Saturday 10 May 2014

జూన్ 2 తర్వాత ..

ముందుంది ఏదో పండగ అన్నట్టు .. జూన్ 2 తర్వాత నుంచి రెండు తెలుగు ప్రాంతాల్లోని వ్యవస్థలు, వృత్తులు, వ్యాపారాలు, వ్యక్తుల జీవితాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మార్పులు జరుగుతాయని నాకనిపిస్తోంది.

"జూన్ 2 సరే, ఈ మే 16 కే కదా అందరి జాతకాలు తెలిసేది?" అని మీరు అనొచ్చు. అయితే - ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా, ఎవరు సీ ఎం గా వచ్చినా - జరగాల్సింది జరిగిపోయింది. విడిపోవడం విడిపోవడమే. లెక్క లెక్కే!

అడుగూ బొడుగూ - "ఫోలవరం ముంపు గ్రామాలు" లాంటి కొన్ని సమస్యలుంటాయి. రగులుతూ.

ఆదీ అంతం లేకుండా అవి అలా సాగుతూనే ఉంటాయి. మోక్షం ఎప్పుడో ఇప్పుడే ఎవరేం చెప్పలేరు. చేయలేరు. ఇలాంటి నేపథ్యంలోంచే కొత్తగా మరికొందరు మేథా పాట్కర్‌లు పుడతారు.

కట్ టూ సినిమా ఇండస్ట్రీ - 

'ఈ ఇండస్ట్రీలో కూడా పెద్ద తేడా ఉండకపోవచ్చు.. ఉండదు'.. అని సీనియర్ సినీరంగ ప్రముఖులు, స్టుడియోల అధినేతలు, వాళ్లూ వీళ్లూ అంటున్నారు. అదంతా మేకపోతు గాంభీర్యమే అని నాకనిపిస్తోంది. లేదంటే, లోపల్లోపల ఏమయినా ఒప్పందాలున్నాయో తెలీదు.

అక్కడ, (కొత్త) ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సినీ ఇండస్ట్రీకి చాలా వరాలిస్తారు. టాక్స్ దాదాపు ఉండదు. ఎట్ లీస్ట్ కొంతకాలం వరకు. అప్పుడు కూడా హైదరాబాద్‌ని పట్టుకునే వేలాడతాం అని ఏ బిజినెస్ మ్యాన్ కూడా అనుకోడు.

ఈ కోణంలో చూస్తే - ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిన పెద్ద తలకాయలు కొన్నయినా అటు వైజాగ్‌కో, మరోచోటకో వలస వెళ్లితీరతాయి. హైదరాబాద్‌కి  గుడ్‌బై చెప్తూ!

మిగిలిన కొద్దిమంది పాతకాపులకి ఇంతకుముందులా బిజినెస్ ఉండే అవకాశంలేదు. ఎందుకంటే - కొత్తగా రూపొందే/మార్పులుపొందే తెలంగాణ ఫిలిం చాంబర్, అసోషియేషన్లు, యూనియన్లు ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతాయో, ఎలాంటి కొత్త శకానికి నాంది పలుకుతాయో ఇప్పుడే చెప్పలేం.

కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ తీసుకొనే నిర్ణయాలు, రూపొందించే మార్గదర్శకాలమీద ఇక్కడి సినీ ఇండస్ట్రీలోని చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇదే నిజం. జూన్ 2 తర్వాత నుంచే ఇక్కడ అసలు సినిమా మొదలవుతుంది. 

1 comment:

 1. నేను ఊహిస్తున్న మరికొన్ని పరిణామాలు :-

  ౧. ఏ ప్రదేశాన్ని కొత్త రాజధానిగా ఎంచుకున్నా అది ఆంధ్రాలో మరో హైదరాబాద్ గా రూపొందే అవకాశం ఇప్పట్లో లేదు కనుక ఆంధ్రాజనం విద్యా-వృత్తి-వ్యాపారాల నిమిత్తం లక్షలాది, మిలియన్లాది సంఖ్యలో ఇతర రాష్ట్రాలకో, దేశాలకో వలసలు కట్టడం మొదలుపెడతారు.

  ౨. పన్నులు ఎగ్గొట్టడమే జీవన విధానంగా మలుచుకున్న మన ఆంధ్రా ఏరియాకి ఏటా 15 - 20 వేల కోట్ల లోటుబడ్జెట్ ఏర్పడబోతోంది. గత రికార్డుని బట్టి కేంద్రప్రభుత్వం మనకొక్క పైసా కూడా విదిలించదు కనుక ఆంధ్రప్రభుత్వం తన ప్రజలకు ఏమీ చేయజాలదు. బాబొచ్చినా, జగనొచ్చినా ఈ పరిస్థితిలో మార్పు ఉండదు. ఏ ప్రాజెక్టులూ పూర్తయ్యే పరిస్థితి ఉండదు, కనుక రైతులూ, ఇతర వర్గాలూ కూడా భారీగా వలసపోతారు.

  ౩. ఎక్కడ రాజధాని పెట్టినా దానితో పోల్చుకుని అన్ని జిల్లాలలోనూ స్థలాల ధరల్ని కొండెక్కిస్తారు. అందువల్ల ఆంధ్రాజనానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న స్థలాలు కూడా ఆ తరువాత ముట్టుకోవడానిక్కూడా శక్యం కాని విధంగా మారిపోతాయి.

  60 ఏళ్ళపాటు హైదరాబాదు మీద సర్వశక్తులూ ధారపోసి అన్యాయంగా అక్కణ్ణుంచి గెంటించుకున్న ఆంధ్రా ఏరియా జీవితం అన్నివిధాలా దుఃఖమయంగా కనిపిస్తుంది. ఈ అవాంఛిత దుఃఖాన్ని 5 కోట్ల మంది ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దిన వ్యక్తినీ, పార్టీనీ బహుశా వారెన్నటికీ క్షమించలేరేమో.

  ReplyDelete