Tuesday 7 January 2014

అస్తమించిన ఉదయకిరణం ..

మూడు వరుస సూపర్ హిట్స్‌తో హాట్రిక్ ఇచ్చి హీరోగా "రికార్డ్ ఎంట్రీ" ఇచ్చిన హీరో ఉదయ్‌కిరణ్ మరణం నా బ్లాగ్‌కి టాపిక్ అవుతుందని నేనూహిస్తానా?

కానీ ఈ రోజు అదే జరిగింది.

రాయకూడదనుకున్నాను. కానీ, రాయకపోతే నా నగ్నచిత్రం నన్నే వెక్కిరిస్తుంది. నేనూ ఓ పెద్ద హిపోక్రాట్‌నయిపోతాను.. ఇండస్ట్రీలోని వందలో తొంభైతొమ్మిదిమందిలా..


కట్ టూ నేను అసహ్యించుకున్న ఉదయ్‌కిరణ్ నిర్ణయం - 

మా ప్రియతమ్ ఓ మూడేళ్ల వయసున్నప్పుడనుకుంటాను. "నాకు నువ్వూ.. నీకు నేనూ" అని "నువ్వు నేను" సినిమాలోని యాడ్ టీవీలో వస్తున్నప్పుడల్లా - "హేయ్.. ఉదయ్‌కిరణ్!" అంటూ వాడు టీవీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లేవాడు.

ఆ ఉదయ్‌కిరణ్ ఇప్పుడు లేడు. ఉరేసుకుని చచ్చిపోయాడు.

అతన్ని కన్న తండ్రి అతని అంత్యక్రియలు చేయనంటూ కన్న కొడుకు శవాన్ని అనాథని చేశాడు. "తండ్రి తరపువాళ్లే అంత్యక్రియలు చేస్తారని ఇంక మేము ఆ విషయం పట్టించుకోలేదు!" అని స్వయంగా అతని భార్య, ఆమె తరపువాళ్లు సెలవిచ్చారు.

కారణాలు ఏవయినా కావొచ్చు..

అసలేంటీ మానవ సంబంధాలు? ఎటు వెళ్తున్నాం మనం?

ఇప్పటివరకూ ఏ టాప్‌స్టార్‌లు, స్టార్ల కొడుకులూ, ఇండస్ట్రీని ఏలుతున్న ఇంకెందరో దిగ్గజాల కొడుకులయిన సోకాల్డ్ హీరోలు ఎవ్వరూ సాధించని విధంగా - సూపర్ హిట్స్‌ హాట్రిక్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన "ఎలాంటి సినీ నేపథ్యం లేని హీరో" ఉదయ్‌కిరణ్ .. చివరికి శవంగా కూడా అనాథే అయ్యాడు.

పోస్ట్‌మార్టమ్‌కు వచ్చిన ఆ అనాథ శవాన్ని చూస్తూ వందలాదిమంది బోరున ఏడ్చారు. అలా విలపించినవాళ్లంతా ఉదయ్‌కిరణ్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కాదు. ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆయాలు, నర్సులు, ఇతర వందలాదిమంది స్టాఫ్.. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకెందరో అతనితో ఏమాత్రం సంబంధం, పరిచయం లేనివాళ్లు..

పోస్ట్‌మార్టమ్ అనంతరం ఆ అనాథ శవాన్ని NIMS మార్చురీకి తరలించారు. అక్కడకూడా సమయానికి మార్చురీ తాళం తీసేవాళ్లులేక చాలాసేపు ఉదయ్‌కిరణ్ శవాన్ని అలాగే..అక్కడే.. అనాథలా ఉంచారు.

ఆ తర్వాతే.. ఇంక తప్పదన్నట్లు సినిమావాళ్ల నాటకీయ హడావిడి ప్రారంభమైంది బహుశా.

షరా మామూలే. ఫిలిమ్‌చాంబర్లో భౌతిక కాయం. టీవీ చానెళ్ల మైకులముందు అదే యూజువల్ సంతాపాలు.. "ఉదయ్‌కిరణ్ ఇంద్రుడు, చంద్రుడు, నాకు బాగా తెలుసు, అదీ ఇదీ.." అంటూ.


కట్ టూ కన్నతండ్రి -  

వాళ్లమధ్య ఎన్ని గొడవలు, విభేదాలున్నాయో మనకు తెలియదు. అంత్యక్రియలు నేను చేయను గాక చేయను అన్న కన్నతండ్రే చివరికి ఉదయ్‌కిరణ్ అంత్యక్రియలు పూర్తిచేశాడు.

అందమయిన ఆ ఉదయకిరణం పూర్తిగా ప్రసరించకముందే అస్తమించింది.. అదృశ్యమైపోయింది.


కట్ టూ ఉదయ్‌కిరణ్‌తో నేను -

సుమారు పదేళ్లక్రితం.. బహుశా అది 2003 అనుకుంటాను. పద్మాలయ స్టూడియోలో మొదటిసారి ఉదయ్‌కిరణ్‌ని నేను చూసాను.

అప్పుడు బహుశా రాత్రి 9 గంటలు అవుతోంది. ఆ మర్నాడు ఉదయం ఉదయ్‌కిరణ్ కొత్త సినిమా ప్రారంభం ఉంది అక్కడే పద్మాలయా స్టూడియోలో.

స్టూడియో ఫ్లోర్‌లో జరుగుతున్న ఆ ఏర్పాట్లు చూడ్డంకోసం అప్పుడు అక్కడికి వచ్చాడు ఉదయ్‌కిరణ్.

వాళ్లపని వాళ్లు హడావిడిగా చేసుకుంటూ - దాదాపు ఏడెనిమిది మంది ఆర్ట్ డిపార్ట్‌మెంటువాళ్లు మాత్రమే ఉన్నారప్పుడు.

నేనూ, నాతోపాటున్న మరో ఇద్దరు సినీ మిత్రులం ఉదయ్‌కిరణ్‌ని విష్ చేశాం. అక్కడే అడ్డదిడ్డంగా వేసి ఉన్న ప్లాస్టిక్ చెయిర్స్‌లో అతనితోపాటు కూర్చుని కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నాం.

ఆ అందమయిన సొట్టబుగ్గ, ఏ మాస్కూలేని నిష్కల్మషమయిన ఆ చిరునవ్వు.. నాకళ్లముందు ఇప్పుడూ కనిపిస్తున్నాయి.

సినిమాల్లో కాకుండా, అదే మొదటిసారి నేను ఉదయ్‌కిరణ్‌ని చూడ్డం. మళ్లీ ఇదిగో, ఇప్పుడు, ఈరోజున .. ఇలా చూడ్డం.
     

కట్ టూ ఫిలిమ్ ఇండస్ట్రీ - 

"స్విమ్మింగ్ విత్ షార్క్స్" అనుకుంటాను. హాలీవుడ్ నేపథ్యంలో రాసిన పుస్తకం అది. తర్వాత దాన్ని సినిమాగా కూడా తీశారనుకుంటాను. తెలుగులో అలాంటి పుస్తకం ఇప్పటివరకూ ఎవరూ రాయలేదు. రాయరు బహుశా.

ఉదయ్‌కిరణ్ మరణం ఎందుకో నాకు ఆ పుస్తకం టైటిల్‌ను బాగా గుర్తుకు తెస్తోంది.

ఎవరు బయటికి ఏ సొల్లు చెప్పినా - ఇండస్ట్రీలో కులాలు, ప్రాంతాలు, లాబీలు..అనీ ఉన్నాయి. పరమ నీచంగా. నికృష్టంగా. ఆ ఆధిపత్యాల అడుగులకు మడుగులొత్తే చెంచాల సంఖ్య కూడా చిన్నదేం కాదు.  

తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఊడలమర్రిల్లాంటి కొందరు నిర్మాతలు, దర్శకులు, నటుల కొడుకుల ముఖాలు ఎంత చెత్త పేడి ముఖాలయినా, ఎంత చూడబుధ్ధికాని కనీస సంస్కారం లేని  చవటలయినా .. వాళ్ల డేట్స్ కోసమే నిర్మాతలు, దర్శకులు క్యూ కడతారు తప్ప - ఏ సినీ నేపథ్యం లేని, ఎవరి లాబీలకీ గులామ్‌లు కాని "ఉదయ్‌కిరణ్"లు ఎలా కనిపిస్తారు?

అరా కొరా ఎవరో ఒకరిద్దరికి అలా తీసుకోవాలని అనిపించినా - ఆ తర్వాత, ఏ "దుష్ట శక్తుల" నుంచి (ఈ పదం ఇవాళ స్వయంగా దర్శకరత్న దాసరి గారే ఉపయోగించారు!) ఎలాంటి రియాక్షన్ ఉంటుందోనన్న భయం!

ఇదంతా ఒక ఫాసిస్ట్ పరంపర. దీని అంతిమ దశకు, అంతానికి, సమాధికి.. ఇప్పుడిప్పుడే పునాదులు పడుతున్నాయి. అది వేరే విషయం.


కట్ టూ ఉదయ్‌కిరణ్ చేసిన రెండు తప్పులు - 

కేవలం హీరోగా అవకాశాలు రాకపోవటం, దానివల్లనే అతను డిప్రెషన్‌కు లోనయి అలా చేసుకున్నాడని నేననుకోను. ఇంకేదో ఉందని నాకనిపిస్తోంది. అది అలా వదిలేద్దాం..

నా వ్యక్తిగత ఉద్దేశ్యం ప్రకారం ఉదయ్‌కిరణ్ తన జీవితంలో చేసిన తప్పులు రేండే రెండు. ఆ రెండు తప్పులే అతని జీవితం ఇలా ముగియడానికి కారణమయ్యాయి:

ఒకటి - చిరంజీవి కూతురితో పెళ్లికి ఒప్పుకొని ఎంగేజ్‌మెంట్ వరకూ వెళ్లటం.

రెండు - జీవితంలో కనీసం ఒకరిద్దరయినా నిజమయిన స్నేహితుల్ని కలిగి ఉండకపోవటం. ఒకవేళ ఉన్నా, వారికి దూరంగా ఉండటం.

మొదటి కారణం, దాని తదనంతర పరిణామాలు.. ఉదయ్‌కిరణ్ ప్రొఫెషనల్‌గా చావడానికి కారణమయ్యాయి.

రెండోది, "జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు!" అన్న సింపుల్ వాస్తవం అతను తెలుసుకోలేకపోవడానికి కారణమయింది. 

9 comments:

  1. correct ...

    ఉదయించే కిరణాలను ఆపేదే మాఫియా
    చెత్త పుత్రులను ప్రమోట్ చేసి
    వుత్తి మొఖాల్ని హీరోల్ని చేసి
    తెలుగు సినిమాకి చీడలా పట్టి
    తెగులులా పట్టి తగులుకునీ

    ఉదయించే కిరణాలను ఆపేదే మాఫియా
    హృదయం లేని పాషాణాలే పెద్దలయా

    నటన ఓ వారసత్వ సంపదయితే
    నీటమునగదా నిజ నటనా సౌరభం?

    కొడుకు నాకొడుకులే తెలుగు సిన్మా హీరోలయితే
    కడకు మిగిలేది తెర మీద పనికి రాని కొయ్యలే!

    మేకుల్లా కొడుకులు, తమ్ములూ దిగబడి పొతే
    ఏకుల్లా బంధువులు రాబందుల్లా ఎగబడిపోతే

    ఒక కొత్త రామారావ్ వచ్చే అవకాశం లేదు
    యిక యింకో నాగేశ్వర్రావ్ రాడు గాక రాడు

    తెలుగు సినిమాకి పూర్వపు వెలుగొస్తుందా?
    వెలుగుకు దూరమై వీగిపోయి నిర్వీర్యమైపోతుందా?

    ReplyDelete
  2. "జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు!" అన్న సింపుల్ వాస్తవం..

    This is correct.

    ReplyDelete
  3. ఇవాళ ఒక్క ఉదయ్ కిరణ్ మాత్రమే కాదు. ఎంతో మంది సినిమాలు మాత్రమే జీవితం అనుకుంటున్నారు.
    సినిమా కోసం....సినిమాల్లో నటించేందుకోసం.....దేనికైనా సిద్దపడుతున్నారు. ఆఖరికి చావడానికైనా...,
    బహుశా ఇటువంటి పరిస్థితి మన దగ్గర తప్ప మరెక్కడా ఉండదేమో.
    మిగతా దేశాల్లో సినిమాను ఓ ప్రొఫెషన్ లాగానే చూస్తారు. మన దగ్గర మాత్రం...సినిమా పరిశ్రమను వేరే లోకంగా భావిస్తారు. సినిమా మనుషులంటే దేవతలో...మరో గ్రహం మానవులో అనుకుంటారు.
    సినిమా థియేటర్ లేని దేశాలు చాలా ఉన్నాయన్న సంగతి అవి అభివృద్ధిలోనూ ముందుగా ఉన్నాయన్న సంగతి...సాంస్కృతికంగా బలంగా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. అంతేకాదు సోమవారం, మంగళవారం లాంటి పనిదినాల్లో కూడా.....ఉదయం పదకొండు గంటలకే సినిమా థియేటర్ల ముందు క్యూలు కట్టే జనం ఉంటారని తెలిసి ఆ దేశాల ప్రజలు ఆశ్చర్యపోతారు కూడా.

    ఒక నాటకం, ఒక ప్రదర్శన, లేదా ఇతర కళారూపాలు ఎలాంటివో సినిమా కూడా అలాంటిదేనన్న వాస్తవం గుర్తించాలి. సినిమాలో అవకాశాలు రాకపోయినంత మాత్రాన పోయిందేమీ లేదని యువతరం గుర్తించాలి.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంత్‌తో 100 శాతం ఏకీభవిస్తున్నాను, చందు తులసి గారూ!

      నా బ్లాగ్ పోస్ట్ చివర్లో కూడా నేను అదే చెప్పాను. జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు. ఆ బాక్స్ దాటి బయటకు వస్తే.. ఇంకెంతో అద్భుతమయిన ప్రపంచం ఉంది బయట! మీరన్నట్లు, ఇతర అన్ని ప్రొఫెషన్స్‌లాగే ఇది కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటే ఎలాంటి గొడవా ఉండదు.

      Delete