Friday 31 January 2014

ఏ సినిమా నిజంగా సొసైటీకి మేలు చేస్తుంది?

"సొసైటీకి మేలు చేసే సినిమా అంటూ ఉంటారందరూ. ఏ సినిమాకి అయితే ఎక్కువ డబ్బు వస్తుందో అదే సొసైటీకి ఎక్కువ మేలు చేస్తుంది. మెసేజ్‌ ఉన్న సినిమా అయితే సొసైటీకి పనికొస్తుందని జనం అనుకుంటారు. కానీ మెసేజ్‌ ఉన్న సినిమాని ఎవడూ చూడడు. ఏ సినిమా అయితే నచ్చి జనం చూస్తారో అదే సొసైటీకి పనికొస్తుంది. ఎందుకంటే... అందరికీ డబ్బొస్తది. అందరం గవర్నమెంట్‌కి టాక్స్‌ కడతాం. కాబట్టి నా దృష్టిలో సొసైటీకి పనికొచ్చే సినిమా అంటే కమర్షియల్‌ సినిమానే. దానికి అవార్డులు వచ్చినా రాకపోయినా ఏం ఫర్లేదు." -- పూరి జగన్నాథ్ 

^^^

"నేషనల్‌ అవార్డ్‌ వచ్చేదా... వంద కోట్లు వచ్చేదా... ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు?" .. 
అన్న ప్రశ్నకి, ఒక ఇంటర్‌వ్యూలో.. పైవిధంగా, నిర్మొహమాటంగా, సూటిగా, సుత్తిలేకుండా జవాబు చెప్పాడు పూరి జగన్..

"
వంద కోట్లు వచ్చే సినిమానే తీస్తాను" అని.

ఇలా చెప్పడానికీ గట్స్ ఉండాలి!

దీన్ని మనవాళ్లు ఒప్పుకోడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా సో కాల్డ్ జర్నలిస్టులు-లేదా-క్రిటిక్స్. ఇంకా కొంతమంది
 "మేం మేధావులం" అనుకొనేవాళ్లు. 

వీళ్లేకాదు..  ఇంకా కొంతమంది, చచ్చేదాకా కేవలం హిపోక్రసీలోనే బ్రతికే జీవులు కూడా.. ఈ లాజిక్కుని ఒప్పుకోవు గాక ఒప్పుకోవు. 

సిగరెట్లమీద సిగరెట్లు కాలుస్తూ, చాయ్‌ల మీద చాయ్‌లు తాగుతూ.. నానా నీతిసూత్రాలు చెబుతూ, ఏదేదో రాసేస్తారు వీళ్లంతా.  

కాలానుగుణంగా ప్రపంచంలో వచ్చే అన్ని మార్పులూ, చేర్పులూ, సౌకర్యాలూ, విలాసాలూ, గాడ్జెట్సూ, గాడిదగుడ్సూ అన్నీ ఓకే. అన్నిటికీ స్వాగతం. 

ఒక్క కమర్షియల్ సినిమా దగ్గరికి 
చ్చేటప్పటికే ఎక్కడలేని నీతిసూత్రాలు గుర్తుకొస్తాయి! 

"ఇలా తీయొచ్చు.. అలా తీసుండాల్సింది.. సెకండాఫ్ లాగారు.. ఫస్టాఫ్ పీకారు.." అంటూ నానా ఈకలు పీకుతారు.


కట్ టూ ప్రాక్టికాలిటీ - 


ఈ మహానుభావులందరూ ఒక్క నిజం తెలుసుకోవాలి. ఒక్క పని చేసి చూపించాలి. 

సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఎన్ని మిలియన్ల కుటుంబాలు బ్రతుకుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా? ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఒక్కటే ఎంత ఆదాయాన్ని అందిస్తోంది? అన్ని బిలియన్ల ఆదాయం, అంతమంది బ్రతకడం.. నేషనల్ అవార్డులు వచ్చే సినిమాలు మాత్రమే తీయడం ద్వారా సాధ్యమా? .. ఇదీ వీరు తెల్సుకోవాల్సిన నిజం.

సినిమాలు ఇలా తీయాలి..అలా తీయాలి అని ఓ సొద రాసే వీళ్లందరూ.. డబ్బులు సమకూర్చుకొని/లేదా/ఒక ప్రొడ్యూసర్‌ను సంపాదించుకొని వీరు చెప్పే కళాఖండాల్ని తీసి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి చూపించాలి. ఇదీ .. వీరంతా చేయాల్సిన ఒకే ఒక్క పని.  

