Wednesday 9 July 2014

ఉద్యమనాయకుడే ముఖ్యమంత్రి అయితే!

"తెలంగాణ వచ్చుడో .. కె సి ఆర్ సచ్చుడో!"
"కామారెడ్డిలో చెల్లని రూపాయి .. ఎల్లారెడ్డిలో చెల్లుద్దా?"
"గాడిదలకు గడ్డేసి, ఆవులకు పాలు పిండితే వస్తయా?"
"పందిలెక్క పదేళ్లు బతకడంకన్నా, నందిలెక్క నాలుగురోజులు బతికితే చాలు!"
"లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే!"
"తంతే లేవనోడు గోకితే లేస్తాడా?"
"దొంగది కాదు..దొడ్లకు రాదు!"
"మాంసం తింటానం అని బొక్కలు మెడలేసుకుంటామా?"
"దున్నపోతుకు తెల్లరంగేస్తే ఆవు అవుతదా?"
"కత్తి ఒకనికిచ్చి యుధ్ధం ఒకన్ని చెయ్యమంటె అయితదా?"
"కొసదాక కొట్లాడెటోడె సిపాయి!"

ఇలాంటి లెక్కలేనన్ని అచ్చ తెలంగాణ సామెతల్ని సందర్భోచితంగా, అవలీలగా పేల్చడంలో కె సి ఆర్ తర్వాతే ఎవరయినా!

మొన్నటిదాకా కె సి ఆర్ స్పీచ్ అంటేనే ఒక ఫిరంగుల మోత. ఒక సునామీల సీరీస్. మరిప్పుడో?

ఇప్పుడలాంటివేం లేవు.

కంచె అవతలనుంచి ఎన్ని కవ్వింపు చర్యలు జరుగుతున్నా పెద్ద రియాక్షన్ లేదు. ఢిల్లీ స్నేహంతో పరోక్షంగా అవతలివాళ్లు ఆర్డినెన్సులు తెచ్చుకుంటున్నా, ఇంకేదేదో చేస్తున్నా ఇదివరకటిలా రెచ్చిపోవడంలేదు.

ఇప్పుడు కె సి ఆర్ రెచ్చిపోడు.

ఇప్పుడాయన ఉద్యమనాయకుడు కాదు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ఆ స్థాయిలో ఎలా స్పందించాలో అలాగే స్పందిస్తున్నాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు.

కాకపోతే కె సి ఆర్ స్టైల్ కె సి ఆర్ దే.  

తెలంగాణ ఏర్పాటు, తదనంతర పరిణామాల రాజకీయ చదరంగంలో - ప్రత్యర్థి ఎత్తులు కూడా పది స్టెప్పులు ముందే వేసుకుని, చెక్ మీద చెక్ పెట్టి, అందర్నీ ఒక ఆట ఆడి అవతలపడేసిన కార్పోవ్, కాస్పరోవ్, ఆనంద్.. అన్నీ అతనే.

ఒక్క కె సి ఆర్.

అందుకే చుట్టూ తాటాకు చప్పుళ్లు వినిపిస్తున్నా, కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఉద్యమం నాటి ఆయన మాటల ప్లేస్‌లో బుల్డోజర్లు పనిచేస్తున్నాయి. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సింబాలిక్‌గా ఆయన లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుపుతున్నాయి.

ఒక ఉద్యమనాయకుడు ఒక రాష్ట్రాధినేత అయ్యాడు. ఒక రియల్ స్టేట్స్‌మన్ అయ్యాడు.

60 ఏళ్ల తెలంగాణ లక్ష్యాన్ని ఛేదించిన కె సి ఆర్ ముందు ఇప్పుడో బ్లూప్రింట్ ఉంది. అది బంగారు తెలంగాణ బ్లూప్రింట్. ఇప్పుడాయన ఏకాగ్రతంతా దానిపైనే. దాన్నెలా, ఎంత తొందరగా నిజం చేయాలన్నదానిపైనే.

అదే లేజర్ ఫోకస్.

ఆ లేజర్ ఫోకస్ ముందు ఏ కవ్వింపులూ ఎందుకూ పనికిరావు. ఇది అందరికీ తెలిసిన నిజమే. ముఖ్యంగా తెలియాల్సినవాళ్లకి!   

No comments:

Post a Comment