Sunday 21 June 2015

ఒక జ్ఞాపకం!

కొన్ని నేరాలు క్షమించరానివి. అలాంటి నేరం నేను చేశాను.

మా నాన్న విషయంలో.

అలాంటి నేరం చెయ్యాల్సిన చక్రవ్యూహంలో చిక్కుకుపోయాను. నిస్సహాయంగా. అలాగని ఏ చట్టమో, ఇంకెవరో కాదు నన్ను క్షమించాల్సింది.

నన్ను నేనే క్షమించుకోవాలి. కానీ, ఇప్పటికీ, ఎప్పటికీ .. నన్ను నేను క్షమించుకోలేను. క్షమించమని ఆయనను అడగలేను.

ఆయనకు అందరికంటే ఇష్టమైన కొడుకును నేనే. వృధ్ధాప్యంలో ఆయనకు అవసరానికి ఏ లోటూ జరక్కుండా అన్నివిధాలా చూసుకున్నదీ నేనే.

కానీ, ఆయన చివరి రోజుల్లో మాత్రం ఆయనకు దగ్గరగా ఉండలేకపోయాను. ఇదే నేను చేసిన నేరం.

కారణం ఏదయినా కావొచ్చు. ఎంత బలమైందయినా కావచ్చు. జరిగిన వాస్తవం మాత్రం ఇదే.

ఆయన కొనుక్కున్న శంకర్‌నారాయణ్ ఇంగ్లిష్ డిక్షనరీని, గ్రామర్ పుస్తకాల్నీ, ఇంకెన్నో పుస్తకాల్నీ నా చిన్నతనంలో ఎన్ని వందలసార్లు తిరగేశానో నాకింకా గుర్తు. ఆయన నాకు, నేను ఆయనకు .. మేమిద్దరం రాసుకున్న వందలాది ఉత్తరాలు ఒక రికార్డు. ఒక అద్భుత అనుభూతి.

స్కూలుకెళ్ళి ఏం చదువుకోకపోయినా ఆయన అలవోకగా వందలాది ఉత్తరాలు రాశాడు. ఎలాంటి సంకోచం లేకుండా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ మాట్లాడాడు. రాశాడు. అది ఆయన స్వయంకృషి.

ఆయన ఎందరికో సహాయం చేశాడు కానీ, ఎవ్వరి సహాయం తీసుకోలేదు.

ఆయన జ్ఞాపకాల్ని కూడా క్రమంగా మర్చిపోతానేమో .. ఈ పనికిరాని నగర జీవనశైలిలో ఇంకా ఇంకా మునిగిపోయి. మరింతగా కూరుకుపోయి.

అది జరక్కూడదు. ఆయన జ్ఞాపకాల్ని నేను మర్చిపోకూడదు.

ఆయన మా నాయిన.

నాయినా!

నాకిప్పుడు ఏ హిపోక్రసీలూ లేవు, ఎవరో ఏదో అనుకుంటారన్న ఇన్‌హిబిషన్స్ కూడా లేవు. నేను కోల్పోయిన స్వతంత్రాన్ని తిరిగి వెంటనే పొందేలా నన్ను ఆశీర్వదించు నాయినా...