12 comments:

  1. *ఈ మహానుభావులందరూ ఒక్క నిజం తెలుసుకోవాలి. ఒక్క పని చేసి చూపించాలి. *

    తెలుగు సినేమాలు లేకపొతె ప్రపంచానికి వచ్చె ముప్పే మి లేదు. నిజాయితి గా మాట్లాడినట్లు అనిపించినంత మత్రాన పూరి చాలా గొప్ప వాడు కాడు. హిపోక్రసి ఉన్న వారు తక్కువ వారు కారు. డబ్బులు సంప్పదించుకోవాలనుకొంటె సినేమా రంగం కన్నా ఇతర రంగాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇండియాసినేమా పరిశ్రమ 2011 లో 9300కోట్లు, 2012 లో 11240 కోట్ల రుపాయల వ్యాపారం చేసింది. 2016 కి మహా ఐతె 15000 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనా వేశారు. భారత దేశ ఎకనామి ఎంత అందులో సినేమా వారి కంట్రిబ్యుషన్ ఎంత? వారికి మీడియావారు ఇచ్చే పాపులారిటిని చూసుకొని గొప్ప వారమనుకొంట్టుంటారు.

    ReplyDelete
    Replies
    1. 1. మీరు కామెంట్ ప్రారంభంలో కోట్ చేసినదానికీ, క్రింద రాసిన మ్యాటర్‌కీ ఉన్న లింక్ ఏంటో నేను పట్టుకోలేకపోయాను.

      2. తెలుగు సినిమాలు లేకపోతే ప్రపంచానికి వచ్చే ముప్పు విషయం నాకు తెలియదు కానీ.. తెలుగు సినిమా వార్తలు, యాడ్స్, టిట్‌బిట్స్, సినిమా బేస్‌డ్ ప్రోగ్రామ్‌స్ లేకుండా ఏ ఒక్క తెలుగు టీవీ చానెల్ బ్రతికి బట్టకట్టలేదు. ఇవి లేకుండా ఏ తెలుగు న్యూస్ పేపరూ/మ్యాగజైనూ మార్కెట్లో నిలబడదు.

      3. పూరి చాలా గొప్పవాడు అని నేను చెప్పలేదు. ప్రాక్టికల్‌గా తనకు తెలిసిన నిజం సూటిగా చెప్పాడు అని మాత్రమే చెప్పాను. హిపోక్రసీ మాస్కులు వేసుకొని ప్రాక్టికాలిటీకి నిలబడని ఏవేవో నీతిసూత్రాలు చెప్పేవాళ్లందరికంటే మాత్రం తప్పకుండా చాలా గొప్పవాడే పూరి. ఇది ఇప్పుడు చెప్తున్నాను.

      4. మీరిచ్చిన లెక్కలకు ఆధారమేంటో నాకు తెలియదు. దాని గురించి చెప్తే అసలు లెక్కలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.

      5. సినిమా వాళ్లకి మీడియా వాళ్లు ఊరికే పాపులారిటీ ఇవ్వరు. అలా గానీ ఇచ్చేట్టయితే మీకూ, నాకూ, దేశ జనాభా మొత్తానికీ ఇవ్వాల్సి ఉంటుందని నా హంబుల్ అభిప్రాయం.

      పై ఒక్కొక్క పాయింట్ పైన/మొత్తంగా మీ కామెంట్ పైన విడిగా ఒక బ్లాగ్ పోస్ట్/బ్లాగ్ పోస్టుల పరంపర కూడా రాయవచ్చు.

      ఏమయినప్పటికీ.. థాంక్ యూ ఫర్ యువర్ కామెంట్, శ్రీరామ్ గారూ!

      Delete
    2. "Mee blog lo Sri ram anna aayana comment ki meeru ichina reply bagundi... Chivarlo meru raasina " pai okka comment paina...." Antu meerichina samadhanam super...

      Samajamiki em jarigina adi cinema vallane ani aadiposukune vaari sankhya chala ekkuva, cinema ni aadiposukunte Medhavulu aipotam ani inko kotta batch byluderindi...

