బ్లాగింగ్ జర్నీ ప్రారంభిస్తాను. కానీ, దానికి ఇంకా చాలా టైమ్ ఉంది.

ఈలోపు నేను చేయాల్సిన సినిమాలు, వెబ్ సీరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు, పబ్లిష్ చెయ్యాల్సిన పుస్తకాలు, పూర్తిచేయాల్సిన ఇతర పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి.

సో మచ్ టు డు, సో లిటిల్ టైమ్... 

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. :)