Friday 4 July 2014

రూలర్ సాదిక్!

"పోలవరం కట్టేది లేదు.
మేము కదిలేది లేదు.
మా ప్రాంతాన్ని వదిలేది లేదు.
అడవితల్లి మీద ఆన!"

ఫేస్‌బుక్‌లో ఇలాంటి పోస్టుల్ని రాయడం గానీ, షేర్ చేయడం గానీ అంత మామూలు విషయమేం కాదు.

కానీ, ఈ మధ్యకాలంలో ఇదే ఆయన దినచర్య అయి కూర్చుంది. చూస్తుండగానే.. ఈ విషయంలో ఆయనే మరో మేథాపాట్కర్ అయినా ఆశ్చర్యం లేదు.

పోలవరం ప్రాజెక్టు, ఆ ప్రాంతపు ఆదివాసీల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తూ ఇటీవలే దానిమీద తెచ్చిన ఆర్డినెన్స్ ఆయన్ని అలా మార్చివేశాయి.

ఇదొక్కటేనా...

ఇలాంటి ఎన్నో సామాజిక సమస్యలపట్ల నిద్రాహారాలు మానుకొని, నిరంతర మథనం చేస్తుంటాడాయన. అలాంటివాడు కాబట్టే - ఫేస్‌బుక్‌లో ఆయనకు పెట్టే జన్మదిన శుభాకాంక్షలు ఇలా కూడా ఉంటాయి:

"బడుగు జీవుల వ్యథను తీర్చాలనే మీ ఆరాటం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనీ, మీకు విజయం కలగాలనీ ఆశిస్తూ.. మీకివే జన్మదిన శుభాకాంక్షలు!"

మీడియాలోని దాదాపు అన్ని రూపాల్లో, విభాగాల్లో, ఇతర వ్యాపారాల్లో.. చివరికి, స్పిరిచువాలిటీలోనూ మునిగితేలిన ఈ మిత్రుడు నాకు యూనివర్సిటీలో ఒక సంవత్సరం సీనియర్.

దాదాపు పాతికేళ్లక్రితం - యూనివర్సిటీ నుంచి ఒరిస్సా వెళ్లినప్పటినుంచీ మా స్నేహం ఇంకా కొనసాగుతోందంటే ఆశ్చర్యం లేదు. మా స్నేహంలోని ఆ సౌరభం ఖచ్చితంగా నా మిత్రునిదే.

1987 లో తొలిసారిగా "ఉదయం" దినపత్రిక తిరుపతి ఎడిషన్లో నా మిత్రుడిదగ్గర ట్రైనీ సబ్-ఎడిటర్‌గా చేరిన కట్టా శేఖర్ రెడ్డి ఈ రోజు "నమస్తే తెలంగాణ" దినపత్రిక ఎడిటర్ కావడం ఆయన చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతాడు.

యూనివర్సిటీలో ఆయన పి డి ఎస్ యు నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన జెండాలు మోసిన సహచరులు.. ఇప్పుడు ప్రెస్‌లోనూ, రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ రకరకాల ఉన్నత స్థానాల్లో ఉండటం విశేషం.

కొన్ని నెలల్లో మరణిస్తుందని తెలిసిన కన్నతల్లికోసం - సుమారు ఆరు నెలలపాటు అన్నీ వదులుకొని, ఇంటికే పరిమితమై.. ఆ కన్నతల్లికి అన్ని సపర్యలూ చేసి, అన్నీ తానే అయి.. కడదాకా కంటికిరెప్పలా చూసుకున్న నా మిత్రుడి వ్యక్తిత్వం గురించి ఏం చెప్పను?

కట్ టూ కర్టెన్ రెయిజర్ -  

ఇటీవలే ఫేస్‌బుక్‌లోకి ఎంటరయిన నా మిత్రుడి గురించి ఈ 9 మినిట్ బ్లాగ్‌లో అంతా ఎలాగూ చెప్పలేను. కొంతయినా మీతో పంచుకుందామనే ఈ పోస్టు. నేనెంతో గర్వంగా ఫీలయ్యే ఈ మిత్రుడు అతి త్వరలో ఓ మేగజైన్ ప్రారంభిస్తున్నాడు.

నన్ను ఎప్పుడూ "సోదరా" అనో, "మనూ" అనో పిలిచే నా ఈ మిత్రుడు మరెవరో కాదు.

సాదిక్.

ఇంక నా మిత్రుడు ప్రారంభించబోతున్న మేగజైన్ పేరు, అది సాధించబోయే సంచలనం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను!  

No comments:

Post a Comment