      ( ee comnt blog lo post cheyyadamiki avvaledu, am publishing through mobile, so some settings r not comparable for posting reply or comments in blogs.. I hv to learn this subject)"
      -- Priyadarshini Krishna (copy pasted from FB comments)

      Delete
    3. పై వ్యాఖ్య టాబ్ ను ఉపయోగించి రాశాను. అందువలన మీరు రాసిన చివరి పేరా (కట్ టూ ప్రాక్టికాలిటీ )లో ఆదాయాన్ని గురించి ప్రస్తావించిన అంశాలను సరిగ్గా కాపి పేస్ట్ వేయలేకపోయాను. వ్యాఖ్యను ప్రచూరించేటప్పుడు టాబ్ విసిగించింది.
      పూరి ప్రాక్టికల్‌గా చెప్పిన నిజం అని మీరేదైతే అంట్టున్నారో అలా మాట్లాడితే,పాఠకులకు పది పదిహేనేళ్లక్రితం కొత్తగా అనిపించి ఉండేది. కొంతమంది వాస్తవమేగా, ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడాడు అని మీలాగా అనుకోవచ్చు. కాని ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు అవుటాఫ్ డేట్ అయ్యిపోయాయి. ఎందుకంటే ఈ రోజున విమర్శకులు ఇర్రిలవెంట్ . ఏ దర్శకుడు వారి అభిప్రాయలను పట్టించుకోడు. నిర్మాతలు అంతకన్నా పట్టించుకోరు. ఎలాగైనా సినేమా హిట్ కావాలని,తద్వారా తనకు పేరు,పైసలు రావాలని మాత్రమే సినేమాలు తీస్తున్నారు. సమాజానికి సందేశం ఇవ్వన్ని మూడు దశాబ్దాలక్రిందటి (టి.కృష్ణ కాలం నాటి) మాటలు. అయితే ఒకప్పటి సినేమా పరిశ్రమ వారి లాగా సమాజం నుంచి గౌరవ మర్యాదలు ఆశించకుడదు. కాని ఇప్పటి సినేమా వారిని పరిశీలిస్తే, పేరు ప్రఖ్యాతులతో పాటుగా తో బాటుగా వారు సమాజం నుంచి గౌరవ మర్యాదలు ఆశిస్తున్నట్లు కనిపిస్తున్నాది.

      ఇక మీడీయా వాళ్ల దగ్గర 24X7 ప్రసారాలకు మేటర్ లేదు, అందువలన కొద్దో గొప్పో పేరు ఉన్నవారి గురించి చూపించిందే చూపిస్తూంటరు. చూడాలని ఆసక్తి ఉన్నవారు చూస్తూంటారు. మీరన్నదానితో విభేదించాల్సిన దేమీలేదు. నేను సినేమావాళ్లకు వ్యతిరేకం కాదు. ఇక నేను ఇచ్చిన లెక్కలు 27-8-2013 బిజినెస్ స్టాండర్డ్స్ పేపర్లో ఇండియన్ సినేమా మీద రాసిన వ్యాసం నుంచి ప్రస్థావించింది.

      Delete
    4. "ఈ రోజున విమర్శకులు ఇర్రిలవెంట్ . ఏ దర్శకుడు వారి అభిప్రాయలను పట్టించుకోడు. నిర్మాతలు అంతకన్నా పట్టించుకోరు. ఎలాగైనా సినేమా హిట్ కావాలని,తద్వారా తనకు పేరు,పైసలు రావాలని మాత్రమే సినేమాలు తీస్తున్నారు."
      ^^^
      చాలా బాగా చెప్పారు. ఇదే నిజం.

      ఇందులో తప్పుకూడా ఏంలేదు. ఎందుకంటే అన్నిటిలా ఇదీ ఒక ప్రొఫెషన్. వ్యాపారం. అంతే. థాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్, శ్రీరామ్ గారూ!

      Delete
  2. నా కామెంట్ ను రెండు భాగములుగా పంపిస్తున్నాను...

    మనోహర్ గారికి వంద వందనమలు. మొదటగా..... పూరి గారు నేనింతే అనే ఓ సినిమా అత్యద్భుత చిత్ర రాజం తీశారనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను...?
    ఇక ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ మెసేజ్ ఇచ్చే సినిమాలు జనం చూడరు ( ఆయన చెప్పినట్లే
    మెసేజ్ సినిమాలు చూడరు సరే...మరి ఆయన తీసే థాయ్ మసాజ్ సినిమాలు కూడా చాలా చూడలేదు కదా...? )

    ఇట్టి ప్రకటనలు కేవలం సంచలనం కోసం తప్ప...సినిమాల పూర్తిగా అవగాహన ఉండే పూరి ఇచ్చారని అనుకోవడం లేదు.

