Friday, 21 March 2014

సెటైర్, సెక్స్, హ్యూమర్ = కుష్వంత్ సింగ్!

నాకు బాగా నచ్చిన అతికొద్దిమంది ఇండియన్ ఇంగ్లిష్ రైటర్స్‌లో కుష్వంత్ సింగ్ ఒకరు.

సెటైర్, సెక్స్, హ్యూమర్.. ఇవే ఆయన ప్రత్యేకతలు. ఆయుధాలు.

వీటిచుట్టూ ఆయన రచనలు రూపుదాల్చుకుంటాయో, లేదంటే, ఆయన రచనల్లోకి ఇవే ఇష్టపూర్తిగా చొచ్చుకువస్తాయో తెలియదు. మొత్తానికి ఆయన రచనలకు, ఆయన శైలికి అలవాటుపడిన పాఠకులకు మాత్రం పండగే!

ఆయనకు ఎంతో పేరు తెచ్చిన అతి సీరియస్ సబ్జెక్ట్ "ట్రైన్ టూ పాకిస్తాన్" నవలలో కూడా సెక్స్‌ని టచ్ చేయకుండా వదల్లేదాయన!

నవలా రచయిత, జర్నలిస్టు, సర్దారీ జోకుల సామ్రాట్టు, దౌత్యవేత్త, ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు.. కుష్వంత్ సింగ్ ఇక లేరు. అయితే, చనిపోయే చివరి క్షణం వరకూ మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారాయన. చివరి క్షణం వరకూ జీవితాన్ని మస్త్‌గా జీవించారాయన.

అదీ ఆయన జీవనశైలి ప్రత్యేకత.

కుష్వంత్ సింగ్ రాసిన జోకుల స్థాయిని బట్టి, ఆయన వేసిన సెటైర్ల లెవెల్‌ను బట్టి.. "ది డర్టీ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం" అన్న టాగ్‌ని తగిలించేశారాయనకు.

ఆయన రచనల్లో ఆర్టికిల్స్/కాలమ్‌స్ ఎక్కువగా చదివాను. ట్రైన్ టూ పాకిస్తాన్, ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మాలిస్ చదివాను. కుష్వంత్ సింగ్ జోక్స్ సీరీస్‌లో వచ్చిన పుస్తకాల్లో మాత్రం దాదాపు చాలావరకు చదివాను.

ఆయన చివరి రోజుల్లో రాసిన "కుష్వంత్ నామా" ఒక్కటి మాత్రం ఇంకా చదవాల్సి ఉంది.

మర్చిపోయాను.. తన జీవితంలో, తనకు అత్యంత దగ్గరగా పరిచయం ఉన్న స్త్రీలందరిమీద కూడా ఒక పుస్తకం రాసిన ఘనత ఆయనకుంది!    

మరో ఏడాదిలో నిండు నూరేళ్లు పూర్తిచేసుకోవాలని అనుకున్న కుష్వంత్ సింగ్.. 99 ఏళ్ల వయస్సులోనే అప్పుడే ఏదో గుర్తుకువచ్చినట్టు  అనవసరంగా తొందరపడ్డారనిపిస్తోంది నాకు.

అయినా నో ప్రాబ్లమ్..

ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్లు లేకుండా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన భారతీయ రచయిత నా దృష్టిలో ఆయనొక్కరే.

ఆర్ ఐ పి, కుష్వంత్ జీ! ఇంక అక్కడ చూసుకోండి..  

No comments:

Post a Comment