Friday 19 June 2015

స్విమ్మింగ్‌పూల్ "ఐటమ్ కింగ్!"

లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర్నుంచి ఫోన్!

"ఇప్పుడే నువ్వు రాసిన పాటను నేను పాడాను. చాలా బాగా రాశావు. వేటూరి గారికి చాలా దగ్గరగా, దాదాపు ఆ స్థాయిలో ఉంది నీ శైలి. కష్టపడు నాయనా .. పైకొస్తావు!"

ఎస్ పి బాలు గారి నుంచి ఈ అభినందన అందుకున్న ఆ పాట రచయితకు ఇంకా పాతికేళ్లు నిండలేదు.

పేరు తిరుపతి.

శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టి పెరిగిన తిరుపతికి చిన్నప్పట్నుంచీ పాడటం బాగా అలవాటు. రామ మందిరంలో భజనలు బాగా వినేవాడు. బాగా పాటలు పాడేవాడు. అలా అలా రాయడం కూడా అలవాటయిపోయింది.

కట్ చేస్తే -

డిగ్రీ వరకూ ఎలాగో ఆపుకున్నాడు తిరుపతి. ఆ తర్వాత ఇంక ఆగలేదు. కుట్టకూడని బగ్ కుట్టేసింది. అదే సినిమా!

ఎలాగయినా సరే సినిమాల్లోకి వెళ్లాలనీ, లిరిక్ రైటర్ కావాలనీ నిర్ణయించుకున్నాడు తిరుపతి.

కట్ చేస్తే -

శ్రీకాకుళం నుంచి హైద్రాబాద్‌కు జంప్!

హైద్రాబాద్ వచ్చి కృష్ణానగర్, యూసుఫ్‌గూడాల్లో దిగగానే సినిమా ఛాన్స్ దొరకదు కదా .. సో, ఏదో ఒకటి ప్రారంభం అంటూ చేసి, అక్కడా ఇక్కడా తిరుగుతూ వుంటే, ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది.

ఈ సినిమా సూత్రం ఈజీగానే కనుక్కున్నాడు తిరుపతి.

నెలకు 300 ఫీజుతో ఒక డాన్స్ స్కూల్లో చేరిపోయాడు తిరుపతి. అప్పుడు తిరుపతి చేరిన ఆ చిన్న డాన్స్ స్కూల్లో డాన్స్ మాస్టర్ మరెవరో కాదు. ఇప్పటి పాపులర్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్!

శేఖర్ మాస్టర్ ద్వారా వేణు-పాల్ అనే కోరియోగ్రాఫర్స్ ద్వయం పరిచయమయ్యారు తిరుపతికి.

"బాబూ, నువ్విలా మాతో ఉంటే లాభం లేదు. నిన్నొక చోట పెట్టిస్తాం. అక్కడ నీకు పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు నీకు లిరిక్ రైటర్‌గా ఛాన్స్ ఇస్తారు" అన్నారు వేణు-పాల్.

కట్ చేస్తే -    
మన హీరో అఖిల్ కార్తీక్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా చేరిపోయాడు తిరుపతి.

అఖిల్ కార్తీక్ దగ్గర సుమారు నాలుగేళ్లు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో - ఆ అప్‌కమింగ్ హీరో ఇచ్చిన ప్రోత్సాహం, అక్కడ పెంచుకున్న పరిచయాలు .. అన్నీ చివరకు మన తిరుపతి కలను నిజం చేశాయి.

ఒక లిరిక్ రైటర్‌గా మొదటిసారిగా "పాండవులు" సినిమాకు రాసే ఛాన్స్ కొట్టేశాడు తిరుపతి. రెండో సినిమా "యుగ్మలి". వందేమాతరం శ్రీనివాస్ దానికి మ్యూజిక్ డైరెక్టర్.

