Sunday 22 March 2015

"మాభూమి" ఒక్కటే .. ఒక్కసారే!

"చరిత్రలో తెలంగాణ సాయుధపోరాటం ఒక్కసారే జరిగింది. అలాగే మాభూమి సినిమా నిర్మాణం కూడా!" - బి. నరసింగరావు

కొంతమంది అదృష్టవంతులుంటారు.

అంటే - ఏ గుళ్లూ గోపురాల మొక్కులతోనో, ఇంకేదో కనిపించని శక్తివల్లనో వీళ్లకు అదృష్టం వరిస్తుందని కాదు. ఉన్నవీ, లేనివీ అన్ని శక్తుల్నీ తమవైపు బైపాస్ చేయించుకొని, అందరూ చెప్పే ఆ అదృష్టాన్ని తమ దగ్గరికే రప్పించుకొంటారు వీళ్లు.

దీన్నే ఒకే ఒక్క ముక్కలో "కమిట్‌మెంట్" అనొచ్చుననుకుంటాను.

ఆ కమిట్‌మెంట్ ముందు 'వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో' అనే పనికిరాని ఊగిసలాటలు .. ఇల్లు, జాగా, డబ్బు, దస్కం .. ఏమీ నిలవవు. అష్టకష్టాలు పడ్డా సరే అనుకున్న పని అనుకున్నట్టు చేస్తారు ఈ అదృష్టవంతులు.

అలాంటి అదృష్టవంతుల్లో ఒకర్ని ఇవాళ గుర్తుకుతెచ్చుకోవడం చాలా అవసరమనిపిస్తోంది.

ఆ క్రియేటివ్ సోల్ పేరు - బి. నరసింగరావు.

1977లో తను 'ఏదో ఒకటి కొత్తగా చేయాలి' అనుకోకపోతే - ఆ తర్వాత మూడేళ్లకు, 1980 ఇదే మార్చి 23 నాడు, సరిగ్గా 35 ఏళ్ల క్రితం .. "మాభూమి" వచ్చేదే కాదు.

బి. నరసింగరావు ఆల్వాల్ సిండికేట్ బ్యాంక్‌లో ఇల్లు తాకట్టు పెట్టి లక్ష అప్పు తెస్తే, ఇంకో ప్రొడ్యూసర్ రవీంద్రనాథ్ ఏళ్లతరబడిగా దాచుకొన్న వాళ్ల వెడ్డింగ్ రింగ్స్ కూడా అమ్మేసి, వచ్చిన 700 రూపాయలతో మాభూమి సినిమా సెన్సార్ చేయించాడు!

అదీ .. అప్పట్లో వారు చేస్తున్న ఆ పని పట్ల .. ఆ సబ్జెక్ట్ పట్ల .. ప్రేమ, ప్యాషన్, నమ్మకం.

అదొక రెనగేడ్ కమిట్‌మెంట్!

మాభూమి సినిమా 1980లో వచ్చినపుడు నేను నిజంగా ఒక 'బచ్చా'ని. ఆ సినిమాను మొదటిసారి వరంగల్‌లోని కాకతీయ టాకీస్‌లో మార్నింగ్‌షో చూశాను. ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి అది.

ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను.

గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో బి.నరసింగరావు రూపొందించిన ఆ కలాఖండం గురించి, దాని మేకింగ్ గురించీ ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చు.

లారీ వెనక భాగంలో టార్పాలిన్ పట్టా మీద కూర్చొని, టీమ్ అంతా రోజూ షూటింగ్‌కు వెళ్లేదని విన్నాను. మీరూ వినే ఉంటారు బహుశా.

బండెనక బండికట్టే ఒక గద్దర్ పాట, పల్లెటూరి పిల్లగాడా అనే ఆర్ద్రమైన సంధ్య గొంతు, సాయిచంద్, శకుంతల, హంస .. చాలామంది నాకింకా గుర్తున్నారు.

బి. నరసింగరావు, గౌతమ్ ఘోష్‌లతో కలిసి .. మాభూమి చిత్రం కోసం చైతన్య చిత్ర ఇంటర్నేషనల్‌కు పనిచేసిన ఆ టీమ్ మొత్తానికి నా హాట్సాఫ్ .. సెల్యూట్ .. అన్నీ!

కట్ టూ తెలంగాణ ఉద్యమం --

ఎన్నోసార్లు పడుతూ లేస్తూ, నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి నింగినంటేలా  చేసిందీ, ఉద్యమ లక్ష్యం సాధించిందీ కూడా ఒక్కడే.

కె సి ఆర్.

బి. నరసింగరావుది సినిమా అయితే, కె సి ఆర్ ది జీవితం.

ఇద్దరినీ నడిపించింది ఒక్కటే.

సిన్సియర్ కమిట్‌మెంట్.

జయహో తెలంగాణ!  

2 comments:

  1. ఒక గొప్ప కళాఖండాన్ని గుర్తు చేసినందుకు థాంక్సండీ

    ReplyDelete
    Replies
    1. చదివినందుకు మీకు కూడా అభినందనలు..

      Delete