    ఎందుకంటే పూరి గారు తీసే మసాలా కూరిన చలన చిత్రములు అన్నియు చూశారో లేదో కానీ.....
    మెసేజ్ ఇచ్చిన సినిమాల్ని కూడా జనం చూస్తారని చెప్పడానికి నా తలమీద వెంట్రుకలన్ని యాధారములు కలవు.

    కావాలంటే మచ్చుకు కాచుకోండి...

    తల్లిదండ్రులను గౌరవించాలనే తాతామనవడు,,,,,
    సంగీతాన్ని నిలబెట్టేందుకు ఆరాటపడే ముసలి బ్రాహ్మడి కథ శంకరాభరణం...,
    నాట్యం కోసం తపించే మరో ముసలి వాడి కథ సాగర సంగమం...,
    భూమి కోసం పోరాడిన ఓ పేదవాడి కథ మాభూమి....

    రౌడీలు, రాజకీయ నాయకులు కలిసి దేశాన్ని దోచుకుంటున్న తీరు కళ్లకు కట్టిన అంకుశం,,,
    దేశాన్ని దోపిడి వర్గాల నుంచి కాపాడమనే అర్థరాత్రి స్వతంత్రం...,
    కుటుంబం కోసం, ఇచ్చిన మాటకోసం ప్రాణమైనా వదిలిన పెదరాయుడు....,
    దళిత గిరిజన స్త్ర్రీలపై అత్యాచారాలను ప్రశ్నించిన ఒసేయ్ రాములమ్మ....,
    పోనీ ఈ మధ్యనే వచ్చిన క్రిష్ తీసిన..గమ్యం అనే చిత్రము
    పక్క వాడిని చిరునవ్వుతో పలకరించమనే సీతమ్మ వాకిట్లో....చిత్రము

    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వస్తాయి. ఇవన్నీ మెసేజ్ చిత్రములు కాక మసాజ్ చిత్రములా...?
    వీటిని జనం చూడడం కాదు. బండ్లు కట్టుకుని మరీ వెళ్లి సూపర్ డూపర్ హిట్ చేశారు కదా...?

    ఇక పూరి గారు తన గట్స్ ప్రకారం తీసిన....బాచి, ఆంధ్రావాలా, నేనింతే, 143, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు, ఇద్దరమ్మాయిలతో.....లాంటి అపరూప చిత్రరాజములు ఎంతగా జనమును అలరించెనో తమరికి తెలియనిది కాదు కదా...?

    మరి పూరి గారు చెప్పినదే నిజమైన యెడల అవి ఎందుకు గొరకాకుండా....ఆఖరికి దేవుడు చేసిన మనుషులు రీళ్ల ఖరీదునైన ఎందుకు రాబట్టలేక డీలా పడిపోయొను...?


    ఇక వారు నేనింతే సినిమాలోనే చెప్పిన ఓ సంభాషణ చదవండి.
    ఆ చిత్రమునందు ఇడ్లీ విశ్వనాథ్ యని యొక పాత్రధారి యుండును. అతడు ఇప్పుడు పూరి లాగే...జనానికి సినిమాలు ప్రధానంగా మెస్సేజ్ సినిమాలు చూడడం చేతకాదని అనును. దానికి మరొక పాత్రధారి...,సామాన్య ప్రేక్షకుడు యొకడు...శంకరాభరణం లాంటి సినిమాను మేం హిట్ చేయలేదాయని ప్రశ్నించును.
    మరి నేనింతే నను సినిమాలో యేల పూరి ఆ డవిలాగు రాసి యుండెను.
    పైగా ఆ సినిమాలో డవిలాగులకు గానూ....నంది యవార్డును కూడా యందుకొని యుండిరి కదా..?

