Monday 11 May 2015

గోల్డ్ మెడల్స్‌కు అసలు విలువుందా?

గోల్డ్ మెడల్స్ కోసం అసలు నేనెప్పుడూ చదవలేదు. అవి వస్తాయని కూడా ఊహించలేదు.

కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రెండు గోల్డ్ మెడల్స్ పొందాన్నేను.

ఓ అదేపనిగా 365 రోజులు చదివే అవసరం లేకుండా, ఎంత తక్కువ సమయంలో ఎలా చదివితే, ఎలా రాస్తే, మార్కులు బాగా వస్తాయో నాకు బాగా తెలుసు.
అది నా ఇంట్యూషన్. అంతవరకే నాకు తెలుసు.

నిజంగా .. అంతవరకు మాత్రమే నాకు తెలుసు!

ఈ వాక్యాన్ని ఎందుకంతగా స్ట్రెస్ చేస్తూ చెప్తున్నానంటే - ఏ మెడల్స్ రాకుండానే, చదువులో నాతో ఏ రకంగానూ పోటీపడలేని నా మిత్రులు కొందరికి మాత్రం నా కంటే ఎన్నో విషయాలు ఎంతో బాగా తెలుసన్న విషయం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకని చెప్తున్నాను.

యూనివర్సిటీ పోస్టుల ఇంటర్వ్యూలప్పుడు, ఏ మెడల్స్ రాని నా మిత్రులు ఒక విషయం నాకు చాలా స్పష్టంగా  ముందే చెప్పారు.

"ఈ జాబ్ నీకు రాదు. నాకు వస్తుంది" అని!

వాళ్లకు ఆ జాబ్ ఎందుకు వస్తుందో కూడా చెప్పారు. మంత్రుల రికమండేషన్, మనీ వగైరా అన్నమాట.

అలా చెప్పిన నా మిత్రులకు యూనివర్సిటీ జాబ్ ఇచ్చింది. రెండు గోల్డ్ మెడల్స్ ఇచ్చి నన్ను మాత్రం సెలక్టు చేసుకోలేదు నా యూనివర్సిటీ!

అలాగని ఇంటర్వ్యూలో నేను సరిగా పెర్ఫామ్ చేయలేదని కూడా కాదు. అసలు వాళ్లు నన్ను ప్రశ్నలు అడిగితే కదా!?      

జస్ట్ నా ఫైల్ అలా చూసి, "ఒకే మనోహర్ .. ఆల్ ద బెస్ట్!" అని పంపించేశారు.

దీనిమీద ఇంక నేను ఎంతైనా రాయగల జ్ఞాపకాలు నాకున్నాయి. కానీ, నెగెటివిటీ నాకిష్టం లేదు. సో, గోల్డ్ మెడల్స్ కు సంబంధించిన ఈ కోణం ఇక్కడితో ఆపేస్తున్నాను.

కట్ టూ తెల్ల ప్యాంట్ - 

అసలిదంతా మళ్లీ గుర్తుకుతెచ్చుకునేవాణ్నే కాదు. మొన్నీమధ్య నా ఫేస్‌బుక్ ఆల్బమ్‌లోంచి ఒక ఫోటో టక్కున బయటకొచ్చింది.

అది .. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతులమీదుగా నేను గోల్డ్ మెడల్ తీసుకొంటున్న ఫోటో.

ఆ ఫోటో ఒక గమ్మత్తైన జ్ఞాపకాన్ని నాకు మళ్లీ గుర్తు చేసింది. ఆ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవడం కోసమే ఈ బ్లాగ్‌పోస్ట్.

గోల్డ్ మెడల్ తీసుకొనే కాన్వొకేషన్ ఫంక్షన్ కోసం ఆరోజు తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు వేసుకెళ్లాలని డ్రెస్ కోడ్.

నాకసలు వైట్ ప్యాంటే లేదు. అప్పటికప్పుడు కొనుక్కొని వేసుకొనే పరిస్థితి కూడా లేదు. ఫ్రెండ్సూ అంతే. అందరం హాస్టల్ కోసం యూనివర్సిటీలో చేరినవాళ్లమే!

ఇంక చేసేదేంలేక, నా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా నాకు సరిపోయే వైట్ ప్యాంట్ కోసం క్యాంపస్‌లోని మొత్తం ఎ హాస్టల్, మంజీరా హాస్టల్ అంతా వెదికారు. చివరికి దొరికింది.

అలా దొరికిన ఆ తెల్ల ప్యాంటుని, నా తెల్ల చొక్కామీద వేసుకొని వెళ్లి ఆరోజు గోల్డ్ మెడల్ అందుకున్నాను.

నా చేతికి ఎప్పుడూ మా నాన్న కొనిపెట్టిన ట్రెస్సా వాచ్ ఉండేది. బయటకు వెళ్తున్నప్పుడు ఏది మిస్ అయినా దాన్ని మాత్రం మిస్సయ్యేవాణ్నికాదు. అదో ఆనందం. అలవాటు. క్రేజీ.

అయితే, అంతకు ముందురోజే నా ప్రియమైన ఆ వాచ్ స్ట్రాప్ తెగిపోయింది. సో, కాన్వోకేషన్ రోజు నేను చేతికి వాచీ లేకుండానే వెళ్లాను.

ఫోటోలో నా ఎడమచేతి మణికట్టు దగ్గర బోసిగా ఆ గుర్తు కూడా కనిపిస్తుంది.  

చాలా ఏళ్ల తర్వాత, కనీసం ఇలాంటి గమ్మత్తయిన జ్ఞాపకాల్ని గుర్తుచేసిన నా గోల్డ్ మెడల్స్ అసలు విలువలేనివని నేననుకోను.

వాటికి చాలా విలువుంది!  

No comments:

Post a Comment