Thursday 22 September 2016

"సెల్యులాయిడ్ సైంటిస్ట్" సింగీతం!

పుష్పక విమానం, విచిత్ర సోదరులు, సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, మైఖేల్ మదన కామ రాజు, భైరవద్వీపం, ఆదిత్య 369, మేడమ్, మయూరి  ..

ఇవి మచ్చుకే.

ఇంకెన్నో సినిమాలు ..

కొన్నయితే అసలు మనం ఊహించని సబ్జక్టులు!

ఎన్నో అవార్డులు, రివార్డులు.

ఒక్క డైరెక్షనే కాదు. రచయిత, సంగీతజ్ఞుడు, నిర్మాత .. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఇవన్నీ ఒక ఎత్తయితే, ఫిలిం మేకింగ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతి కొత్త ఆవిష్కరణతో ఆయనకు పరిచయం ఉంటుంది. అంతటి నిరంతర అధ్యనశీలి ఆయన.

అయినా, నిగర్వి. నిరాడంబరుడు.

వారే సింగీతం శ్రీనివాసరావు గారు.

ఒక పదేళ్లక్రితం అనుకుంటాను.

చెన్నైలోని సింగీతం గారి ఇంట్లో వారి ఇంటర్వ్యూ తీసుకున్నాన్నేను. దాదాపు ఒక రెండున్నర గంటల ఇంటర్వ్యూ అది. దానికోసం రోజంతా ఎంతో ఓపిగ్గా నాతో కూర్చున్నారు. 

నేను రాయాలనుకుంటున్న ఒక పుస్తకం కోసం నాకవసరమైన సమాచారాన్ని సేకరిస్తూ, అందులో భాగంగా, సింగీతం గారిని కూడా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. 

సోనీ వాక్‌మాన్‌లో నేను రికార్డ్ చేసిన ఆ క్యాసెట్స్ ఇప్పటికీ నాదగ్గర భద్రంగా ఉన్నాయి.


కట్ టూ రామానాయుడు గెస్ట్ హౌజ్ -   

ఒకరోజు పొద్దున్నే సింగీతం గారి నుంచి నాకు కాల్ వచ్చింది. తను హైద్రాబాద్ వచ్చిందీ, వచ్చి ఎక్కడున్నదీ చెప్పారు. వీలు చూసుకొని రమ్మన్నారు.

నేను వెంటనే బయల్దేరి వెళ్లాను.

ఫిల్మ్ నగర్‌లో అది రామానాయుడు గెస్ట్ హౌజ్.

నేను వెళ్లేటప్పటికి చాలా సింపుల్‌గా తన బ్యాగ్‌లోంచి బట్టల్ని తీసి ఇస్త్రీకోసం అనుకుంటాను .. ఒక కుర్రాడికిస్తున్నారు. ఆ కుర్రాడికి సింగీతం గారు ఎవరో ఏం తెలుసు? చాలా కేర్‌లెస్‌గా ఆ బట్టల్ని అక్కన్నుంచి తీసుకెళ్లాడు.

ఇంతలో గదిలోకి ఇంకో బాయ్ వచ్చాడు ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌తో. ఆ కుర్రాడికి కూడా తెలీదనుకుంటాను, సింగీతం గారు ఎవరో. చాలా నిర్లక్ష్యంగా ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న నన్ను చూసి చిరునవ్వు నవ్వారాయన.

ఆయన ఇవన్నీ పట్టించుకోరు.

తన పని గురించి మాత్రమే ఆయన ఆలోచనంతా.

ఒక తపస్సులా.


కట్ టూ పుష్పక్ స్టోరీ బోర్డు - 

చెన్నైలో సింగీతం గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారి  "పుష్పకవిమానం" సినిమా స్టోరీబోర్డులోంచి ఒక సీన్ అడిగితీసుకున్నాన్నేను. నా పుస్తకంలో దాన్ని అలాగే స్కాన్ చేసి ప్రింట్ చేయడానికి.

సింగీతం గారు వారి సినిమాలకు వారే స్వయంగా స్టోరీబోర్డు వేసుకుంటారు. దర్శకులు బాపు గారిలాగే.

(బాపు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారి దగ్గర కూడా "పెళ్లిపుస్తకం" సినిమాలోని ఒక పూర్తి సీన్ స్టోరీబోర్డు అడిగితీసుకున్నాను. అది వేరే విషయం. ఆ జ్ఞాపకం గురించి మరోసారి రాస్తాను.)

సింగీతం గారు ఆరోజు నాకిచ్చిన స్టోరీబోర్డు, తన షూటింగ్ టైమ్‌లో తనకోసం స్పీడ్‌గా వేసుకున్నది కాబట్టి అంత క్లారిటీ లేదని వారి ఉద్దేశ్యం. నా పుస్తకం కోసం దాన్ని స్కాన్ చేసి, ప్రింట్‌చేసినప్పుడు టెక్నికల్‌గా అదంత బాగా రాకపోవచ్చునని వారికి తెలుసు.

అంతకు రెండువారాల క్రితం, "పుష్పకవిమానం" సినిమాలోని నాకిచ్చిన అదే సీన్ స్టోరీబోర్డును వారు మళ్లీ ఫ్రెష్‌గా వేసి తీసుకొచ్చారు. అది నాకివ్వడం కోసం ఆరోజు నాకు ఫోన్ చేసి పిలిచారు!

దటీజ్ సింగీతం గారు.

అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు, పుష్పకవిమానం లాంటి అద్భుతాలు క్రియేట్ అయ్యాయంటే ఎందుక్కావు మరి?

85 ఏళ్ల వయస్సులోనూ పాతికేళ్ల కుర్రాడాయన. ఆలోచనలోనూ, ఆవిష్కరణలోనూ నిత్య యవ్వనుడాయన.

ఇవాళ సింగీతం గారి పుట్టినరోజు.

వారికివే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ..

ఈ సందర్భంగా, వారినుంచి మరెన్నో క్లాసిక్ సినిమాలు రావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే .. వారి క్రియేటివిటీ విషయంలో నాబోటివాళ్లకింకా దాహం తీరలేదు. 

2 comments:

  1. Singitham Srinivasa Rao garu is one of my favorite directors. Thanks for sharing this post about him. I wish him many more happy birthdays!

    ReplyDelete
    Replies
    1. My pleasure Lalitha garu. Thanks for your comment.

      Delete