    మరొక విషయం కెమెరామెన్ గంగతో...అను మరొక మహాద్భుత చిత్రరాజమునందు...., బీసీలకు, ఎస్సీల విద్యార్థులకు వేరువేరు హాస్టళ్లు యేల అని పాలకులను దీనముగా ప్రశ్నించును.
    ఒకడిగా నువు పుట్టలేదా...ఒకడిగా నువు చావలేవా...సిగ్గనేది లేదా...యని తన ఆస్థాన కవి భాస్కర భట్ల చేత యొక పాటలో
    ఘోషించును.
    . మరి దీనిని మెసేజ్ చిత్రం కాదని మసాజ్ చిత్రమేనని, తలకింద మెడ యున్న యొక్కరైనా యనగలరా...?

    ReplyDelete
  3. ఇక పూరి గారి విషయానికొస్తే....వారిపై వారి గురువు రాంగోపాల్ వర్మ గారి ప్రభావం యెంతగానో నున్నదనుటలో లేశ మాత్రమునైననూ సందేహము వలదు. అనగా చెప్పున దానికినూ.....చేసే (తీసే ) దానికునూ బొత్తిగా సంబంధం కాదు కదా...కనీసం యక్రమ సంబంధమైనా యుండదు...!

    బిజినెస్ మెన్ అనే చిత్రంలో మహేశుడి చేత ఆఖరి యంకములో....నీకు మించిన తోపు యెవడూ లేడు. నేను ముంబైకి లఘు శంక పోయించుటకే వచ్చితిని... లాంటి అత్యద్భుత డవిలాగులు పలికించెను. పాపం పూరి స్ఫూర్తితో ....కొందరు కుర్రాళ్లు హైదరాబాద్ కి వచ్చి కటకటాల పాలైన సంగతి యన్ని దినపత్రికలలోనూ వచ్చెను. యువతను పక్కదారి పట్టించుటయేనా గట్స్ యనిన....

    ఆ తొక్కలో కత...అరటి తొక్క లోంచి కూడా కథ పుట్టిస్తానని...., దేవుడు చేసిన మనుషులు సినిమా తీసి తానే అరటి తొక్క పై పాదం మోపి జారిపడ్డట్లుగా బొక్క బోర్లా పడెను కదా...? నిజమే...పూరి లాంటి గట్స్ ఉన్న దర్శక రాజును తప్ప మరే తెలుగు యగ్ర దర్శకుడైనను దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమా తీయడని నేను కచ్చితంగా చెప్పగలను.

    ఇక మీ పోస్టులోని కొన్ని సంగతులు

    @"ఎందుకంటే... అందరికీ డబ్బొస్తది. అందరం గవర్నమెంట్‌కి టాక్స్‌ కడతాం.."

    గవర్నమెంట్ టాక్స్ కడితే చాలా....? డబ్బులొస్తే చాలా....? ఏదైనా ఓకేనా...? మరి ఆ మధ్య మళయాళ దేశమందు షకీలా గారి చిత్రములను నిషేధించిన సంగతి తెలియదా....? మరి ఆమె సినిమాలు తీసే వారు టాక్స్ కట్టుటలేదా...? మన దగ్గర కూడా సారీ టీచర్ లాంటి సినిమాలను నిషేధించాలని ఎందుకు జనం గగ్గోలు పెట్టిరి.....? టాక్స్ లు ఎంత ముఖ్యమో.....విలువలూ అంత ముఖ్యమే కదా..?

    @
    "ముఖ్యంగా సో కాల్డ్ జర్నలిస్టులు-లేదా-క్రిటిక్స్. ఇంకా కొంతమంది "మేం మేధావులం" అనుకొనేవాళ్లు."

    తమను తాము మేధావులం అని జర్నలిస్టులు అనుకుంటారో....ఆ గురుశిష్యులు అనుకుంటారో జగమెల్ల తెలిసిన విషయం. ఆ మాట కొస్తే మేధావులు కాని వారు ఎవరు...?
    కేంద్ర మంత్రి జైరాం రమేశ్ "తెలంగాణ విషయంలో అందరూ రాజ్యాంగ నిపుణులే"అన్నట్లు....సినిమాల విషయంలో అందరూ మేధావులే.

