Tuesday 26 August 2014

అసలేందీ సింగపూర్, కె సి ఆర్?

"ప్రపంచంలోని 193 దేశాల్లో ఈ సింగపూర్ ఒక్కటే దొరికిందా వీళ్లిద్దరికీ?" అనుకుంటూ నా లిస్ట్ లోంచి సింగపూర్‌ని కొట్టేశాను. ఇంచుమించు ఇదే అర్థంలో సరదాగా ఓ ట్వీట్ కూడా పెట్టాను ఈ ఉదయమే.

కానీ, ఇప్పుడు ఈ బ్లాగ్‌లో రాస్తున్నది మాత్రం సరదాగా కాదు.

సుమారు రెండు దశాబ్దాలనుంచీ ఈ సింగపూర్ జపం వింటూనే ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని వివిధకోణాల్లో సింగపూరూ, ఆయన పేరూ దాదాపు పర్యాయపదాలయిపోయాయి.

రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తానని పదే పదే అనడం ఒక కోణం కాగా, ఆయనకు సింగపూర్లో ఓ పెద్ద హోటల్, బోల్డన్ని ఆస్తులున్నాయని ఆరోపణలుండటం ఇంకో కోణం. నిజానిజాల విషయం పక్కనపెడితే - ఇవన్నీ వినీ వినీ సింగపూర్ అంటేనే ఒక రకమైన విరక్తి ఏర్పడింది. నా ఒక్కడికే కాదు .. చాలా మందికి!


కట్ టూ కె సి ఆర్ సింగపూర్ విజిట్ -  

ఇంతకు ముందెన్నడూ విదేశీయానం చేయని కె సి ఆర్ కు, సి ఎం గా తొలి విదేశీ పర్యటన సింగపూర్ కావటం కేవలం యాదృచ్చికం. సింగపూర్‌లోని ఐ ఐ ఎం "అలుమ్ని" నుంచి అలా ఆహ్వానం రావడం, ఇలా ఓకే అని వెళ్లడం చకచకా జరిగిపోయాయి.

పనిలో పనిగా పక్కనే ఉన్న మలేషియా కూడా ఒక రౌండ్ వేసి వచ్చారు కె సి ఆర్.

అయితే, అందరూ అనుకుంటున్నట్టుగా - ఏదో సింగపూర్ అనగానే చంకలు గుద్దుకుంటూ ఫ్లైట్ ఎక్కలేదు కె సి ఆర్.

సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ రాసిన "సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వర్‌ల్డ్ టూ ఫస్ట్" పుస్తకాన్ని సుమారు 20 ఏళ్లక్రితమే చదివారు కె సి ఆర్. మామూలు నిరుపేద మూడో ప్రపంచదేశం స్థాయి నుంచి, ప్రపంచంలో ప్రథమశ్రేణి దేశంగా ఆ దేశం ఎలా ఎదిగిందో ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఆయనకు. ఈ నేపథ్యంలోనే, బహుశా, సింగపూర్ విజిట్‌కు వెంటనే ఓకే చెప్పి చెప్పుంటారు కె సి ఆర్.  

అది 1993 అనుకుంటాను. అప్పుడు నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నాను ..

18 ఏళ్ల ఒక అమెరికన్ టీనేజర్ స్టూడెంట్ సింగపూర్‌లో చేసిన ఓ చిన్న నేరానికి అతన్ని జైల్లో పెట్టారు. ఆ కుర్రాడు చేసిన నేరం ఏంటంటే - దొంగతనంగా ఓ నాలుగయిదు కార్లకి రెడ్‌కలర్ పెయింట్‌ను స్ప్రే చేయడం!  

ఆ అమెరికన్ కుర్రాడి పేరు పీటర్ ఫే.

పీటర్ చేసిన నేరానికి సింగపూర్ ప్రభుత్వం ఆ దేశ చట్టాల ప్రకారం 4 నెలల జైలు, సుమారు 2 వేల డాలర్ల జరిమానా, ఓ 6 బెత్తం దెబ్బల శిక్ష విధించింది.

1993-94 ల్లో ప్రపంచమంతా ఈ సంఘటనపైనే కొన్ని రోజులపాటు హెడ్‌లైన్సూ, బ్రేకింగ్ న్యూస్‌లు! అమెరికా ఈగో తట్టుకోలేకపోయింది. "ఇది చాలా అతి" గా అభివర్ణించింది అమెరికా.

