Wednesday 20 January 2016

క్రియేటివ్ కాసినో!

సినీ ఫీల్డు ఒక అద్భుత మాయాలోకం. ఇక్కడ లేనిది లేదు!

మరో కోణంలో చూస్తే - ఇదొక హెవీ గ్యాంబ్లింగ్ ఫీల్డు. ఈ గ్యాంబ్లింగ్ అనేది ఇక్కడ కేవలం క్రియేటివిటీ, డబ్బుతోనే కాదు, జీవితాలతో కూడా ఉంటుంది.

ఫీల్డులో అంతా బానే ఉన్నట్టుంటుంది. కానీ, నిజంగా ఎప్పుడు బావుంటుందో ఎవరికీ తెలీదు. చూస్తుంటే నెలలూ, సంవత్సరాలూ ఇట్టే గడిచిపోతాయి. ఓ అయిదేళ్ల తర్వాతో, దశాబ్దానికో, ఊహించని విధంగా "ఓవర్‌నైట్" సక్సెస్ వరిస్తుంది.

రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతాయి.

సక్సెస్ వరించని 90 శాతం మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సినీ ప్రయాణం మాత్రం అనుక్షణం మారిపోయే అగమ్యాలవైపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

బార్‌లోకెళ్లినవాడు ఏ బీరో తాగాలి తప్ప, కొబ్బరినీళ్లకోసం వెతక్కూడదు. ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇక్కడి స్టైల్లోనే తీసుకోవాలి. వ్యక్తిత్వాలూ, వంకాయలూ అంతా బుల్‌షిట్.

సినిమా ఈజ్ సినిమా!

అదొక్కటే లోకం కావాలి. ఆ లోకపు ప్రాథమిక సూత్రాలే నీ జీకే కావాలి. ఆ లోకపు లౌక్యమే నీ శ్వాస కావాలి. అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ అవే కలిసివస్తాయి. నువ్వు అనుకున్నది నిజమయ్యే చాన్స్ నీకు దగ్గరవుతుంది. ఏ ఓవర్‌నైట్‌లోనో అది  నిన్ను వరిస్తుంది.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా, ఇకముందు కూడా .. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎక్కడయినా.. ఈ ఫీల్డులో సక్సెస్ రేట్ ఎప్పుడూ 5 శాతం దాటదు. చెప్పాలంటే, ఇంకా తక్కువే!

అవకాశం దొరకడమే ఇక్కడ చాలా కష్టం. అలా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఎందరో ఎంతో ఖర్చు చేస్తారు. ఖర్చయిపోతారు.

డబ్బొక్కటే కాదు. జీవితం కూడా.

గట్స్.
ప్యాషన్.
నీడ్.
కంపల్షన్.

ఇది తెలిసి ఆడే జూదం.

ఒక క్రియేటివ్ గ్యాంబ్లింగ్. ఒక కల్చరల్ ఫేంటసీ.

ఒక క్రియేటివ్ కాసినో .. 

No comments:

Post a Comment