    @
    "ఇలా తీయొచ్చు.. అలా తీసుండాల్సింది.. సెకండాఫ్ లాగారు.. ఫస్టాఫ్ పీకారు.." అంటూ నానా ఈకలు పీకుతారు.
    ఇది మరీ అన్యాయం మనోహర్ గారు. ఓ వందో రెండొందలో పెట్టి.....సినిమా చూసిన వాడు....తనకు నచ్చితే నచ్చిందంటాడు. పరమ చెత్త అంటాడు. వేస్ట్ అంటాడు. వాడిష్టం వాడేమైనా అంటాడు. వాడు ఈకలు పీకుతాడు, లేదంటే మొత్తంగా తోకనే పీకుతాడు.

    సినిమా చూసిన వాడికి కనీసం తన అభిప్రాయం కూడా చెప్పుకునే హక్కులేదా....? అది ఏదైనా సరే.( ఐతే బాగుంది లేదా ఏవరేజ్, కాదంటే, చెత్త..ఇవే కదా అంటారు. )

    @
    "సినిమాలు ఇలా తీయాలి..అలా తీయాలి అని ఓ సొద రాసే వీళ్లందరూ.. డబ్బులు సమకూర్చుకొని/లేదా/ఒక ప్రొడ్యూసర్‌ను సంపాదించుకొని వీరు చెప్పే కళాఖండాల్ని తీసి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి చూపించాలి.."

    అలాంటి కలలు కని వచ్చిన వాళ్లే కదా....గమ్యం క్రిష్, భారతీయుడు శంకర్, మురుగదాస్, తిరుపతి స్వామి( చనిపోయారు.)
    ఇంకా వస్తూనే ఉంటారు చూడండి.

    ఇక అసలు సంగతికి వస్తే సినిమా మెసేజ్ సినిమానా...మసాజ్ సినిమానా జనం పట్టించుకోరు.
    తాము చూసే రెండున్నర గంటల పాటూ తమను ఒక కొత్తలోకం లోకి తీసుకెళ్లాలి. నవ్వించాలి. ఏడ్పించాలి. ఆలోచింపజేయాలి. ఆనందింపజేయాలి....,తమకు తెలియని జీవితాన్ని..., తన ఆశలను, ఆశయాలను కనీసం కథానాయకుని ద్వారానైనా సాధించినట్లు ప్రేక్షకుడు లీనమవ్వాలి.
    అలా తనకో కొత్త అనుభూతిని ఇచ్చిన ఎటువంటి సినిమానైనా ప్రేక్షకుడు ఆదరిస్తాడు.

    తమనది కాని భాష ఐన...ఎంటర్ ది డ్రాగన్, జురాసిక్ పార్క్, మమ్మీ, టైటానిక్, ధూమ్, అవతార్ లాంటి పర భాషా సినిమాలు సైతం మనదగ్గర సూపర్ హిట్టయ్యాయి. తమిళ శంకర్ సినిమాలు తమిళంలో కన్నా తెలుగులో హిట్ కావడానికి కారణం కూడా అదే.

    ఐనా ఇవన్నీ మీకు తెలియనివి కావు.
    సమాన్ని ఉద్ధరించకున్నా ఫర్వాలేదు. కానీ .....,
    తెలిసీ తెలియని వయసులో ఉన్న యువతను రెచ్చగొట్టి, మాయమాటలు చెప్పి పక్క దోవ పట్టించకుంటే చాలు.

    ReplyDelete
    Replies
    1. చందు తులసి గారికి వెయ్యి వందనములు.. :)
      ముఖ్యంగా సమాజం మీద మమకారంతో ఇంత పెద్ద కామెంట్‌ని మీరు చాలా ఓపిగ్గా, రెండు భాగాలుగా రాసినందుకు.. మీ విలువైన సమయాన్ని ఇలా వెచ్చించినందుకు..

      ఇంత సుధీర్గమైన మీ కామెంటులో మీరు వెలిబుచ్చిన ప్రతి ఒక్క పాయింటును తీసుకొని నేను ఒక్కో బ్లాగ్ పోస్ట్ రాయగలను. కానీ, ప్రస్తుతం నాకు అంత సమయం లేనందుకు చింతిస్తున్నాను.

      ఏమైనప్పటికీ.. ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థమయింది. ఈ బ్లాగ్ పాఠకులందరికి కూడా. ఏంటంటే.. మసాజ్, మెసేజ్ సినిమాలపైన ఇంత అమోఘమైన అవగాహన ఉన్న మీరు.. ప్రయత్నిస్తే తప్పకుండా ఒక బ్రహ్మాండమైన సమాజానికి ఉపయోగపడే మెసేజ్ సినిమా తీసి హిట్టు కొట్టి మరీ చూపించగలరు!

