Tuesday 26 February 2019

వొక నమ్మకం

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది .. మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు!

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా.

ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్.

అయినా సరే - ఈ ప్రపంచం "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీదే ఎక్కువగా నడుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను.

అయితే, చాలాసార్లు నేను వేగంగా గోడకు విసిరికొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కి తిరిగిరాలేదు. ఆశ్చర్యంగా ఆ గోడకి బొక్కచేస్తూ బంతి బయటికి వెళ్లిపోయింది. లేదా, అక్కడే ఆ గోడకి జారుకుంటూ కింద కూలబడింది.

దీన్ని ఏ లాజిక్ ఒప్పుకుంటుంది?

ఎవరు నమ్ముతారు?

ఏ లాజిక్ ప్రకారం ఆలోచించినా, ఏ కోణంలో చూసినా - నా అనుభవంలో చాలాసార్లు జరగాల్సినవి జరగలేదు. జరక్కూడనివి జరిగాయి. 

సో, లాజిక్కులు పనిచేయని సందర్భాలు మనిషి జీవితంలో చాలా వస్తాయి. అలాంటప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే. మనకు కన్వీనియెంట్‌గా అనిపించిన ఏదో ఒక "శక్తి" మీద మన భారం అంతా వేసి ముందుకు వెళ్లడం.  

విచిత్రంగా అప్పుడంతా బాగానే ఉంటుంది.

అదే నమ్మకం. 

1 comment:

  1. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ (“మన మనస్సు మరియు వాక్కు భగవంతున్ని చేరుకోలేవు”) అనే దాన్ని తేలిగ్గా చక్కగా చెప్పేశారు 👌👌👌👌

    ReplyDelete