Sunday 13 July 2014

జాకీ కాలిన్స్ అఫ్ ఇండియా

నాకత్యంత ఇష్టమైన అతికొద్దిమంది మన ఇంగ్లిష్ కాలమిస్టులు, నవలారచయిత్రుల్లో శోభా డే ఒకరు.

"సోషలైట్స్", "పేజ్ త్రీ పీపుల్" వంటి పదాల్ని, వ్యక్తుల్ని, వారి జీవనశైలి, వారి ఇతర వ్యవహారాల గురించి మొట్టమొదటగా నేను శోభా డే రచనల ద్వారానే తెలుసుకున్నాను.

దాదాపు ఆమె ప్రతి నవలలోనూ ఈ బ్యాక్‌డ్రాప్ ఎంతో కొంత ఉంటుంది.

తగినంత సెక్స్ కోటింగ్ కూడా ఆమె రచనల్లో ఒక అత్యంత సహజమైన విషయం.

ఒక మోడల్‌గా, ఫ్రీలాన్స్ రైటర్‌గా, నావెలిస్ట్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా.. ఆమె జీవితం మొత్తం పేజ్ త్రీ లైఫ్ స్టయిల్లోనే కొనసాగింది. ఇంకా కొనసాగుతోంది. బహుశా ఆమె రచనల్లో ఈ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణమై ఉండొచ్చు.  

ఒక రచయిత్రిగా తన రచనల్లో ఎలాంటి హిపోక్రసీ లేకుండా సెక్స్‌ని కూడా అలవోకగా, అద్భుతంగా రాస్తుంది కాబట్టే శోభా డే ని "జాకీ కాలిన్స్ ఆఫ్ ఇండియా" అంటారు కొంతమంది.  అయితే - ఈ పోలిక నాకు అస్సలు నచ్చని విషయం. శోభా డే రచనలతో పోలిస్తే జాకీ కాలిన్స్ రచనలు అత్యంత తక్కువ స్థాయి ఫిక్షన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం.

మనవాళ్లు చాలా మంది శోభా డే రచనల్ని చాలా లైట్‌గా తీసుకుంటారు. కారణం బహుశా.. ఒక కాలమిస్ట్‌గా ఆమె రాసే నిర్మొహమాటపు రాతలు. అయితే - అనేక విదేశీ యూనివర్సిటీల్లో శోభా డే నవలలమీద పరిశోధనలు జరిగాయన్న విషయం బహుశా మనవాళ్లలో చాలామందికి తెలియదు.

ఇటీవల వచ్చిన రెండు మూడు తప్ప - శోభాడే రచనలన్నీ నేను చదివాను. సొషలైట్ ఈవెనింగ్స్, స్టారీ నైట్స్, స్ట్రేంజ్ ఆబ్సెషన్ నవలల్ని నేనింకా మర్చిపోలేదు.

ఆమె రాసిన నాన్ ఫిక్షన్‌లో నన్ను బాగా ఆకట్టుకున్నది "సెలెక్టివ్ మెమొరీ". ఆమె జీవితంలోని ఎన్నిక చేసిన కొన్ని జ్ఞాపకాలన్నమాట!

అన్సర్టెయిన్ లైజన్స్ ఒక్కటి తప్ప - శోభా డే రాసిన 20 పుస్తకాల టైటిల్సూ ఇంగ్లిష్‌లో "ఎస్" అక్షరంతోనే ప్రారంభమవుతాయి. బహుశా ఆమె సెంటిమెంటేమో!  

కట్ టూ శోభా డే 66 ప్లస్ - 

శోభా డే వైవాహిక జీవితం కూడా ఒక అద్భుతం అనే చెప్పాలి. తను మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. తర్వాత తనలాగే విడాకులు తీసుకున్న దిలిప్ డే ని వివాహం చేసుకుంది. అప్పటికే ఇద్దరికీ రెండు వైపుల నుంచీ ఇద్దరు చొప్పున పిల్లలున్నారు. ఆ తర్వాత వారిద్దరికీ మరో ఇద్దరు పుట్టారు. "నీ పిల్లలు,నా పిల్లలు, మనిద్దరి పిల్లలు" స్టోరీ అన్నమాట!

గొప్ప విషయమేంటంటే - మొత్తం ఆరుగురు పిల్లలూ వారిద్దరిదగ్గరే, ఒక్కచోటే పెరిగారు.

జీవితం పట్ల, జీవనశైలి పట్ల అత్యంత మమకారం, ప్రేమ, వ్యామోహం ఉన్న స్త్రీలు ఎప్పుడూ నవయవ్వనంతోనే ఉంటారని ఎక్కడో చదివాను. ఈ విషయంలో శోభా డే ముందు వరసలో ఉంటారు.

66 ఏళ్లు దాటినా, శోభా డే ఇంకా చాలా క్రేజీగా కనిపిస్తుంది.. ఉంటుంది.. అనుక్షణం అలా జీవిస్తుంది. ఒక ఫ్రీలాన్స్ రైటర్‌గా, నావెలిస్టుగా తను అనుకున్నది రాస్తుంది. ఇంకా రాస్తోంది.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - ఒకవైపు ప్రొఫెషనల్ రైటర్‌గా సోషలైట్ జీవితంలో మునిగితేలుతూ, మరోవైపు కుటుంబంలో సంస్కృతి, సంప్రదాయాల్ని అత్యున్నతస్థాయిలో పాటించడం కూడా ఒక్క శోభా డే కే చెల్లింది.

అంత సులభం కాని, అసాధారణమైన ఆ బ్యాలెన్స్.. ఒక్క ఆమె వల్లనే సాధ్యమైంది.  

No comments:

Post a Comment