Monday 11 April 2016

ఎన్నారై స్వప్నానికి మరోవైపు

ఇండియాలో ఇంజినీరింగ్, మెడిసిన్, ఎమ్‌బిఏలు చదవడం .. కట్ చేస్తే, అమెరికా ఫ్లైట్ ఎక్కడం! ఇది మన దేశంలో చాలా మామూలు విషయం.

తమ పిల్లలు అమెరికా వెళ్లడం అనేది కొన్ని కుటుంబాలకు స్టేటస్ సింబల్ కాగా, వెళ్లే యువతకు తమ మిత్రబృందాల్లో అదొక ప్రత్యేక గుర్తింపు. చెప్పాలంటే, మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో, దాదాపు ప్రతి ఇంటినుంచీ కనీసం ఒక్కరైనా అమెరికావెళ్ళి ఎన్నారైలుగా స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ ఎన్నారైలే ఇప్పుడు అమెరికాలోని ప్రతి ప్రధాన రంగంలోనూ కనీసం 20% ఉన్నారని ఒక అంచనా. పెంటగాన్, సీఇఏ, వైట్‌హౌజ్‌లు కూడా కూడా ఇందుకు మినహాయింపుకాదు! అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు ..

ఇండియా నుంచి అమెరికా వెళ్ళి, బాగా కష్టపడి చదువుకొని, మంచి ఉద్యోగాలూ డబ్బూ బాగా సంపాదించుకొని, ఎన్నారైలుగా అక్కడ ఎన్ని లక్జరీలు అనుభవిస్తూ జీవిస్తున్నా .. వీళ్లల్లో అతి కొద్దిమందికి మాత్రం ఎక్కడో ఏమూలో ఏదో ఒక అసంతృప్తి. మన మూలాలు, మన మాతృదేశం, మనం ఈ స్థాయికి చేరుకోడానికి కారణమైన మన తల్లిదండ్రులు, మన వాళ్లు, మన ఊరు, మన గాలి, మన నేల .. ఇవన్నీ మర్చిపోతున్నామన్న ఒక అంతరంగ మథనం. ఏదో చేయాలన్న తపన. ఇదంతా నాణేనికి మరోవైపు ..

ఇదిగో .. ఈ రెండో కోణంలోంచి పుట్టిన నవలే భరత్‌కృష్ణ రాసిన "గై ఆన్ ది సైడ్ వాక్".

అమెరికాలో ఉద్యోగంకోసం వెళ్లిన యువతరం జీవనశైలిని ఈ నవలలో చిత్రీకరించినట్టు బహుశా ఇంతకు ముందు ఏ ఇతర నవలలోనూ చేయలేదు. మరోవైపు, "గుంపులో గోవిందా" లాగా కాకుండా, ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో తన దేశంలోని పరిస్థితులు, పాలిటిక్స్, వెనకబాటుతనం, తానేమైనా చేయాలి అన్న తపన .. వీటన్నిటి గురించి నిరంతరం ఏదో ఒకటి ఆలోచించే ఈ నవలానాయకుడు "జే" (జయవర్థన్) వంటి పాత్ర కూడా ఇంతవరకు ఎన్నారై నేపథ్యంగా వచ్చిన ఏ ఇతర నవలల్లోనూ కనిపించదు.

అమెరికాలో చదవడంకోసం తను పడిన కష్టాలు, ఆ తర్వాత ఉద్యోగం, ఆదాయం అంతా బాగానే ఉన్నా, అమెరికాలోని అన్ని లక్జరీస్‌ను త్యజించి, చివరికి తన మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకొని ఇండియాకు తిరిగివచ్చే ఈ నవలలోని జే పాత్ర వ్యక్తిత్వం గురించి ఎంతైనా రాయొచ్చు. ఈ ఒక్క ప్రధాన పాత్రే పాఠకులచేత నవలనంతా ఏకబిగిన చదివించేలా చేస్తుంది. అమెరికాలో ఉద్యోగం కోసం ఇండియానుంచి వెళ్లిన యువతరం జీవనశైలిని, "ఇక్కడున్నది ఇంతేనా" అని నిరంతరం మధనపడే నవలానాయకుడు జే పాత్ర ఆవిష్కరణనూ మంచి రీడబిలిటీతో, చాలా సున్నితమైన చమత్కార శైలిలో రచయిత భరత్‌కృష్ణ రాయడం విశేషం.

