Thursday 10 July 2014

తెలంగాణ సినిమా ఐకాన్!

బి. నరసింగరావు.

కవి, రచయిత, చిత్రకారుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు, ఉద్యమకారుడు.. ఇంకెన్నో రంగాల్లో కొత్తబాటలు వేసిన సృజనశీలి.

ఆయన రూపొందించిన "మాభూమి", "రంగులకల", "దాసి" సినిమాలు లేకుండా తెలంగాణ సినిమా లేదు.

నా మిత్రుడు గుడిపాటి "పాలపిట్ట" తెలంగాణ ప్రత్యేక సంచికలో బి. నరసింగరావు ఇంటర్వ్యూ ఇప్పుడే చదివాను. ఆయన గురించీ, ఆయన రూపొందించిన ఒక్కో సినిమా గురించీ ఒక్కో పుస్తకమే రాయొచ్చు. బ్లాగ్‌లో ఏం రాస్తాను?

అందుకే నేనేం రాయట్లేదు. కేవలం ఆ ఇంటర్వ్యూలోని ఆయన మాటల్ని, ఆలోచనల్ని కొన్నింటిని మాత్రం ఇక్కడ కోట్ చేస్తున్నాను.

ఇలా కోట్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. తెలంగాణ అవతరణ తర్వాత, ఒక చారిత్రక అవసరంగా కూడా భావిస్తున్నాను.

కట్ టూ బి.నరసింగరావు -

> మృణాల్ సేన్ గారిని "మాకు ఫిల్మ్ చేయాలి మీరు" అంటే, "ఎంత మీ బడ్జెట్?" అని అడిగారాయన. లక్షరూపాయలని చెప్పాను. నిజానికి అవికూడా లేవు. ఇల్లు తనఖాపెట్టి తేవాల్సిందే తప్ప!

> ప్రభాకర్‌రెడ్డి డైరెక్టర్ శంకర్ (జై బోలో తెలంగాణ) కు చెప్పిన నీతేమిటంటే - "నేను తెలంగాణవాణ్ణి" అంటే నీకిక్కడ అవకాశాలు దొరకవు. వాళ్లతో ఉండి నేర్చుకుని పైకి రావాలి తప్పిస్తే వేరే గత్యంతరం లేదు. నేనూ అలాగే వచ్చాను.

> ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రావారి చేతిలో ఉంది. వాళ్లు మేము సీమాంధ్రకు చెందినవారం అని అనుకోరు. Cinema is a business to them.

> తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవారందరికీ ఉన్న ఎగ్జిస్టెన్స్ సమస్యవల్ల తెలంగాణ భాష, యాసల్ని పట్టించుకునే వీలు కుదర్లేదు. అలాగే హీరో కాంతారావు కూడా. అతనిది నల్గొండ జిల్లా కోదాడ. ఆ తర్వాత శంకర్ వచ్చి "ఎన్‌కౌంటర్", "శ్రీరాములయ్య" లాంటి సినిమాలు తీశాడు. నిలదొక్కుకోవడం ఎవరికయినా ముఖ్యమే కదా!

> నాకూ, మిగిలినవాళ్లకు తేడా ఏమిటంటే - నేను నా డబ్బుతో సినిమాలు తీశాను. ఇంకొకళ్లమీద ఆధారపడలేదు. ఈ కథ నడుస్తుందా, ఈ భాష పర్వాలేదా అన్న సమస్య రాలేదు.  

> ఒకసారి పి వి నరసిం హారావు గారితో "దాసి" సినిమాలో అతిగా చూపించానా అని అడిగినప్పుడు ఆయనొక మాటన్నాడు. "నేను జీవితంలో చూసినదాంట్లో 15 శాతం మాత్రమే నువ్వు చూపించావు" అని.  

> ఇక తెలంగాణ వచ్చిన తర్వాత జరగబోయేదేమిటంటే - శంకర్ లాంటి దర్శకులు లీడ్ తీసుకుంటారు. నాలాంటివాళ్లు వెనక బెంచ్‌లో ఉంటారు.

> ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నా ఆలోచన ఏమిటంటే - ఇప్పుడున్న కమర్షియల్ ధోరణిలో కాకుండా గురుదత్, మహబూబ్‌ఖాన్, నితిన్ బోస్ లాంటి ఒక జనరేషన్ ఎలా వచ్చిందో, రాజ్ కపూర్, బిమల్ రాయ్ వంటివాళ్లు ఎలా రూపొందారో పరిశీలిస్తే.. వారిలో ఉండే కమిట్‌మెంట్ మంచి సినిమాకు ఎలా దారితీసిందో అర్థమవుతుంది.  

No comments:

Post a Comment