Saturday 16 May 2015

అంతా మన మంచికే!

కొన్ని పరిచయాలు, ప్రయాణాలు జీవితంలో ఒక మంచి అనుభూతినిస్తాయి. మరచిపోలేని తీపి జ్ఞాపకాలుగా మన మనస్సులో స్థిరపడిపోతాయి.

అలాంటి ఒక అద్భుతమైన అనుభూతి, అలాంటి ఒక మర్చిపోలేని జ్ఞాపకం .. మొన్నటి అమెరికా షూటింగ్ సందర్భంగా - నాగబాబు గారితో అతి దగ్గరగా గడిపే అవకాశం లభించిన ఆ ఆరు రోజులు!

ఆ మధ్య జరిగిన "మా" ఎన్నికలప్పుడు నాగబాబు గారికి ఏదో అలా పరిచయం అయ్యాను. అంతే.

ఓ కొత్త సినిమా షూటింగ్ కోసం మొన్న అమెరికా వెళ్లినపుడు మేమిద్దరం కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించాం. న్యూజెర్సీలో ఒకే హోటల్లో ఉన్నాం.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న, మంచి నటుడు, పెద్ద నిర్మాత కూడా అయిన నాగబాబు గారు నాతో అంత క్లోజ్‌గా మాట్లాడతారనీ, నా కెరీర్‌కు ఉపయోగపడే మంచి విషయాలెన్నో నాకు చెబుతారనీ నేను కలలో కూడా అనుకోలేదు.

కానీ జరిగింది.

అది కల కాదు.

నిజం.

కట్ టూ 'అంతా మన మంచికే' - 

ఒకవైపు ఓషో తులసీరాం గారి దర్శకత్వంలో నిషా కొఠారీతో కలిసి నేను నటించిన "క్రిమినల్స్" చిత్రం రిలీజ్; మరోవైపు మనోహర్ చిమ్మని హాట్ రొమాంటిక్ హారర్ "స్విమ్మింగ్‌పూల్" ఆడియో రిలీజ్, ఫిలిం రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ షూటింగ్ రావడం .. ప్లస్ మరో కారణం వల్ల ఈ షూటింగ్‌కు అంత ఉత్సాహంగా వెళ్లలేదు నేను.

కానీ నేనీ షూటింగ్‌కు వెళ్లడమే మంచిదయ్యింది. లేదంటే - జీవితంలో ఒక గొప్ప "క్వాలిటీ టైమ్" ను మిస్ అయ్యేవాణ్ణి. అదీ, నాగబాబు గారితో!

మా షూటింగ్ న్యూయార్క్‌లో.  మేం ఉన్నది మాత్రం న్యూజెర్సీలోని 'ఎక్జిక్యూటివ్ సూట్స్' హోటల్లో.

నాగబాబు గారూ, నేనూ కలిసి కాఫీ తాగడం .. షూటింగ్ లేనప్పుడు బయటకెళ్లి షాపింగ్ చేయడం నేనెన్నటికీ మర్చిపోలేను.

నేను ఎలా సినీఫీల్డుకొచ్చాను, ఎవరి సపోర్ట్ లేకుండానే ఎలా ఇన్ని సినిమాల్లో హీరోగా నటించగలిగాను, పదేళ్లనుంచీ ఎలా ఫీల్డులో ఉండగలిగాను, ఎలా ఇంకా కంటిన్యూ అవుతున్నాను .. ఇలా నాగురించి ప్రతి ఒక్కటీ అడిగి తెలుసుకున్నారు నాగబాబు గారు. నా కెరీర్‌కు ఉపయోగపడే మంచి సలహాలెన్నో ఇచ్చారు.

ఇద్దరం కలిసి ఫోటోలెన్నో దిగాం. అప్పుడప్పుడూ, నన్ను ఒక్కన్నే తనకు నచ్చిన స్పాట్‌లో నిలబెట్టి స్వయంగా నాగబాబుగారే ఫోటోలు తీయడం .. అప్పుడప్పుడూ ఇద్దరం "డిస్కషన్" చేయడం ..

అదంతా అసలు మర్చిపోలేను.

ఈ సందర్భంలోనే నాగబాబు గారితో "స్విమ్మింగ్‌పూల్" సినిమా గురించీ, దాన్ని మా డైరెక్టర్ మనోహర్ గారు కేవలం 13 రోజుల్లో పూర్తిచేయడం గురించి కూడా చెప్పాను.

చాలా ఆసక్తిగా విన్నారు. "తొందర్లోనే నీకు తప్పకుండా బ్రేక్ వస్తుంది. నా మాట నిజమౌతుంది చూడు!" అంటూ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపారు.  

మా ఇద్దరి మాటల మధ్య ఒకసారి పుస్తకాల టాపిక్ కూడా వచ్చింది. రాబిన్ శర్మ "ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ" నేను చదివానని చెప్పగానే - నాగబాబు గారు కూడా ఎంతో ఉత్సాహంగా తను కూడా ఆ పుస్తకం చదివానని చెప్పారు. ఆ పుస్తకంలోని చాలా ముఖ్యమైన పాయింట్స్ గురించి చర్చించారు.

కొసమెరుపు ఏంటంటే -  ఆ పుస్తకాన్ని చదవమని నాగబాబు గారికి ఇచ్చింది మరెవరోకాదు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్!

-- స్విమ్మింగ్‌పూల్ హీరో అఖిల్ కార్తీక్ గెస్ట్ పోస్ట్  

No comments:

Post a Comment