ఈ సినిమాలో తిరుపతి రాసిన పాట పాడిన తర్వాతనే, బాలు గారు తిరుపతి నంబర్ తీసుకొని, స్వయంగా తిరుపతికి ఫోన్ చేసి సుమారు 15 నిమిషాలపాటు మాట్లాడారు. అభినందించారు. ఆశీర్వదించారు.

ఇది తిరుపతి తన జీవితంలో మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం.

కట్ చేస్తే -   
శివాజీ "చూసినోడికి చూసినంత", మా "స్విమ్మింగ్‌పూల్" వగైరా ఎన్నో సినిమాలకు లిరిక్ రైటర్‌గా పాటలు రాస్తూ బిజీ అయిపోయాడు తిరుపతి.

ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ సినిమాకు పాటలు రాస్తున్నాడు తిరుపతి. సింగిల్ టైటిల్ కార్డ్!

అసలు తిరుపతిని నాకు పరిచయం చేసింది అఖిల్ కార్తీక్. "బాగా రాస్తాడు సర్. ఒకసారి చూడండి!" అన్నాడు కార్తీక్.

రాయటం ఎలాఉన్నా, తిరుపతి తను రాసిన పాటను, తను అనుకున్న ట్యూన్‌లో బీట్ వేస్తూ పాడి మరీ వినిపిస్తాడు. అదీ అతని ప్రత్యేకత!

అలా తిరుపతి దగ్గర అప్పటికే ఉన్న కొన్ని ఐటమ్‌సాంగ్‌లను విన్న తర్వాత, "పంపుటపం" పాట విని ఆ క్షణం పడిపోయాన్నేను. అప్పట్నుంచీ, నేను తిరుపతిని "ఐటమ్ కింగ్" అనే పిలుస్తున్నాను. స్విమ్మింగ్‌పూల్ లో మిగిలిన రెండు పాటలు కూడా తననే రాయమని సింగిల్ టైటిల్ కార్డ్ ఇచ్చేశాను తిరుపతికి.

సినిమాలో లేని ఇంగ్లిష్ ప్రమోషనల్ సాంగ్ "డార్లింగ్ ఫీల్ మై లవ్" ఒక్కటి మాత్రం, అవసరం దృష్ట్యా, అప్పటికప్పుడు నేనే రాశాను. అది వేరే విషయం.

కట్ బ్యాక్ టూ ఒక జీవిత వాస్తవం -  

అప్పటికే రెండు సినిమాలకు పాటలు రాసిన తన కొడుకు గురించి శ్రీకాకుళంలో దినపత్రికల్లోని సినిమా పేజీల్లో, టీవీ చానెల్స్ ఫిలిం న్యూసుల్లో చూసి ఎంతో ఆనందపడిపోయిన తిరుపతి తండ్రి - తిరుపతి రెండో సినిమా యుగ్మలి ఆడియో రిలీజ్ వేడుకకు ఒక రోజు ముందు అకస్మాతుగా చనిపోయారు.

మొదటిసారిగా హైద్రాబాద్‌లో ఒక ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్న తిరుపతికి ఈ వార్త తెలియనీయకూడదని నిర్ణయం తీసుకొంది తిరుపతి కుటుంబం.

ఇంటికి పెద్దకొడుకయిన తిరుపతి లేకుండానే, శ్రీకాకుళంలో అతని తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

ఆడియో కార్యక్రమం అయిపోయిన తర్వాతే - హైద్రాబాద్‌లో ఉన్న తిరుపతికి తన తండ్రి మరణవార్తను తెలియజేశారు.

తన సినిమా ఎంట్ర్రీని ఎంతగానో సంతోషించిన తన తండ్రిని కడసారిగా చూడలేకపోయిన బాధ తిరుపతిలో ఉన్నా - అప్పుడు తన కుటుంబం తీసుకున్న నిర్ణయమే తన తండ్రికి నిజమైన ఆత్మశాంతిగా భావిస్తాడు తిరుపతి.

అదే జీవితం. 

No comments:

Post a Comment