Saturday 7 March 2020

అన్ని కరోనాలు వైరస్‌లు కావు!

ఉదాహరణకు ఈ ఫోటోలోని అమ్మాయి...

లోపల్లోపల ఎంత భయంగా ఉన్నా... 'కరోనా' మీద లెక్కలేనన్ని కార్టూన్లు, మీమ్‌లు, టిడ్‌బిట్స్, ఎట్సెట్రా బోల్డన్ని వస్తున్నాయి.

సోషల్‌మీడియాలో క్రియేటివిటీ గురించి చెప్పేదేముంది?

ఈ ఫోటో కూడా అలాంటి క్రియేటివిటీలోంచి పుట్టిందే. ఆ అమ్మాయి షర్టుకున్న నేమ్ బ్య్యాడ్జ్ మీద 'కరోనా' అని ఉంది! 

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా పుణ్యమాని మన సంస్కృతికి మళ్ళీ ఒక ఊపు వచ్చిందనిపిస్తోంది...

ఇప్పుడు ఎక్కడకెళ్లినా, ఎవరెదురైనా.. రెండుచేతులు జోడించి చక్కగా "నమస్కారం" పెడుతున్నారు. పెద్దా చిన్నా అంతా.

ఇది చేయలేనివాళ్ళు మామూలుగా "హాయ్" అంటూ చేయి ఊపుతున్నారనుకోండి. అది వేరే విషయం.

పలకరింపు విషయంలో మన "నమస్కారం" అన్నిరకాలుగా ఒక మంచి పధ్ధతి.

నా ఉద్దేశ్యంలో షేక్ హాండ్ అంత పరమ చెత్త అలవాటు ఇంకోటిలేదు...

పొద్దునలేస్తే కనీసం ఒక వందమందికి షేక్‌హాండిస్తూ పలకరిస్తాం. వారిలో ఎంతమంది చేతులు ఎంత పరిశుభ్రమైనవో ఎవ్వరైనా చెప్పగలరా?

ఎంతమంది జస్ట్ అప్పుడే ముక్కులో, మూతిలో, చెవిలో వేళ్ళు పెట్టుకొని ఉంటారు? ఎంతమంది ఎక్కడెక్కడో గోక్కొని ఉంటారు? ఎంతమంది అప్పుడే వాష్‌రూమ్‌కు వెళ్లి 'పాటపాడి' వచ్చుంటారు... చేతులు కడుక్కోకుండా...?!

నా అంచనా ప్రకారం ఒక 5% మంది మాత్రమే పై విషయాల్లో చాలా శుభ్రత పాటిస్తారు. మిగిలిన 95% మంది విషయంలో... షేక్ హాండిచ్చినవాళ్ళ ఖర్మ అనుకోవడం తప్ప మనం చేసేదేంలేదు.

అలాగని మనం రోజూ షేక్‌హాండిచ్చే వందమందిలో ఆ 5% మిస్టర్ నీట్స్, 95% డర్టీ డ్రాగన్స్  ఎవరన్నది ఎమ్మారై తీసినా ఎవరూ అంత ఈజీగా కనుక్కోలేరు.

ఈ టెన్షన్ కంటే సింపుల్‌గా ఒక "నమస్కారం" బెటర్...