చివరికి అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సింగపూర్ గవర్నమెంటుకు ఒక లేఖ రాస్తూ, ఆ బెత్తం దెబ్బలయినా మినహాలించాలని కోరాడు. క్లింటన్ కోరికను మన్నించి, సింగపూర్ ప్రభుత్వం పీటర్ ఫే శిక్షను 6 బెత్తం దెబ్బల నుంచి 4 బెత్తం దెబ్బలకు తగ్గించింది! జైలు శిక్ష, జరిమానా మాత్రం యథాతథం!!

దటీజ్ సింగపూర్!

అమెరికా అయినా, అంగోలా అయినా సింగపూర్‌కు ఒక్కటే. వారి చట్టాలు మారవు. అవి ఎవరికీ చుట్టం కావు. అంత క్రమశిక్షణ, చిత్తశుధ్ధి ఉన్నాయి కాబట్టే .. వైశాల్యంలో ఎంతో చిన్న దేశమయినా 'పర్ క్యాపిటా'లో ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని కూడా చేరుకోగలిగింది.

తన తొలి విదేశీ పర్యటనలోనే సింగపూర్‌ని అధ్యయనం చేసే అవకాశం కె సి ఆర్ కు రావడం కాకతాళీయమే అయినా ఒక రకంగా సందర్భోచితం. తెలంగాణ తొలి సి ఎం గా, తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్న ఈ దశలో సింగపూర్‌ను ఒక మోడల్‌గా తీసుకొని, ప్రణాలికల్ని వేసుకొని పనిచేయడం, చేయించడం కె సి ఆర్ కు తప్పక ఉపయోగపడుతుంది.

కనీసం త్రాగు నీరు కూడా దొరకని సింగపూర్‌లో, మిగిలిన వనరుల లభ్యత కూడా అతి స్వల్పం. ఒక్కోదానికి ప్రపంచంలోని ఒక్కో దేశంపైన ఆధారపడిన దేశం సింగపూర్. కేవలం 276 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశ జనాభా 54 లక్షలు మాత్రమే. అయినా - ఒక స్పష్టమైన విజన్‌తో, డెడ్‌లైన్‌లతో కూడిన లక్ష్యాలతో ఎంతో వేగంగా అభివృధ్ధి చెందింది సింగపూర్.

మరి వైశాల్యంలోనూ, జనాభాలోనూ, వనరుల్లోనూ ఎన్నోరెట్లు అధికంగా ఉన్న మన దేశంలో ఈ అభివృధ్ధి ఎందుకు సాధ్యం కాలేదు?

కనీసం ఇప్పుడు మన తెలంగాణలో ఈ అభివృధ్ధి ఎందుకు సాధ్యం కాదు?

చేస్తే అవుతుంది. అయితీరుతుంది.

మనకంటే 18 ఏళ్లు ఆలస్యంగా, 1965 లో స్వాతంత్ర్యం సంపాదించుకున్న సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ చేసిన కృషికి ఫలితం, ప్రతిరూపం ఇప్పటి సింగపూర్.

తెలంగాణ తొలి సిఎం కె సి ఆర్ ఇప్పుడలాంటి బాధ్యతను, ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిధ్ధమయ్యారు. సాక్షాత్తూ ఇప్పటి ప్రధాని లీ సీన్ లూంగ్ తోనే తన మంత్రులకు, ఎమ్మెల్లేలకు, ఎమ్‌పీలకు, అధికారులకు శిక్షణ ఇప్పించడానికి పూనుకున్నారు కె సి ఆర్.

సింగపూర్ ఐ ఐ ఎం అలుమ్ని కార్యక్రమంలో సిఎం కె సి ఆర్ చేసిన ఒకే ఒక్క ప్రసంగంతో, అప్పటికప్పుడు 3 అంతర్జాతీయ కంపెనీలు తమ మెగా ప్రాజెక్టులతో ముందుకు వచ్చాయి. వందలాది ఇతర కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి. వాటిల్లో కనీసం 10 శాతం సక్సెస్ అయినా అది కె సి ఆర్ కు గొప్ప విజయమే!

ఉద్యమం అయిపోయింది .. తెలంగాణ వచ్చింది.. అని ఊరుకోకుండా, అదే ఉద్యమ స్పూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం విషయంలోనూ తెలంగాణ ప్రజలంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

ఊరికే విజన్ అంటూ దశాబ్దాలు మాటలతోనే వృధా చేయకుండా - అవసరమయితే తెలంగాణ పునర్నిర్మాణాన్ని కూడా ఒక ఉద్యమంలా మలచగల శక్తియుక్తులు దళపతి కె సి ఆర్ కున్నాయి. ఆయన అలా తప్పక చేస్తారని ఆశిద్దాం.

చేస్తారు కూడా! 

2 comments: