Thursday 23 January 2014

అక్కినేనిలో నాకు నచ్చిన ఒకే ఒక్క అంశం..

అక్కినేని నటించిన సినిమాల్లో నేనిప్పటికీ చాలా బాగా ఇష్టపడే సినిమా.. దేవదాసు.

ఆయన నటించినవాటిల్లో ఇంకెన్నో అద్భుతమైన సినిమాలుండగా దేవదాసు ఒక్కటే ఎందుకంత బాగా నచ్చిందీ అంటే.. అదంతే. దాని గురించి రాయాలంటే ఒక బ్లాగ్ పోస్ట్ చాలదు. ఓ పుస్తకమే రాయొచ్చు. అదలా ఉంచుదాం.

కేవలం నాలుగో తరగతివరకు మాత్రమే చదువుకొన్న అక్కినేని, ఆరోజుల్లోనే నటనను వృత్తిగా ఎన్నుకొనే సాహసం చేశారు. ఎన్‌టీఆర్ వంటి దిగ్గజం మరోవైపు గట్టిపోటీ ఇస్తున్నా, తట్టుకొని హీరోగా శిఖరాగ్రస్థాయికి ఎదిగగలిగారు. 256 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సంపాదించారు. ఎంతో డబ్బు కూడా సంపాదించారు.  

తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మద్రాసు నుంచి హైద్రాబాదుకు తీసుకురావడంలో ఆయన ఓ అపర బగీరథుడయ్యారు. ఆ విషయంలో వందశాతం సక్సెస్ సాధించారు.

తను స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోను బాగా అభివృధ్ధి చేసి, దానికో బ్రాండ్ ఇమేజ్ తీసుకురాగలిగారు. కొడుకు నాగార్జునని ఒక భారీ హీరోను చేయగలిగారు.

ఆయన ఇన్‌స్పిరేషనే కొనసాగిస్తూ - మనవళ్లు సుమంత్, నాగచైతన్య, సుశాంత్ లు కూడా హీరోలయ్యారు. మనవరాలు సుప్రియ కూడా హీరోయిన్‌గా చేసింది. రేపు, ఇంకో మనవడు అఖిల్ కూడా హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు.

ఇదంతా ఒక "రాగ్స్ టూ రిచెస్" సక్సెస్ స్టోరీ. ఎలాంటి సందేహం లేదు.

కానీ - వీటన్నింటిని మించి, అక్కినేనిలో నాకు బాగా నచ్చిన అంశం ఒక్కటే ఒక్కటి.

అక్కినేని అందరిలా దేవుణ్ణీ, అదృష్టాన్నీ ఎప్పుడూ నమ్మలేదు. పక్కా నాస్తికుడు. తన కృషి, పట్టుదలలే తన నిజమైన దేవుడనుకొని ఒక క్రమశిక్షణతో కష్టపడ్డారు. తను అనుకున్న ప్రతీదీ సాధించారు. ప్రతి అనుభవాన్నీ సంపూర్ణంగా ఆస్వాదించారు.

దేవుడినో, అదృష్టాన్నో నమ్ముకోకుండా ఇన్ని విజయాలు సాధించడం, ఇంత సంపూర్ణ జీవితం గడపగలగటం అనేది చాలా గొప్ప విషయం. అక్కినేనిలో నాకు నచ్చింది ఇదే.  

5 comments:

  1. చాలా బాగా చెప్పారు...

    ReplyDelete
  2. అక్కినేని ఎక్కలేని మెట్టు లేదు, అందుకోలేని శిఖరం లేదు

    ReplyDelete