Monday 31 March 2014

శ్రీజయ నామ సంవత్సర పంచాంగ శ్రవణమ్!

హాఫ్‌వే ఎటాక్.
అంటే, డైరెక్టుగా పాయింట్‌లోకే అన్నమాట ..

రాజకీయరంగం:

కేంద్రంలో బీజేపి అలయెన్స్ ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు. సీమాంధ్రలో బాబు స్వీప్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో టీఆరెస్ ప్రభుత్వం వస్తుంది. ముఖ్యమంత్రి: నో డౌట్.. కె సి ఆర్!

మొత్తం మీద గత అయిదేళ్లతో పోలిస్తే - రాజకీయ నాయకులనుంచి, ప్రభుత్వాలనుంచీ ప్రజలకు మెరుగయిన సేవలు అందుతాయి. ఏం చేస్తే పేరొస్తుందో, ఏం చేస్తే ఉన్న పేరు ఊడ్చిపెట్టుకుపోతుందో ఇప్పుడు రాజకీయనాయకులకు, పార్టీలకు బాగా తెలిసిపోయింది కాబట్టే.. ఈ మార్పు!

పోతే, ఏ మాత్రం స్పష్టత లేకుండా, "డ్రెస్ రిహార్సల్స్"లా వచ్చిన చిన్నా చితకా పార్టీలు .. ఎలా వచ్చాయో అలాగే కనుమరుగయిపోతాయి.

ఆర్థిక రంగం:

మోడీ ప్రధాని అవుతాడన్న సర్వేలతో, ఆ తర్వాత ఆయన ప్రధాని అయ్యాక కూడా .. స్టాక్ మార్కెట్లో బుల్స్, బేర్స్ రెట్టించిన ఊపుతో ముందుకు దూసుకెళ్తుంటాయి. ఇండెక్స్ ఊహించని విధంగా పైపైకే వెళ్తుంటుంది.

అంతర్జాతీయ విఫణిలో మన రూపాయి విలువ ఊహించనంతగా పెరుగుతుంది. ఇంటర్‌నేషనల్ ట్రేడింగ్‌లో మనవాళ్లకు అడ్డూ అదుపూ ఉండదు. డబ్బే డబ్బు. డాలర్లే డాలర్లు.

క్రికెట్ రంగం: 

ధోనీ సేన ఈ సంవత్సరం కనీసం రెండు కప్పులు గెల్చుకుంటుంది. మధ్యమధ్యలో చతికిలపడటం మామూలే. అప్పుడప్పుడూ, లాస్ట్ బంతివరకూ గుండె ఆగిపోయేంత టెన్షన్ పెట్టడం కూడా మామూలే. మన టీమ్‌కి అదొక హాబీ. ఆ హాబీ ఈ సంవత్సరం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది.

బెట్టింగులు ఊహిచనివిధంగా పెరిగిపోతాయి. మన రెగ్యులర్ పేకాట క్లబ్బులు, రేస్ కోర్సులు దాదాపు మూతపడే పరిస్థితికి వస్తాయి.

అన్నట్టు ఈ బెట్టింగ్ మహమ్మారి ఒక్క క్రికెట్టుకే పరిమితం కాకుండా - రాజకీయాలకు, కోడిపందాలకు, బైకు/కార్ రేసులకూ, ఎవరికి మినిస్ట్రీ వస్తుంది అన్నదానికీ, చివరికి.. ఏ హీరోయిన్‌కు ఎవరితో లింకు ఉందీ, ఆ లింకు ఉంటుందా ఊడుతుందా అన్నంతవరకూ విస్తరిస్తుంది.

సినిమా రంగం: 

తన మాగ్నమ్ ఓపస్ "బాహుబలి" చిత్రాన్ని జక్కన్న ఇంకా అద్భుతంగా చెక్కుతూనే ఉంటారు. మరోవైపు - రాజకీయ కారణాలవల్ల తెలుగు చిత్ర పరిశ్రమ రెండు ముక్కలయిపోయినా, వ్యవహారంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. అవే లాబీలు, అవే నెట్‌వర్క్‌లు, అవే థియేటర్లు, అవే లీజులు, ఆ మీడియేటర్లే ఉంటారు అంతటా. ఒక్క టాక్సులు మాత్రం తెలంగాణవి తెలంగాణలో, సీమాంధ్రవి సీమాంధ్రలో ముడుతుంటాయి.

థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం మరింతగా పడిపోతుంది. డైరెక్ట్ టూ హోం (డి టి హెచ్) పుంజుకుంటుంది. పైరసీలు, టారెంట్లు.. షరా మామూలే.

సోషల్ నెట్‌వర్కింగ్:

ఫేస్‌బుక్ కొద్దిగా స్లో అవుతుంది. వాట్సాప్ మాత్రం వీర లెవెల్లో పాప్యులర్ అవుతుంది. "రౌడీ" సంచలనం తర్వాత.. ఆర్‌జీవి ట్వీట్‌ల జోరు ఇంకా పెరుగుతుంది. సెలెబ్రిటీలు, రాజకీయనాయకుల ట్వీట్స్ ఎప్పటికప్పుడు టీవీ చానెల్స్‌లో "బ్రేకింగ్ న్యూస్"లవుతుంటాయి.

కనుమరుగయిపోయిన కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలన్నీ.. కనీసం ఈ సొషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ పుణ్యమా అని.. కొద్దికొద్దిగా మెరుగవుతాయి. అసలు జీవితం అంటే ఏమిటో రియలైజ్ అయ్యే పరిస్థితుల్ని సృష్టిస్తాయి. ఇదొక శుభపరిణామం.  

మనోహర్ చిమ్మని జాతకం:

జయ నామ సంవత్సరం మనోహర్‌కు మంచి ఫలితాలనిస్తుంది. తన రెగ్యులర్ ఉద్యోగసద్యోగాలు తాను చేసుకొంటూనే - లో/నో బడ్జెట్ సినిమాల మేకింగ్ మీద ఇప్పటిదాకా ఆయన చేసిన రిసెర్చ్ ఆధారంగా - అంతా కొత్తవారితో కనీసం ఓ నాలుగు సినిమాలు తీస్తాడు. వాటిల్లో కనీసం ఒక్కటి సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

తర్వాత వచ్చే అవకాశాల్నీ, ఆఫర్స్‌నీ కావల్సినంత క్యాష్ చేసుకొంటూ.. తన ఇన్వెస్టర్స్‌కు కూడా మంచి లాభాల్ని సమకూర్చిపెడతాడు.

అనంతరం ఫీల్డుకి దూరంగా, హైదరాబాద్ జనారణ్యానికి దూరంగా.. ఎక్కడో ఓ మాంచి సముద్రతీరం ఉన్నచోట తన జీవిత అంతిమ గమ్యమైన ఆధునిక ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభిస్తాడు!

కట్ టూ "ఆల్ ఈజ్ వెల్" - 

ఇప్పటిదాకా మీరు చదివిందంతా "పాజిటివ్ ఆస్ట్రాలజీ" అనబడే "ఆల్ ఈజ్ వెల్ ఆస్ట్రాలజీ" అన్నమాట! సరదాగా ఇలా రాయాలనిపించి రాశాను. ఈ జయ నామ సంవత్సరంలో - నాతోపాటు అందరికీ, అన్ని విషయాల్లో మంచి జరగాలన్నదే నా అభిలాష.

సర్వేజనాస్సుఖినో భవంతు!  

2 comments:

  1. బాగుంది మనోహర్ గారు :)

    ReplyDelete
    Replies
    1. డికెవి గారూ, థాంక్ యూ. :)

      Delete