Friday 20 February 2015

తోపుడు బండి

చందమామ, బాలమిత్ర, విజయ, విజయచిత్ర.. చిన్నతనంలో వీటితో నా పుస్తకపఠనం హాబీ ప్రారంభం.

తర్వాత సోవియట్ లాండ్, స్పుత్నిక్, గోర్కీ, టాల్‌స్టాయ్, పవుస్తోవ్‌స్కీ, రష్యన్ అనువాద కథలు, నవలలు ..

ఆ తర్వాత విశ్వనాథ వేయిపడగలు, దంతపుదువ్వెన, దిండుకింద పోకచెక్క లతో ప్రారంభమై .. చలం, పాలగుమ్మి, ఉన్నవ, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, వడ్డెర చండీదాస్, లత, రంగనాయకమ్మ, యధ్ధనపూడి, మాదిరెడ్డి, యండమూరి, మల్లాది ..

వీటన్నిటితోపాటు అటు క్రమం తప్పకుండా 'అరుణతార', 'సృజన'లూ, స్పార్టకస్‌లూ చదివాను.

మరోవైపు, ఇవి చదువుతూండగానే .. ఇంగ్లిష్‌లో అగాథా క్రిస్టీ, హెరాల్డ్ రాబిన్స్, జెఫ్‌రీ ఆర్చర్, రాబిన్ కుక్, ఫ్రెడరిక్ ఫోర్సిత్, టామ్ క్లాన్సీ, డాన్ బ్రౌన్ ..

అయితే వీటన్నిటితో సమాంతరంగా నేను పోయెట్రీ కూడా చదివాను. చాలా లిమిటెడ్‌గా. కీట్స్, షెల్లీ, కృష్ణ శాస్త్రి, తిలక్, శ్రీశ్రీ, కాళోజీ ..

అదంతా ఒక యుగం. స్వర్ణ యుగం.

ఆ రోజులతో పోలిస్తే ఇప్పుడు చదవటం పూర్తిగా తగ్గిపోయింది. అలాగని  చదవటం పూర్తిగా మానలేదు. చదువుతున్నాను, అప్పుడప్పుడూ: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, భగవద్గీత, ది పవర్ ఆఫ్ నౌ, ది ఆల్కెమిస్ట్, డాన్ పెనా, టిమ్ ఫెర్రిస్, లిసా రాన్‌కిన్ ..

కట్ టూ నా తొలి ప్రేయసి - 

పుస్తకమే నా మొట్టమొదటి లవర్. మర్చిపోవటం అంత ఈజీ కాదు. అసాధ్యం.

ఆమధ్య డిజిటల్ ఈ-బుక్స్ వచ్చాయి. తర్వాత అమెజాన్ కిండిల్ బుక్స్ వచ్చాయి. అయినా - నా తొలి ప్రేయసిని స్పర్శించిన ఆనందం వీటిలో లేదు. ఉండదు.

అలాంటి పుస్తకాల్ని సృష్టించే రచయితలు, కవులకు దురదృష్టవశాత్తూ మన దేశంలో పబ్లిషర్స్ నుంచి సరయిన ప్రోత్సాహం లేదు. తెలుగులో అయితే అసలు లేదు.

ఇప్పటివరకూ ఎవ్వరూ ఊహించని ఒక విలక్షణమైన కాన్‌సెప్ట్‌తో, దీన్ని బ్రేక్ చేయడానికి పూనుకున్నాడో సాహితీ ప్రియుడు, జర్నలిస్టు, బిజినెస్‌మాన్.

అతనే సాదిక్ అలీ. నా యూనివర్సిటీ మిత్రుడు.

అతని కాన్‌సెప్టే ఈ "తోపుడు బండి".

రేపు ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుండి కదులుతున్న ఈ తోపుడు బండి తప్పకుండా ఓ పాజిటివ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అయితే ఇది అక్కడితోనే ఆగిపోకుండా, జిల్లాకో తోపుడు బండి వచ్చేలా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

అక్కడితోకూడా ఆగిపోకుండా - మరో బార్న్స్ అండ్ నోబెల్, అమెజాన్ స్థాయి పుస్తక ప్రచురణ కేంద్రంగా ఎదగాలని ఆశిస్తున్నాను.

జయహో సాహిత్యం! జయహో పుస్తకం!! 

No comments:

Post a Comment