అసలు కేసీఆర్ ఎందుకు భారత ప్రధాని కాకూడదు?
ఆయనకు లేని అర్హతలేమిటి?
ఆయన్ను విమర్శిస్తున్నవాళ్లకు ఉన్న అర్హతలేమిటి?
ముందు ఇది మాట్లాడుకొని, తర్వాత ఆ కథకొద్దాం.
కట్ టూ ఆ నలుగురు -
రాష్ట్రంలో దాదాపు మట్టికొట్టుకుపోయిన వందేళ్ల చరిత్ర ఉన్న ఒక పార్టీలో ప్రతి ఒక్కరూ ఎవరికివారే ముఖ్యమంత్రి అభ్యర్థులు! వాస్తవిక దృష్టిలో, వచ్చే ఎన్నికల్లో వాళ్లకు ఎన్ని సీట్లు వస్తాయన్నది ఎంత బాగా తెలిసినా, ఆ టెంటు నుంచి ఎప్పుడూ ఇవే జోకులు! ఆ పార్టీ తాజా జాతీయ అధ్యక్షుడు, 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కూడా. ఇక ఆ యువనాయకుడికున్న అర్హతలగురించి తెల్సుకోవాలంటే పెద్ద స్టడీ అవసరంలేదు. జస్ట్ గూగుల్‌లో ఆయన పేరు కొడితే చాలు. సెకండ్‌లో వెయ్యోవంతులో, అతనికున్న అర్హతలన్నిటి సారాంశాన్ని గూగులే ఒక్క ముక్కలో చెప్పేస్తుంది.
ఇక కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న మరొక జాతీయపార్టీమీద ఎన్నో ఆశలతో, మస్త్ మెజారిటీతో ప్రజలు పట్టం కడితే ఏం జరిగిందో .. సామాన్యప్రజలకు ఏం ఒరిగిందో .. ఇప్పటికే అందరికీ బాగా తెలిసివచ్చింది. ఎన్నికలెప్పుడెప్పుడా అని జనం ఎదురు చూస్తున్నారు, తగిన జవాబివ్వడానికి! ఆ పార్టీకి రాష్ట్రంలో ఇప్పుడున్న నాలుగైదు స్థానాలు నిలబెట్టుకోవడమే చాలా కష్టం అన్న వాస్తవం వాళ్లకూ తెల్సు. అయినాసరే, "2019లో మేమే స్వీప్ చేస్తాం" అంటున్నారు! వీళ్లు ఇంతకు ముందు ఏం స్వీప్ చేశారో, ఇప్పుడేం స్వీప్ చేస్తారో అందరికి తెల్సిందే.
తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అంతరించిపోయిన మరొక పార్టీ, దాని తాలూకు శకలాలు ఒకటి రెండు ఎప్పుడూ ఏవేవో సంధి ప్రేలాపణలు పేల్తుంటాయి. పక్కరాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ నాయకుడు, వృద్ధాప్యంలో వచ్చే ఒక విచిత్రమైన "బాల ఖ్యాలి" ని మించి .. అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే కనిపెట్టాను, అన్నిటి వెనుక నేనే కారణం .. అని అర్థం పర్థం లేకుండా డబ్బా కొట్టుకుంటుంటాడు. అసలు నేను ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవాడ్ని.. మా అబ్బాయి వద్దు అంటే ఊరుకున్నానంటాడు! అంత విలువైన సలహా ఇచ్చిన ఆ అబ్బాయికి కూడా గూగుల్‌తో కనెక్షన్ ఉండటం ఇక్కడ విశేషం.
పైన చెప్పుకున్న మూడు పార్టీలను మూడు యూనిట్‌లు అనుకొంటేగాని, నాలుగో యూనిట్‌కు క్లారిటీ రాదు! ఈ నాలుగో యూనిట్‌లో ముక్కలుముక్కలుగా ఇంకో మూడు 'సబ్ యూనిట్' లున్నాయి: సత్తా చూపించలేక లోకం వదిలిపెట్టిన పార్టీ ఒకటి. ప్యాకేజీ పధ్ధతిలో అప్పుడప్పుడూ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ, అవగాహనలేని ప్రశ్నలే తప్ప, ఎన్నటికీ ఎలక్షన్లలో పోటీచేసే ఊసే లేని ఫ్యాన్స్ పార్టీ ఒకటి. రంగు పూర్తిగా వెలిసిపోయినా ఇంకా మేం కూడా రంగంలోనే ఉన్నాం అన్న భ్రమలో బతుకుతున్న పార్టీలు రెండు. ఇవన్నీ ఈ నాలుగో యూనిట్ కిందకొస్తాయి. ఈ యూనిట్ గురించి ఇంతకు మించి మాట్లాడుకోవడం అనేది అనవసరంగా వాళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టవుతుంది. కాబట్టి ఇంక చెప్పుకునేదేం లేదిక్కడ.
కట్ చేస్తే -
ఇక్కడొక లయన్ ఉంది.
దాని పేరు కేసీఆర్!
ఒక ఉద్యమపార్టీ పెట్టి, ఆ ఉద్యమ నాయకునిగా 60 ఏళ్లుగా ఎవ్వరూ సాధించలేని ఒక రాష్ట్రాన్ని సాధించిపెట్టిన అనుభవం ఉంది.
రాష్ట్ర అవతరణ తర్వాత .. దాని ముఖ్యమంత్రిగా "ఉద్యమం వేరు, రాజకీయం వేరు" అన్న స్పష్టతతో, ఒక కొత్త రాష్ట్రాన్ని దాని అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా గత నాలుగేళ్లుగా విజయవంతంగా పాలిస్తున్న అనుభవం ఉంది.
గత అరవై ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుని ఊహకు కూడా అందని పథకాలను ప్రవేశపెడుతూ, వాటి ఫలితాలు ప్రజలకు నేరుగా అందేలా చేస్తున్న రికార్డు ఉంది.
నీటి విలువ తెలుసు. రైతు విలువ తెలుసు.
సామాన్య ప్రజల జీవితం తెలుసు. వారి జీవితాల్లోని చీకటివెలుగులు తెలుసు.
వృద్ధుల అవసరాలు తెలుసు. వారిని పట్టించుకోవడం విస్మరిస్తున్న నేటి సమాజం తెలుసు.
సమస్యల మూలాలు తెలుసు. వాటినెలా సరిదిద్దాలో తెలుసు.
రాష్ట్ర ప్రయోజనాలకోసం అవసరమైతే కొంత తగ్గి అయినా పని సాధించుకోవడం తెలుసు.
అంతేనా ...
స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలన్న కోరికలు ఆయనలో అసలు లేవు.
తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగల సామర్థ్యం ఉంది.
"వ్యవసాయం వ్యాపారం కాదు. ఒక జీవనవిధానం" అని చెప్పగల మేధావిత్వం ఆయన సొంతం.
రాష్ట్రంలోనేకాదు, దేశంలో కూడా ఉన్న ప్రతి చిన్నా పెద్ద సమస్య మీద, వాటి పరిష్కారం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది.
రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి ప్రాంతం భౌగోళిక అంశాలమీద అవసరమైతే గణాంకాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగల శక్తి ఉంది. ఆసక్తి ఉంది.
రెండో ప్రపంచ యుద్ధంలో సర్వం కోల్పోయిన ఎన్నో చిన్న చిన్న దేశాలు ఎంతో త్వరగా అభివృద్ధి చెందినా, ఇంత జనాభా ఉండి, ఇన్ని రిసోర్సెస్ ఉండి, 70 ఏళ్లుగా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందే అన్న ఆక్రోశం ఉంది.
రాజకీయం అనేది ప్రజల బాగోగులను పట్టించుకోలేని ఒక రొటీన్ అయిపోయిందే అన్న బాధ ఉంది.
ఈ రొటీన్ ను బ్రేక్ చేయాలన్న తపన ఉంది.
ఎమ్మెల్లేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా .. రాజకీయరంగంలో దశాబ్దాల అనుభవం ఉంది.
అన్నిటినీ మించి ఆయనలో ఒక మానవీయ కోణం ఉంది.
ఇప్పుడు దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అధినేతతో పోల్చుకున్నా, ఏ రాజకీయనాయకునితో పోల్చుకున్నా, ఏ విషయంలోనూ కేసీఆర్ తక్కువ కాదు.
చాలా ఏళ్ల తర్వాత, మొట్టమొదటిసారిగా ఒక విభిన్న, సంపూర్ణ రాజకీయనాయకున్ని చూస్తున్నాము. ఇలాంటి రాజకీయనాయకుడు దేశ ప్రధాని కావడానికి ఇంకేం అర్హతలు కావాలి?
dear sir very blog and very good content
ReplyDeleteLatest Telugu Cinema News
కేసీఆర్ గారికి ఉన్నవాటిల్లో ఒకటి మీరు చెప్పడం మరిచిపోయారు. అఖండమైన వాక్సుద్ధి ! దీనివల్లనే బాల్ ధాక్రే కూడా ప్రసిద్ధమైనారు. బాల్ ధాక్రే గారికి కేసీఆర్ గారికి తేడా ఏమిటంటే ముస్లిం ఓటర్లు కే సీ ఆర్ గారికి మద్దతు ఇస్తారు బాల్ ధాక్రే గారికి ఇవ్వలేదు. జాతీయ రాజకీయాల్లో బాబ్రీ అంశం కీలకమైనది. ఈ కీలక అంశాన్ని కేసీఆర్ గారు పరిష్కరిస్తే భారత ప్రధాని ఆయనే అవుతారు !
ReplyDelete