నవలా కథాంశం కొంచెం సీరియస్‌దే అయినా, దాన్ని నడిపించిన భరత్‌కృష్ణ కథనశిల్పం బాగుంది. చాలా సున్నితమైన చమత్కార శైలితోపాటు, అక్కడక్కడా సెటైర్లతో, "మోతాదు మించిందా" అనిపించే రియలిస్టిక్ రొమాన్స్ సన్నివేశాలుకూడా కావల్సినన్ని ఉన్నాయి.

తన తొలి నవలతోనే రచయిత భరత్‌కృష్ణ ఈ పట్టును సాధించడం మనం గుర్తించవచ్చు.

ముఖ్యంగా, సిరి పాత్రచిత్రణ అద్భుతం. సిరి, జే పాత్రలమధ్య రిలేషన్‌షిప్‌ను నిర్మొహమాటంగా, ఎలాంటి హిపోక్రసీ లేకుండా పూర్తి వాస్తవిక పధ్ధతిలో నడిపించడం బాగుంది. ఇది నిజంగా పాఠకులు చదివి ఫీలవ్వాల్సిన అంశం.

ప్రేమా, దేశం పట్ల తన బాధ్యతా .. ఏది ప్రధానం అన్నదాని గురించి కూడా ఈ నవలలో చెప్పిన పధ్ధతి పాఠకులకు బాగా నచ్చుతుంది.

రచయిత భరత్‌కృష్ణ తను ఎన్నుకున్న పాయింట్‌ను ఎంత బాగా చెప్పినా - నవల ముగింపు మాత్రం పాఠకులను కొంత నిరాశకు గురిచేస్తుంది. ఈ ముగింపు అందరికీ నచ్చదు. కానీ, అందరికీ నచ్చేలా రాయడం మళ్లీ ఒక రొటీనే అయిపోతుంది కాబట్టి అలా చేయలేదనుకోవచ్చు. మనసులోని ఆలోచనకు, సంఘర్షణకు ఒక సంపూర్ణ రూపం సంతరించుకోనప్పుడు దాన్నలా వదిలివేయడమే వాస్తవికంగా ఉంటుంది. భరత్‌కృష్ణ ఆ పనే చేశాడు.

అమెరికాలో సుమారు ఆరేళ్లపాటు ఉండి, చదివి, వివిధహోదాల్లో పనిచేసి, అక్కడి అన్ని లగ్జరీస్ చూసి ఇండియా తిరిగొచ్చిన నవలారచయిత భరత్‌కృష్ణ ఎన్నుకున్న ఈ నవలాకథాంశం చాలా విశిష్టమైనది. తమ పిల్లలను అమెరికా పంపాలనుకొనే తల్లిదండ్రులు, అమెరికావెళ్లి ఏదో సాధించాలనుకొనే యువతరం, ఇప్పటికే అమెరికాలో స్థిరపడి కూడా ఎదో కోల్పోతున్నామన్న ఆలోచనతో ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన నవల ఈ "గై ఆన్ ది సైడ్ వాక్".

గోవాలోని సిన్నమన్ టీల్ ద్వారా ప్రచురితమైన ఈ నవల - అమెజాన్ నుంచి, ఫ్లిప్‌కార్ట్ దాకా .. అన్ని ఆన్‌లైన్ సైట్స్‌లోనూ లభిస్తున్నది. విశేషం ఏంటంటే, ఈ నవల ఆవిష్కరణ కూడా రొటీన్‌కు భిన్నంగా జరిగింది. తన "గై ఆన్ ది సైడ్ వాక్" నవలను గత మార్చి 10వ తేదీనాడు ఆన్‌లైన్‌లో గూగుల్ ప్లస్, యూట్యూబ్‌ల ద్వారా  భరత్‌కృష్ణ లైవ్‌లో విడుదల చేయడం విశేషం.                                                                        

No comments:

Post a Comment