Sunday 14 August 2016

జై గురుదేవ్...

బెంగుళూరు శివార్లలో ఉన్న ఒక అంతర్జాతీయస్థాయి ఆధ్యాత్మిక గురువుతో కనీసం ఒక గంటసేపు, వన్-టూ-వన్, ఫేస్-టూ-ఫేస్ కూర్చొని మాట్లాడే అవకాశం దొరికిన అరుదైన వ్యక్తుల్లో ఒకడిగా నాకు రికార్డ్ ఉంది.

గురూజీ ఒక నాలుగంగుళాల ఎత్తున్న చెక్కపీటమీద కూర్చున్నారు. ఆయనకెదురుగా మంచి మ్యాట్ మీద నేను కూర్చున్నాను.

ఇదంతా ఆయన ఏకాంత వ్యక్తిగత కుటీరంలో జరిగింది.

అది 2004 లో.

వందలాదిమంది భారతీయ, విదేశీ భక్తులు ఆ కుటీరం బయట గురూజీ దర్శనం కోసం ఎదురుచుస్తున్నారు. నేనెప్పుడు బయటికొస్తానా, గురూజీ ఎప్పుడు బయటికొచ్చి అలా చిరునవ్వుతో అందరికీ చేయి ఊపి పలకరించి వెళతారా అని!

గంట తర్వాత, నేను కుటీరంలోంచి బయటకొస్తోంటే బయట గురూజీ భక్తులంతా నన్ను ఎంత ప్రత్యేకంగా చూశారో, ఎలా నాకు దారి ఇచ్చారో నేను ఇప్పటికీ మర్చిపోలేను.

కట్ టూ 2016 - 

నా వ్యక్తిగత పనులకోసం ఈ మధ్య, గత 9 నెలల్లోనే, కనీసం ఒక అరడజనుసార్లు నేను బెంగుళూరు వెళ్లాల్సివచ్చింది. వెళ్ళిన ప్రతిసారీ, శివార్లలో ఉన్న గురూజీ ఆశ్రమం మీదుగా కూడా వెళ్లాల్సివచ్చింది. 

ఓ గంట బ్రేక్ తీసుకొని, ఆశ్రమం లోపలికి వెళ్లాలని దాదాపు ప్రతిసారీ అనిపించింది. కానీ, కారాపి, వెళ్లలేకపోయాను.

ఇక్కడ విషయం నేను బిజీ అని కాదు.

"వెళ్లి చేసేదేముంది" అని అంతర్లీనంగా నాలో ఉన్న అనాసక్తి కావచ్చు, బహుశా.

సుమారు 12 ఏళ్ల క్రితం, గురూజీ దగ్గరికి నేను ఏదో ఆశించి వెళ్లలేదు. గురూజీకి అతి దగ్గరి అనుయాయులే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. గురూజీ కూడా ఆరోజు నాకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం నాకు ఇప్పటికీ ఒక అర్థంకాని గొప్ప విషయమే!

సరే, ఏదైతేనేం .. ఆరోజు .. ఒక గంట మాట్లాడిన తర్వాత నేను లేస్తుంటే, గురూజీ కళ్లుమూసుకొని మంత్రించి నాచేతికిచ్చిన యాపిల్ పండు ఆరోజు నుంచి ఇవాల్టివరకూ, నా జీవితంలో నాకు ఎలాంటి మిరాకిల్‌ను క్రియేట్ చేయలేకపోయింది. 

అలాంటి ఊహించని అద్భుతం ఏదో జతుగుతుందని నేను అనుకోలేదు కూడా.

వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఆధ్యాత్మిక సామ్రాజ్యం, దాని నిర్వహణ మాత్రం నాకు బాగా నచ్చాయి. అలాంటి సువిశాల ఆధ్యాత్మిక సామ్రాజ్యాలు, గురూజీకి, ప్రపంచంలో కనీసం ఇంకో 70 దేశాల్లో కూడా ఉన్నాయని విన్నాను.

ఇది మామూలు విషయం కాదు. మామూలు వ్యక్తులవల్ల సాధ్యం కాదు కూడా.

ఈ ఒక్క "సక్సెస్ సైన్స్" పాయింటాఫ్ వ్యూలో మాత్రం గురూజీ నాకు బాగా నచ్చారు.

నమ్మకం అనేది పూర్తిగా వ్యక్తిగతం. దానికి శాస్త్రీయమైన రీజన్ కూడా ఉందని నేను నమ్ముతాను. ఈకోణంలో ఎదుటివారి నమ్మకాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను.

అయితే - ఆ నమ్మకమే పునాదిగా, ఆధ్యాత్మికం నేపథ్యంగా, అంత భారీ స్థాయిలో, 70 దేశాల్లో అంతమంది భక్తులను సంపాదించి, అంత సువిశాల ఆధ్యాత్మిక సామ్రాజ్యం నిర్మించగలిగిన ఒక అసాధారణ వ్యక్తిగా మాత్రం గురూజీ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా చాలా ఇష్టం.

ఇప్పటికీ.

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గురూజీని గుర్తు చేసుకున్నాను కదా, ఇప్పుడేదైనా అద్భుతం జరుగుతుందేమో! చూడాలి ..

జై గురుదేవ్ ..