      ఒక మంచి ప్రొడ్యూసర్ని వెతుక్కొని, ఆ ప్రయత్నం కానీ చేశారంటే .. మీరు ఎందరికో ఆదర్శప్రాయులవుతారు. ఒక్క రాత్రిలో పెద్ద సెలెబ్రిటీ అయిపోతారు. విష్ యూ బెస్టాఫ్ లక్!

      మరొక్కసారి.. థాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్...

      Delete
  4. చిమ్మని గారికి....
    మీ ఆశీస్సులకు కృతజ్ఞతలు. ఇక మీ దీవెనలు ఊరికే పోవని అనుకుంటున్నాను. పైగా మీరు నాకు గురుతుల్యులు. ఎందుకంటే మీ పుస్తకం చదివి చాలా నేర్చుకున్న వాళ్లలో నేను ఒకణ్ని.
    థాంక్యూ. ఏమో గుర్రం ఎగరావచ్చు.....

    ReplyDelete
    Replies
    1. " మీరు నాకు గురుతుల్యులు. ఎందుకంటే మీ పుస్తకం చదివి చాలా నేర్చుకున్న వాళ్లలో నేను ఒకణ్ని..."
      ^^^
      చాలా సంతోషం. ఇంకెందుకు ఆలస్యం.. ఆ గుర్రం విషయం చూడండి ఇక.
      ఇంక సక్సెసే..మరొకటిలేదు మీకు ఆప్షన్... :)

      Delete
  5. మనోహర్ చిమ్మని గారు..
    చందు తులసి గారి సుదీర్ఘ ప్రశ్న కి సమాధానం మీ దగ్గర ఉందొ, లేదో కాని మీరిచ్చిన రిప్లై మాత్రం తప్పేమో...
    నేనో రాజకీయ నాయకుణ్ణి ఒక విషయం పైన విమర్శించానే అనుకోండి.., అప్పుడు మీరు నాయకుడు కండి అనము. ఒక హోటల్ లో ఏదైనా నచ్చలేదు అంటే, మనమే వెళ్లి వంట చేసుకోవాలని కాదు.. ఇలా అంతట ఉంటుంది..కాని ఎవరైనా సినిమా ని విమర్శిస్తే, వెంటనే మిరే సినిమా తీసి చూపించండి..అంటూ సమాధానం దాటవేస్తారు...
    చందు గారు చెప్పింది.., డబ్బులు కావాలంటే చెత్త మాత్రమె తీయాలని భావిస్తున్న వారి గురించి..ఇక్కడ మీరు "పూరి" ని రిఫెరేన్స్ గా తీసుకొన్నారు కాబట్టి, వారు పూరి జగన్నాథ్ సినిమాలనే రిఫరెన్స్ గా తీసుకోని, వారి ఆర్గుమెంట్ వినిపించారు.. వారి ఇంటర్వ్యు లో మాటలకి, ఆయన తీసిన సినిమా కి, ఆయన నిజంగా అలోచిన్చేదానికి (మనం అనుకొంటే) వత్యాసం ఉంది, అని చెప్పినప్పుడు..అది "హిపోక్రసీ" కాదా??
    సినిమా కచ్చితంగా బిజినెస్సే..! అయితే బుజినేస్స్ చేయాలంటే అడ్డ దారే గొప్ప అనుకొనేవాడు ఉండొచ్చు.., రూల్ మధ్యలో తెలివిగా ఆడుకొనే వాడు ఉండొచ్చు..ప్రేమ తో బిజినెస్ చేసేవాడు ఉండొచ్చు..ఏ ఒక్కడు కరెక్ట్ కాకపోవచ్చు.. అందుకని కచ్చితంగా మీరు చెప్పింది సగం మాత్రమె నిజం కావచ్చు..కాని మిగితా సగం కచ్చితంగా అబద్దం.. (కళ ఖండాలు అంటే మీ నిర్వచనం ఏంటో తెలియాలి )

    ReplyDelete
    Replies
    1. "కమర్షియల్ సినిమాలు తీయడం అడ్డదారి.." అన్న తర్వాత ఇంక చర్చే అనవసరం అని నా ఉద్దేశ్యం. థాంక్యూ ఫర్ యువర్ కామెంట్స్, వంశీ గారూ!

      Delete