Tuesday 17 March 2015

40 నిమిషాల్లో ప్రోమో సాంగ్!


"సర్, లిప్సిక మధ్యహ్నం 2 గంటలకి రికార్డింగ్‌కి వస్తోంది" అని ప్రదీప్ కాల్ చేసి చెప్పాడు.

ఎక్కువ ఆలోచించే టైమ్ లేదు. ప్లాన్ చేసే టైమ్ అసలు లేదు. అప్పటికి జస్ట్ ఓ 2 గంటల టైమ్ ఉంది.

వెంటనే కార్తీక్ కి ఫోన్ చేశాను. షార్ట్‌కట్‌లో విషయం చెప్పాను. పాట రికార్డింగ్ మాత్రం ఉంది. నువ్వు రావాల్సిన అవసరం లేదు. కానీ, ఆ టైమ్‌లో కొంత వీడియో షూట్ చెయ్యాలనుకుంటున్నాను. నువ్వుంటే బావుంటుంది.. అని చెప్పాను.

ఇంకో విషయం కూడా చెప్పాను. షూట్ ఉండకపోవచ్చు కూడా. "ఒకవేళ అలాగానీ జరిగితే ఏమనుకోవద్దు" అన్నాను. స్టూడియో అడ్రస్, టైమ్ చెప్పాను.  

"నో ప్రాబ్లమ్ సర్. మనం కాసేపు కల్సి 'డిస్కస్' చేసినట్టు కూడా ఉంటుంది కదా. నేను వస్తున్నాను!" అన్నాడు కార్తీక్.

కట్ టూ హీరోయిన్ - 

ప్రియ పప్పా వశిష్ట గారికి ఫోన్ చేసేటప్పటికి ఆయన ఆ టైమ్‌లో విజయవాడలో ఉన్న విషయం తెలిసింది. ఆయన లేకుండా ప్రియ రావడం కుదరదు.

మఠాష్ అనుకున్నాను.

అయినా, విషయం చెప్పాను. ఓ అరగంట ప్రియ రావాలి. స్టూడియోలో చిన్న షూట్ ఉంది అని చెప్పాను.

ఆయన బిజినెస్‌మాన్. ఆ ఆలోచనా విధానం పూర్తిగా వేరు. నేను చేయాలనుకుంటున్న షూట్ ఇంపార్టెన్స్ ఆయన గ్రహించాడు. ఒక్కటే మాట చెప్పారాయన.

"నేను ప్రియకు ఫోన్ చేసి చెప్తాను. తనిప్పుడు ఎక్కడుంది.. ఏం చేస్తోంది.. అదంతా మాట్లాడే టైమ్ లేదు. ప్రియకు ఫోన్ చేసి, తనను రప్పించుకొని షూట్ పూర్తిచేసుకోండి. తర్వాత మళ్లీ తనని ఇంటిదగ్గర డ్రాప్ చేసే బాధ్యత మీదే. క్యారీ ఆన్!" అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు ప్రియ పప్పా.  

ప్రదీప్ నాకు ఫోన్ చేసి అప్పటికే అరగంట అయిపోయింది. ఇంకో గంటన్నరలో రికార్డింగ్!

ప్రియకు ఫోన్ చేశాను. ఎక్కడో మెహదీపట్నంలో ఏదో ముఖ్యమైన పనిలో ఉంది. విషయం చెప్పి ఆడ్రెస్ చెప్పాను.

"నేను వెంటనే వస్తాను సర్. కానీ మా కార్ రావడానికి టైమ్ పడుతుంది. ఎలా?" అంది ప్రియ.

నేను కారు పంపి, తను అంత దూరం నుంచి వచ్చేటప్పటికి ఈ ట్రాఫిక్‌లో ఇంక సాధ్యం కాదు అనిపించింది. ఐడియా డ్రాప్ అనుకున్నాను. కానీ .. ఏమైనా సరే చెయ్యాలి అనుకున్నాను.

"ప్రియా! నువ్వు కారు, క్యాబ్ అని అలోచించే టైమ్ లేదు. డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని సత్యం థియేటర్ దగ్గరికి వచ్చెయ్యి. అక్కడ నా కారుంటుంది. ఎక్కి స్టూడియోకి వచ్చెయ్యి!" అన్నాను.

ఆలోచించకుండా "స్టార్ట్ అవుతున్నాను, సర్!" అంది ప్రియ.

ఎంతయినా బిజినెస్‌మ్యాన్ కూతురు కదా .. స్పాట్ డెసిషన్!

కట్ టూ స్టూడియో -

పది నిమిషాలముందే సింగర్ లిప్సిక వచ్చింది. ప్రదీప్ తనతో కూర్చుని సాంగ్ కి ప్రిపేర్ చేస్తున్నాడు.

నేను సౌండ్ ఇంజినీర్ వేణు పక్కన కూర్చున్నాను. కార్తీక్ టైమ్‌కు వచ్చి అప్పటికే నా పక్కనే ఉన్నాడు. ప్రియ మాత్రం ఇంకా రాలేదు.

చూస్తుండగానే లిరిక్స్ తీసుకొని లిప్సిక లోపలికి వెళ్ళిపోయింది .. పాడటం కోసం. "స్టార్ట్ అవుతుంది ఇంక" అన్నట్టుగా ప్రదీప్ నావైపు చూశాడు.

"ఇంకా ప్రియ రాలేదేంటి!?" అన్నట్టుగా నన్ను సైగలతో అడిగాడు కార్తీక్.

అప్పుడే స్టూడియో డోర్ ఓపెన్ అయింది.

"హాయ్" అంటూ ప్రియ ఎంటర్ ..

టెన్షన్ రిలీఫ్ ..

కట్ టూ ది రెనెగేడ్ షూట్ -

అప్పటికే తన కెమెరాతో రెడీగా ఉన్న మా స్టిల్స్‌మ్యాన్ గంగాధర్ వీడియో తీయడం మొదలెట్టాడు.

సరిగ్గా 40 నిమిషాల్లో లిప్సిక పాడి వెళ్లిపోయింది. రికార్డింగ్ జరిగిన ఆ 40 నిమిషాల్లో .. స్టూడియోలో ఆవైపూ, ఈ వైపూ, నాకు కావల్సినన్ని షాట్స్ చక చకా తీసుకొని ప్యాకప్ చెప్పాను.

అలా  .. హీరో హీరోయిలకు ఎలాంటి మేకప్ లేకుండా, స్పెషల్ కాస్ట్యూమ్‌స్ లేకుండా, బులెట్ స్పీడ్‌లో తీసిందే మా "స్విమ్మింగ్‌పూల్" ప్రమోషనల్ సాంగ్. దాన్నే మా సినిమా ఆడియో రైట్స్ తీసుకొన్న 'నంబర్ వన్ ఆడియో కంపనీ' ఆదిత్య మ్యూజిక్ వాళ్లు మొన్నయూట్యూబ్‌లోకి ఎక్కించారు.

అదే ..

"డార్లింగ్  ఫీల్  మై  హార్ట్ .."   

No comments:

Post a Comment